పార్టీ రుణం తీర్చుకుందాం

ABN , First Publish Date - 2022-05-10T08:36:15+05:30 IST

‘‘ఇప్పుడు మనం కీలక దశలో ఉన్నాం. అడుగులు ముందుకు వేయడం తప్ప మరో మార్గం లేదు.

పార్టీ రుణం తీర్చుకుందాం

కలిసికట్టుగా, క్రమశిక్షణతో నిస్వార్థంగా పని చేద్దాం: సోనియా

న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇప్పుడు మనం కీలక దశలో ఉన్నాం. అడుగులు ముందుకు వేయడం తప్ప మరో మార్గం లేదు. పార్టీ రుణం తీర్చుకోవాల్సిన సమయమిది. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎదుర్కోవడానికి మంత్రదండాలు ఏమీ లేవు. కలిసికట్టుగా, క్రమశిక్షణతో, నిస్వార్థంగా పని చేయడమే మన తక్షణ కర్తవ్యం. అప్పుడు మాత్రమే మన సత్తా, చిత్తశుద్ధి బయటపడతాయి’’ అని పార్టీ నేతలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పునరుత్థానానికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను కలిసికట్టుగా పంపించాలని కోరారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 13-15 తేదీల్లో కాంగ్రెస్‌ మేధో మథన సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు ఎజెండాను రూపొందించేందుకు సోనియా అధ్యక్షతన సోమవారం పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబరులోని హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్నీ సదస్సులో చర్చించనున్నారు.  ‘‘మనందరి జీవితాల్లో పార్టీయే కీలకం.

పార్టీకి పూర్తి అంకిత భావంతో పని చేయాల్సిన సమయమిది. పార్టీ వేదికలపై ఆత్మ విమర్శ అవసరమే. కానీ, ఆత్మ విశ్వాసాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ఆ విమర్శలు ఉండకూడదు. పార్టీని నిరాశ, నిరుత్సాహంలో ముంచేలా ఉండకూడదు. పార్టీ రుణం తీర్చుకోవడానికి, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మనమంతా మేధో మథనం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. పార్టీలో నేతలకు ఒకే పదవి ఉండాలని పునరుద్ఘాటించారు. సోనియా, రాహుల్‌తోపాటు ఇతర సీడబ్ల్యూసీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సంస్థాగత సంస్కరణలు, సామాజిక న్యాయం, సాధికారత, వ్యవసాయం, రైతుల సమస్యలు, పార్టీలో బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌, జిల్లా, బూత్‌ స్థాయుల్లో పదవుల నియామక అధికారం రాష్ట్ర యూనిట్లకు అప్పగించడం, బీజేపీని ఎదుర్కొనేందుకు అవలంబించాల్సిన సైద్ధాంతిక ఎత్తుగడలపైనా సమావేశంలో చర్చించారు. ఆగస్టు 21- సెప్టెంబరు 20 తేదీల మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

Read more