హృదయానికి శాంతినిద్దాం

ABN , First Publish Date - 2022-05-27T05:41:21+05:30 IST

మనుషులను ఏదో ఒక నిరాశ వెంటాడుతూ ఉంటుంది. అది తరతరాలుగా ఉన్నదే. అన్నీ ఉన్నా, ఏమీ లేకున్నా... నిరాశ నిరంతరం వేధిస్తూ ఉంటుంది.

హృదయానికి  శాంతినిద్దాం

మనుషులను ఏదో ఒక నిరాశ వెంటాడుతూ ఉంటుంది. అది తరతరాలుగా ఉన్నదే. అన్నీ ఉన్నా, ఏమీ లేకున్నా... నిరాశ నిరంతరం వేధిస్తూ ఉంటుంది.


ఒక చిన్నపిల్లవాడు వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. ‘‘డాక్టర్‌ గారూ! నేను ఎక్కడ తాకితే అక్కడ నొప్పిగా ఉంటోంది. మోకాళ్ళు తాకినా నొప్పే. తల తాకినా నొప్పే... చెవులు, ముక్కు... ఇలా ఎక్కడ తాకితే అక్కడ నొప్పి. ఏమయిందో చూడండి’’ అని అడిగాడు. వైద్యుడు ఆ పిల్లవాడిని పరీక్షించి... ‘‘నాయనా! నీ వేలు తెగింది కదా. అందుకే అది ఎక్కడ తగిలినా నొప్పి కలుగుతోంది’’ అని చెప్పాడు.


మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతోంది. ఎందుకంటే, నిరాశకు కారణం... మన అవగాహనా లోపమే. ఈ లోపం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. అలాగే... అవగాహన మనలో ఉంది. దాని లోపం కూడా మనలోనే ఉంది. మనం దేనికి చేయూతనిస్తామో... అది ప్రస్ఫుటం అవుతుంది. మనకు కోపం రావడానికి క్షణం కూడా పట్టదు. కారణం... అది మన లోపలనుంచే వస్తోంది. కాబట్టే చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఒత్తిడికి గురికావడం... ఇవన్నీ క్షణాలమీద జరిగిపోతాయి. 


ప్రాపంచిక విషయాల్లో అందరూ తలమునకలైపోవడం వల్ల ప్రశాంతత పూర్తిగా కరువైంది. కానీ శాంతి కోసం ప్రయత్నించడానికి సమయం లేదంటారు. వయసు మీద పడ్డాక... అంతవరకూ సంపాదించి పెట్టినదంతా అటూ ఇటూ ఖర్చయిపోతుంది. ఎందుకంటే ప్రశాంతంగా జీవితాన్ని ఎన్నడూ గడపలేదు. ఈ విధమైన పరిస్థితులు మన జీవితంలో తలెత్తుతున్నాయంటే... మనం వెళ్ళే దిశ సరైనది కాదని గ్రహించాలి. ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమస్య ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. వాటి నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి సమస్యలు ఎప్పటికీ అంతం కావు. సమస్య ఒక ఈగలాంటిది. అది ఇప్పుడు మీమీద వాలింది. కాసేపటికి మరొకరి మీద వాలుతుంది. సమస్యలు అనేక రూపాల్లో మనిషిని వెంటాడుతూ... నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం బతికున్నంతకాలం ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. మారేది కేవలం మనుషులే. అయినప్పటికీ, మనిషి తన సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని... బంధవిముక్తుడు కాగలడు కానీ... సమస్యలు వాటంతట అవే తొలగిపోవాలనుకుంటే... అది జరిగేపని కాదు. వాటికి మీరు దూరంగా పారిపోలేరు, దగ్గరకు వెళ్ళలేరు. ఎందుకంటే... మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అవే వెతుక్కుంటూ వచ్చి మీద పడతాయి. 


రోడ్డు పక్కన నిలబడిన ఒక వ్యక్తి గడియారం చూసుకుంటూ ‘నా బస్సు రావడం లేటైతే ఆఫీసుకు సమయానికి చేరుకోలేను’ అని టెన్షన్‌ పడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ‘నేను టైమ్‌కు చేరుకోలేకపోతే కాంట్రాక్ట్‌ వేరొకరికి వెళ్ళిపోతుందేమో’ అని టెన్షన్‌ పడతాడు. సమస్య వేరైనా టెన్షన్‌ ఒక్కటే. అందరినీ ఒకేలా ఇబ్బంది పెడుతుంది. వీటన్నిటిమధ్యా మనం ఆలోచించని విషయం ఒకటుంది. ‘జననం’ అనే గోడ లోంచి మనం బయటకు వచ్చాం. మరోవైపు ‘మరణం’ అనే మరో గోడ ఉంది. దానిలోకి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక ఏమవుతుందో, ఎక్కడకు వెళ్తామో ఎవరికీ తెలీదు. ఒకవైపు జననం, మరోవైపు మరణం ఉన్నాయి. ఏదైనా జరిగితే ఈ మధ్యలోనే జరగాలి. మరి మీకేం కావాలి? 


ఏదైనా సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని ‘మీకేం కావాలి?’ అని అడిగితే, ‘ఈ సమస్య నుంచి నన్ను ఎలాగైనా గట్టెక్కించండి’ అని కోరుతాడు. మీకు తెలుసో లేదో కానీ.. ఏదో ఒకరోజు ఆ బాధ మీకు లేకుండా పోతుంది. అయితే మరి జీవితమంతా ఎప్పుడూ ఈ బాధల దుఃఖం నుంచి తప్పించుకొని దూరంగా ఉండడానికేనా? అంతకుమించి మరేదీ లేదా? దుఃఖాల బాధ ఎంత సహజమో, సుఖ సంతోషాలు రావడమూ అంతే సహజం. ప్రస్తుతం మీకు కాలం బాలేదని అనిపిస్తూ ఉంటే... కాస్త ఓర్పు వహించండి. సుఖ సంతోషాలకు కూడా సమయం వస్తుంది. సుఖసంతోషాల్లో కాస్త ఓర్పు వహించండి దుఃఖ భాధలు మళ్ళీ వస్తాయి. ఇవన్నీ ఇలా జరగడం సహజం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ జీవితం లభించినది సమస్యల నుంచి విముక్తి పొందడానికి కాదు. అంతకుమించి కూడా ఉంది. దాని గురించి మీరు ఆవేదన చెందితే మీ జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఈ ప్రపంచంలో మీరు ప్రశాంతంగా, హాయిగా ఉండగలగాలి. ఆ ప్రశాంతత ఎలా ఉండాలంటే... ముందుగా మీ హృదయం శాంతించాలి. కానీ, ఆ తరువాత ప్రాపంచిక విషయాల్లో, బాహ్య విషయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని అనుకోకండి. అప్పు డు కూడా సమస్యలైతే వస్తాయి. కానీ మీకు జీవించే పద్ధతి తెలిసి ఉంటుంది కాబట్టి వేదనకు గురికాని మార్గంలో మీ ప్రయాణం సాగుతుంది. అలా జరగడం సాధ్యమే. సమస్యలను నిరోధించడం సాధ్యం కాదు.. కానీ వాటివల్ల ఆవేదన చెందకుండా.. ప్రశాంతంగా జీవించగలగడం తప్పక సాధ్యమవుతుంది. 



ప్రేమ్‌ రావత్‌, 9246275220

www.premrawat.com, www.rajvidyakender.org 

Updated Date - 2022-05-27T05:41:21+05:30 IST