వీళ్లు రైతు గోడు వింటారు

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

రైతంటే తెలుగు సినిమాల్లో సానుభూతి కురిపించే ఒక సబ్జెక్టు, ఓట్ల రాజకీయాలకు ప్రధాన ఆబ్జెక్టు మాత్రమే.

వీళ్లు రైతు గోడు వింటారు

రైతంటే తెలుగు సినిమాల్లో సానుభూతి కురిపించే ఒక సబ్జెక్టు, ఓట్ల రాజకీయాలకు ప్రధాన ఆబ్జెక్టు మాత్రమే. అంతకుమించి సమస్యల శిలువను మోసే అన్నదాతల గోడు పట్టేదెవరికి అనుకుంటే పొరపాటే.! వందన, భార్గవి, అనూష... వీళ్లు ‘కిసాన్‌ మిత్ర’ ఉచిత సహాయ కేంద్రం కౌన్సెలర్లు. రోజూ రైతుల బాధలు వింటారు. కష్టాలతో అవిసి పోయిన మనసులకు తమ మాటలతో సాంత్వన కలిగిస్తారు. సమస్యల పరిష్కారానికి మార్గం కూడా చూపిస్తారు. ఏడేళ్లుగా హెల్ప్‌లైన్‌ ద్వారా కుంగుబాటులో కూరుకుపోయిన కర్షకులకు మాట సహాయం అందిస్తున్న ఈ ముగ్గురు రైతు మిత్రులు తమ అనుభవాలను నవ్యతో పంచుకున్నారు. 


‘‘మాకు ఒక్కోరోజు రైతుల నుంచి రెండు వందల ఫోన్‌కాల్స్‌ కూడా వస్తుంటాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కొందరైతే, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అనుకొని తిట్లదండకంతోనే తమ సమస్యలు ఎకరువుపెడుతుంటారు. అయినా, వాళ్లనెన్నడూ మేము పల్లెత్తుమాట అనం. ఎంత కష్టంలో ఉంటే, వారంత కోపంతో మాట్లాడుతున్నారో అనుకుంటాం.! కుంగుబాటుతో ఫోన్‌ చేసిన అన్నదాతలకు మాటలతో ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తాం. రెవెన్యూ, పంట రుణాలు, రాయితీలు, నకిలీ విత్తనాలు వంటి సమస్యలైతే కిసాన్‌ మిత్ర వలంటీర్ల చొరవతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతాం. అవి పరిష్కారమయ్యేంత వరకు కృషి చేస్తాం. అలా ఈ ఏడేళ్లలో కొన్ని వేల మంది రైతుల బాధలు విన్నాం. వాళ్లకు మా వంతు సహకారం అందించగలిగాం. ఒకరోజు అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని ఒక గ్రామం నుంచి ఓ రైతు కూతురు ఫోన్‌ చేసి, తన తండ్రి పురుగుల మందు తాగబోతుండగా చూసి అడ్డుకున్నానని చెబుతూ, బోరుని ఏడ్చింది. ఆ వెంటనే అతనికి ధైర్యం చెప్పడంతో పాటు అసలు సమస్య గురించి తెలుసుకున్నాం. ముగ్గురు కూతుళ్ల పెళ్లి ఖర్చుతో అప్పులపాలైన ఆ రైతు, తనకున్న రెండు ఎకరాలను అమ్ముదామనుకున్నాడు. కానీ అన్నదమ్ములు అడ్డుపడటంతో కేసు కోర్డు వరకూ వెళ్లినా, ఇతనే గెలిచాడు. అయినా, రెవెన్యూ అధికారులు హోల్డులో పెట్టడంతో అమ్ముకోలేకతున్నాడు. అప్పులవాళ్లు రోజూ ఇంటికొచ్చి అనరాని మాటలతో అవమానిస్తుండటంతో చనిపోవాలని అనుకున్నట్టు చెప్పాడు. అప్పటికప్పుడు మా కార్యకర్త సంబంధిత అధికారులకు కోర్డు ఆర్డరు చూపించి, నిలదీయడంతో సమస్య సమసిపోయింది. ఇప్పటికి అతను అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి పలకరిస్తుంటాడు.  ఇలాంటి కేస్‌ స్టడీస్‌ మమ్మల్ని మరింత ఉద్యుక్తుల్ని చేస్తాయి. అలా ఈ ఏడేళ్లలో ఎంతో మందిని కిసాన్‌ మిత్ర కాపాడింది. 


బాధించిన ఘటనలు...

ఇన్నేళ్ల అనుభవంలో మమ్మల్ని తీవ్రంగా బాధించిన ఫోన్‌కాల్స్‌ కూడా కొన్నున్నాయి. అందులో ఒకటి... చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకును రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఒక అవిటి తండ్రి, ప్రమాద బీమా కోసం మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. ఆ ఘటన మా మనసుల్ని ఇప్పటికి మెలిపెడుతుంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలానికి చెందిన అతను ఎప్పుడు ఫోను చేసినా, తనకి మేము ఏమీ చేయలేకపోతున్నామని గిల్టీగా అనిపిస్తుంది. మరొక కేసులో అప్పుల బాధ భరించలేక తండ్రి ఆత్మహత్య చేసుకుంటే, ఆ పరిహారం చేతికి అందితే బాకీలు తీరుద్దామని నాలుగేళ్లుగా ఎదురుచూసిన, అతని కొడుకు కూడా అప్పులోళ్ల ఒత్తిడి భరించలేక చివరికి ఉసురుతీసుకున్న ఘటన మాకు కొద్దిరోజుల పాటు నిద్రలేకుండా చేసింది. రైతు ఆత్మహత్య కుటుంబాలకు పరిహారం అందడంలో ప్రభుత్వ యంత్రాంగం చాలా జాప్యం చేస్తుంది. కొన్ని కేసుల్లో అయితే, విచారణకు వచ్చినప్పుడు ఇంట్లో మనుషులు లేరని తిరస్కరిస్తున్నారు. అధికారులు వస్తారని, ఇళ్లవద్దే రైతులు కూర్చోరు కదా.! బడ్జెట్టు లేదనే కారణంగా పరిహాం ఇవ్వని కేసులూ బోలెడున్నాయి. ఈ సమస్యమీద రెండు రాష్ట్రాల నుంచి మాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. 


జీవనోపాధి చూపిస్తూ...

రైతు ఆత్మహత్యకుటుంబాల్లోని ఒంటరి మహిళలకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘కిసాన్‌ మిత్ర’ జీవనోపాధి మార్గాలనూ చూపిస్తుంది. అలా అప్పటి కలెక్టరు దివ్యాదేవరాజన్‌ సహకారంతో వికారాబాద్‌ జిల్లాలోని 150మందికి సహాయం చేయగలిగాం. మంచిర్యాలలోని మరో పాతికమందికి తోడ్పడగలిగాం. రైతు ఆత్మహత్య కుటుంబాలలోని శారద, నిర్మల అనే ఇద్దరు మహిళలకు ఇల్లు గడవడమే కష్టంగామారిందని మా దృష్టికొచ్చింది. వాళ్లు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా, పరిహారం అందలేదు. అందుకు కారణాలు తెలియరాలేదు. మావంతుగా వాళ్లిద్దరితో చిన్నపాటి వస్త్రదుకాణం పెట్టించాం. అలా గేదెలు కొనివ్వడం, బడ్డీకొట్టు, కుట్టుమిషను వంటి జీవనోపాధికి అవసరమైన అర్థిక సహాయం అందిస్తున్నాం. ఆంధ్రాలో ఒక రేషన్‌ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని అమలుచేయడం వల్ల, ఒకే కుటుంబంలోని వితంతువులైన అత్త, కోడళ్లు చాలా ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికొచ్చింది. వితంతువులకు ఇచ్చే పింఛను విషయంలో ఇలాంటి సంకుచిత నిబంధన పెట్టడం సరికాదు కదా.! మన ప్రభుత్వ విధాన కర్తలకు సున్నితంగా ఆలోచించడం ఎప్పుడు తెలుస్తుందో.! ఏమో.! 


ఆంధ్రప్రదేశ్‌ నుంచి...

ఏపీ నుంచి మాకు వచ్చే ఫోన్‌కాల్స్‌లో ఎక్కువగా... ఉపాధిహామి పథకానికి బిల్లులు, వేతనాలు అందడం లేదని చాలామంది రైతులు చెబుతున్నారు. అదేమని అధికారులను అడిగితే, నిధుల కొరత అంటున్నారు. ‘మీ భూమి’ నమోదు పోర్డల్‌లో ఒకరి వ్యవసాయ భూమి సర్వే నెంబర్లు మరొకరికి వేయడం. కొన్ని సర్వే నెంబర్లు అస్సలు కనిపించకపోవడం. కొందరు రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని సర్వే చేయకుండానే ఒకరి పొలాన్ని మరొకరి పేరుమీద ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మార్వోల డిజిటల్‌ సిగ్నేచర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా మా దృష్టికి వస్తున్నాయి. 


తెలంగాణ నుంచి...

మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. రిజిస్ట్రేషన్‌ ఽఫీజు పెంచడం. ఆన్‌లైన్‌లో నాలుగు వందల ఎకరాలుంటే, వాస్తవంగా మూడువందల ఎకరాలే ఉండటం. ధరణిలో సర్వే నెంబర్ల తారుమారు. స్లాట్‌ రద్దుచేసుకున్న తర్వాత, ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోవడం. పాస్‌బుక్‌లోని తప్పులను సరిచేసుకునేందుకు సరైన సౌలభ్యం లేకపోవడం. పంట రుణాలు ఇవ్వడంలో జాప్యం. బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి రైతులను తిప్పుకోవడం. సహకార బ్యాంకుల్లో అసైన్డ్‌ భూములమీద రుణాలు ఇవ్వకపోవడం వంటి సమస్యల మీద ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి. 


సహనంతో సమాధానం...

ఇలా రకరకాల సమస్యలతో మమ్మల్ని సంప్రదించే రైతులకు అర్థమయ్యే రీతిలో సమాధానం ఇవ్వడం మా బాధ్యత. అందుకు చాలా సహనం అవసరం. అది మా ముగ్గురికి పుష్కలంగా ఉంది. మేము ఓపికతో చెప్పే సమాధానం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది అనే విషయం మాకు ప్రతిక్షణం గుర్తుంటుంది. వ్యవసాయంలో మహిళల పాత్ర ప్రధానం. అలాంటిది మాకు ఆడవాళ్ల నుంచి ఫోన్‌కాల్స్‌ చాలా చాలా తక్కువస్తుంటాయి. భూమి, రెవెన్యు, పంట రుణాలు, బ్యాంకు వ్యవహారాలు తదితర అంశాలమీద ఆడవాళ్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మగవాళ్లదే. ఇదే విషయాన్ని కాలర్స్‌కు పదే పదే గుర్తుచేస్తుంటాం..!

కె. వెంకటేశ్‌, ఫొటోలు: హరిప్రేమ్‌


కిసాన్‌ మిత్ర చొరవతో...

రూరల్‌ డెవల్‌పమెంట్‌ సర్వీసు సొసైటీ, వివిధ సామాజిక, ప్రజా సంఘాలు కలిసి రైతుల సమస్యలమీద పనిచేస్తున్న క్రమంలో వికారాబాద్‌ జిల్లా అప్పటి కలెక్టరు దివ్యదేవరాజన్‌ ప్రోత్బలంతో 2017లో ‘కిసాన్‌ మిత్ర’ హెల్ప్‌లైన్‌ ప్రారంభమైంది. తర్వాత ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఉమ్మడి కడప తదితర జిల్లాల్లో గ్రామ స్థాయి వలంటీర్ల శిక్షణతో సేవలు మరింత విస్తృతమయ్యాయి. సాధారణ హెల్ప్‌లైన్‌కు భిన్నంగా సమస్య తీవ్రత ఆధారంగా ప్రాధాన్యత ఇస్తూ, కిసాన్‌ మిత్ర పనిచేస్తోంది. తద్వారా సుమారు యాభైవేలమందికి పంట నష్టపరిహారం అందింది. 5000మంది కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు వచ్చాయి. రైతు ఆత్మహత్య కుటుంబాల్లోని సుమారు 200మంది ఒంటరి మహిళలకు జీవనోపాధి లభించింది. ఇదంతా కిసాన్‌ మిత్ర కార్యకర్తల సమిష్టి కృషితోనే సాధ్యమైంది.


మాట సాయం కోసం...

మానసిక ఒత్తిడికి లోనైన రైతుల బాధలు వినడానికి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కిసాన్‌ మిత్ర కౌన్సెలర్లు 9490900800 నెంబరులో అందుబాటులో ఉంటారు. ప్రత్యేకంగా వికారాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, యాదాద్రి-భువనగిరి, ఉమ్మడి అనంతపురం, విశాఖ జిల్లాల రైతులకు భూమి, రెవెన్యూ, పంట రుణాలు, ఉపాధి హామి పథకం, మార్కెట్‌, ధరలు తదితర సమస్యల పరిష్కారం కోసం కిసాన్‌ మిత్ర వలంటీర్లు సహాయకారిగా ఉంటారు. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST