Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 14 May 2022 03:14:40 IST

కాంగ్రెస్‌ సభను తలదన్నేలా!

twitter-iconwatsapp-iconfb-icon
కాంగ్రెస్‌ సభను తలదన్నేలా!

  • సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేడు
  • తుక్కుగూడలో భారీ సభ.. ముఖ్య అతిథిగా అమిత్‌ షా
  • సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు కసరత్తు
  • దాదాపు 40 ఎకరాల్లో సభ నిర్వహణ
  • 1500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు
  • సంజయ్‌ నుంచి మరో కీలక ప్రకటన 
  • ఉంటుందంటున్న బీజేపీ శ్రేణులు(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ‘ప్రజల గోస- బీజేపీ భరోసా’ పేరిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ శనివారం ముగియనుంది. ఈ సందర్భంగా, తుక్కుగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. సభాస్థలిలో భారీ స్థాయిలో కటౌట్లు, జెండాలు ఏర్పాటు చేయడంతో ప్రాంగణమంతా కాషాయమయంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభను తలదన్నేలా అమిత్‌ షా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 ఎకరాల్లో ప్రాంగణం ఏర్పాటు చేశారు. 5 లక్షల మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి జనాన్ని భారీగా సమీకరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక నియోజకవర్గ నేతలకు టార్గెట్లు పెట్టారు. మహేశ్వరం నుంచే దాదాపు 50 వేల మందికిపైగా తరలించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాంగణం తుక్కుగూడ చౌరస్తా సమీపంలో ఉండడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారికి అనుకూలంగా ఉంది. 


వేదికలో మార్పులు

అమిత్‌ షా బహిరంగ సభ వేదిక ఏర్పాట్లు దాదాపు పూర్తయిన తర్వాత ఎస్పీజీ కొన్ని సూచనలు చేసింది. సభ సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రారంభమవుతున్నందున.. వేదిక పైకప్పుపై వేసిన రేకులు తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో గాలి ఎక్కువగా వీస్తున్నందున.. రేకులు లేస్తే ప్రమాదాలకు అవకాశం ఉందని పేర్కొంది. పార్కింగ్‌ ప్రాంతం వేదిక వద్దకు రాకపోకలు సాగించే రహదారికి ఆనుకుని ఉండడంతో దాన్ని మార్చాలని సూచించింది. అమిత్‌ షా రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, సంజయ్‌, పాదయాత్రలో పాల్గొన్న సంగ్రామ సేన, మహిళలకు గ్యాలరీలు సిద్ధం  చేశారు.


ఒక్క చాన్స్‌ ప్లీజ్‌

‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ పాలన చూశారు. తెలంగాణ  టీఆర్‌ఎస్‌ పాలన చూశారు. మాకూ ఒక్క అవకాశం ఇవ్వండి’ అన్న ప్రధాన నినాదంతో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందుకు ప్రజా సంగ్రామ యాత్రను వేదికగా చేసుకుంటోంది. కేంద్రంలో మోదీ సర్కారు కొనసాగుతోందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలన వస్తే డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారం చేయనుంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు పక్కాగా అమలు చేయాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే సాధ్యమని స్పష్టం చేయనుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కుల, కుటుంబ రహిత, జవాబుదారీ పాలన అందిస్తామని భరోసా ఇవ్వనుంది.

కాంగ్రెస్‌ సభను తలదన్నేలా!

బండి సంజయ్‌ మరో కీలక ప్రకటన?

బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలో పేదల కోసం సంజయ్‌ కీలక హామీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన సభలో కూడా సంజయ్‌ విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు. తన పాదయాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో పేదలు చదువు కోసం, వైద్యం  కోసం కష్టపడ్డ వైనాన్ని కళ్లారా చూసి ఈ హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండో విడత పాదయాత్రలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పింఛన్లు, ఉద్యోగుల సమస్యలు, జీవో 69 అమలు, వలసలు, పెండింగ్‌ ప్రాజెక్టులు, పంటలు నష్టపోయిన రైతులు, కులవృత్తులవారి సమస్యలపై సంజయ్‌కి వినతులు వెల్లువెత్తాయని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆయా అంశాల్లో ఒకటి రెండింటిపై సంజయ్‌ హామీ ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. కాగా, ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వచ్చిన వినతులను క్రోడీకరించి, వాటికి ఎన్నికల మేనిఫెస్టోలో పరిష్కార మార్గాలను పొందుపరుస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడించారు.


31 రోజులపాటు పాదయాత్ర

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారంతో 30 రోజులు పూర్తి చేసుకుంది. శనివారం కూడా యాత్ర ఉండడంతో 31 రోజులు కొనసాగినట్లు అవుతుంది. గత నెల 14న అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తుక్కుగూడలో శనివారం నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణం వరకు మొత్తం 383 కి.మీ.ల మేర యాత్ర కొనసాగినట్లు అవుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. గడచిన నెల రోజుల్లో కులవృత్తుల వారితో 21 సమావేశాలు, మరో 22 గ్రామ సభల్లో సంజయ్‌తోపాటు పార్టీ ముఖ్యులు పాల్గొన్నట్లు తెలిపారు.


నేడు సీఎఫ్‌ఎస్‌ఎల్‌

ల్యాబ్‌ను ప్రారంభించనున్న షా

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం సెమినార్‌ హాలులో నిర్వహించే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి తుక్కుగూడ వెళ్తారు. మెడికల్‌ కాలేజీకి దరఖాస్తు ఏదీ!?: కిషన్‌రెడ్డి

తుక్కుగూడలో అమిత్‌షా సభ ఏర్పాట్ల పరిశీలన

ఆదిభట్ల: మెడికల్‌ కళాశాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని, అసలు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనల దరఖాస్తులు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తండ్రీ కుమారులు కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతి, అరాచక పాలన సాగిస్తున్నారని, వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తుక్కుగూడలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, గరికపాటి మోహన్‌రావు  తదితరులు ఆయన వెంట ఉన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలను విపరీతంగా పెంచి చూపించడం, తర్వాత ఖర్చుల విషయంలో చేతులెత్తేయడం కేసీఆర్‌ మార్కు పాలన అంటూ కిషన్‌ రెడ్డి విమర్శించారు. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి.. ఇప్పుడు ఫామ్‌హౌజ్‌లో పడుకొని దేశ్‌కీ నేతా అంటూ కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అందుకు సంబంధించిన పూర్తి స్పష్టతను సభలో అమిత్‌ షా ఇస్తారని చెప్పారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.