కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొడదాం

ABN , First Publish Date - 2022-01-28T06:03:43+05:30 IST

లాభాల్లో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొడదాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

- సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, జనవరి 27: లాభాల్లో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీడీకే11ఇంక్లైన్‌లో యూనియన్‌ జెండాను ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి పూనుకున్నదన్నారు. సింగరేణి సంస్థను, ఆస్థులను కాపాడుకోవడం కోసం కార్మికులు మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించిన తరువాత జాతీయ కార్మిక సంఘాలకు ధీటుగా పని చేస్తూ సంస్థలో కార్మికులకు రావాల్సిన అనేక హక్కులపై పోరాటం చేసిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోందని, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి కార్మికులకు అనేక మౌలిక సదుపాయాలతో పాటు హక్కులను కల్పించిన ఘనత కేసీఆర్‌దని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ అన్నారు. కార్మికులకు, ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎదురించేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ గేట్‌ మీటింగ్‌లో టీబీజీకేఎస్‌ నాయకులు కెంగర్ల మల్లయ్య, గండ్ర దామోదర్‌రావు, కార్పొరేటర్‌ ఇంజపురి పులేందర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు వడ్డేపల్లి శంకర్‌, చెలుకలపెల్లి శ్రీనివాస్‌, కనకం శ్యామ్‌సన్‌, నాయిని శంకర్‌, జాన్‌ కెనడి, రామస్వామి, అడప శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T06:03:43+05:30 IST