మాట్లాడుకుందాం.. రా..!

ABN , First Publish Date - 2021-02-27T05:25:06+05:30 IST

జిల్లాలో కార్పొరేషన, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, రాయచోటి మినహాయిస్తే మిగతా మున్సిపాలిటీల్లో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టు, జనసేన తరపున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కడప కార్పొరేషనలో 386 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో

మాట్లాడుకుందాం.. రా..!

పోటీ నుంచి అభ్యర్థులను తప్పించేందుకు వైసీపీ ఎత్తుగడ

బంధువులు, స్నేహితుల ద్వారా రాయబారం

కాంట్రాక్టు పనులు, డబ్బులిస్తామని ఎర

వినని వారిపై కేసులకు యత్నాలు..?

కాక రేపుతున్న పురపోరు


వైసీపీ అధికార దర్పాన్ని ప్రయోగిస్తోందా..? మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం తాపత్రయపడుతోందా..? సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తోందా..? ఆ పార్టీ పొలిటికల్‌ వ్యూహాలను గమనిస్తే.. అవునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో మున్సిపల్‌, కార్పొరేషన ఎన్నికలు గత ఏడాది ఆగిన చోట నుంచే తిరిగి ఈసీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3 వరకు గడువు ఉండడంతో ఈ మధ్యలో ఉన్న వ్యవధిని అధికార పార్టీ ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మాట్లాడుకుందాం రా అని పిలిచి నామినేషన్లు వేసిన వారిని రకరకాల ప్రలోభాలతో పోటీనుంచి తప్పించేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం.


కడప, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్పొరేషన, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, రాయచోటి మినహాయిస్తే మిగతా మున్సిపాలిటీల్లో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టు, జనసేన తరపున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కడప కార్పొరేషనలో 386 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 288, రాయచోటిలో 174, బద్వేలులో 224, జమ్మలమడుగులో 131, యర్రగుంట్లలో 124, మైదుకూరులో 154, పులివెందుల మున్సిపాలిటీలో 51 నామినేషన్లు దాఖలయ్యాయి.


ఏకగ్రీవం కోసం ఎత్తుగడలు..

నామినేషన్లను వితడ్రా చేయించేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కడప కార్పొరేషనలో వీలైనన్ని డివిజన్లను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించేందుకు రకరకాల అసా్త్రలను ప్రయోగిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అభ్యర్థుల బంధువులు, సన్నిహితుల ద్వారా రాయబారాలు పంపి వితడ్రా చేసుకోవాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. మీ నామినేషనలు ఉపసంహరించుకుంటే పార్టీలో చేర్చుకుని మంచి ప్రాధాన్యత కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నట్లు సమాచారం. అలా వేసిన గాలానికి కొందరు చిక్కినట్లు చెబుతున్నారు. ‘పోటీ నుంచి తప్పుకోండి, ఎన్నికల బరిలో ఉంటే ఎలాగూ మీరు గెలవలేరు, డబ్బు ఖర్చవుతుంది. పోటీలో నుంచి తప్పుకుంటే మీరు పార్టీలోకి రావచ్చు, లేదా కాంట్రాక్టు పనులు ఇస్తాం.. ఎంతో కొంత సర్దుతాం’ అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు కార్పొరేషన సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో రాయబారాలు నడుపుతున్నారు. మాట వినని వారిని నయానో, భయానో లొంగదీసుకునేందుకు కూడా వెనుకాడడంలేదని చెబుతున్నారు. బైండోవర్‌ కేసుల పేరుతో కొందరిని బెదిరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కొందరికి పోలీసులు ఫోన చేసి మీపై బైండోవర్‌ నమోదు చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది బెదిరింపులు, గొడవలతో నామినేషన్లు వేయలేని వారు సరైన ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేస్తే ఈ సారి నామినేషనకు అవకాశమిస్తామని ఎన్నికల కమిషన ఇటీవల మరో అవకాశమిచ్చింది. దీంతో కడప కార్పొరేషన నుంచి 18 మంది అభ్యర్థులు తాము నామినేషన్లు వేయలేకపోయామని ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలు సేకరించి వారు బరిలో లేకుండా చేస్తున్నట్లు సమాచారం. అలాగే వైసీపీలో రెబల్స్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని కూడా బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు. బద్వేలు మున్సిపాలిటీలో అధికార పార్టీ టీడీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి పోటీ నుంచి తప్పించే యత్నాలు ముమ్మరం అయ్యాయి. దీన్ని పసిగట్టిన టీడీపీ స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటోంది. 14వ వార్డుకు పోటీ చేసిన అభ్యర్ధిని టీడీ పీలో చేర్చుకున్నారు. మరో స్వతంత్ర అభ్యర్థిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 13వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వరయ్య కనిపించడంలేదంటూ టీడీపీ నాయకులు పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేశారు. మైదుకూరులో కూడా నామినేషన్ల ఉపసంహరణకు రాయబారం మొదలైనట్లు చెబుతున్నారు. రాయబారం ఫలించకుంటే పోలీసుల ద్వారా వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎందుకు పోటీ చేసి ఇబ్బందిపడతారు, సర్దుకుపోండి అని కొందరు సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి బద్వేలులో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో ఆపరేషన ఆకర్ష్‌ ద్వారా పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు.


ధీటుగా కొందరు

పుర పోరులో బరిలో దిగిన కొందరు అభ్యర్థులు మాత్రం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. కడపలో ఒక అభ్యర్థితో చేసిన మంతనాలు ఫలించలేదని తెలుస్తోంది. గత కార్పొరేటరుగా డివిజన అభివృద్ధి కోసం కృషి చేశాను. ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అర్హులందరికీ అందించాం. మళ్లీ ప్రజల్లోకి వెళతా. ఓడినా, గెలిచినా పోటీలో మాత్రం ఉంటానని తెగేసి చెప్పారు. ఇక అభ్యర్థులు లేకుండా నామినేషన్ల ఉపసంహరణ చేపట్ట వద్దంటూ బద్వేలుకు చెందిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులు వితడ్రా చేసుకుంటామని సొంతంగా ముందుకు వస్తే తప్ప వితడ్రా చేయకూడదని అధికారులను కోరారు.


రెబల్స్‌పై వేటు

మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ రెబల్స్‌గా నామినేషన చేసిన వారు ఉపసంహరించుకోకుంటే వారిపై వేటు వేయాలని వైసీపీ నిర్ణయించింది. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, జిల్లా ఇనచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం అంజ ద్‌బాషా, మాజీమేయర్‌ సురే్‌షబాబు, అమర్‌నాధరెడ్డి, ఎంపీ అవినా్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి అనుచరులు పోటీ చేశారు. అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వైసీపీ నుంచి ఒకరే పోటీలో ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే వారిపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-02-27T05:25:06+05:30 IST