Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణంపై వైద్యుల సలహాలు తీసుకుందాం

వైకుంఠ ఏకాదశిలోపు పంచగవ్య ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి 


తిరుపతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘చిన్న పిల్లల గుండె వైద్యం ఆస్పత్రి నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై ఆయా వైద్య నిపుణుల నుంచి సలహాలు తీసుకుందాం. ఇందుకోసం ఓ సమావేశం ఏర్పాటు చేయండి’ అని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వైద్యుల సూచనలు తీసుకున్నాకే జి ప్లస్‌ ఫైవ్‌తో డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే అవసరమైన వైద్య పరికరాలను టెండర్‌ ద్వారా సమకూర్చుకోవాలన్నారు. దాతలు ముందుకొస్తే, వారిద్వారా సేకరించాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి అవసరమయ్యే పాలు, వెన్న, నెయ్యిని టీటీడీనే సమకూర్చుకోవాలని, ఇందుకుగాను అధిక పాలధార ఉన్న గోవులను గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. ఏడాదికి ఒక దూడను ఈని, సంవత్సరం పొడవునా పాలిచ్చే ఆవులను సేకరించాలన్నారు. ఇందుకోసం ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్‌ వెంకటనాయుడు, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక సైంటిస్టు, ఒక నైపుణ్యం గల రైతు, ఒక దాతతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో తయారవుతున్న పంచగవ్య ఉత్పత్తులకు ఒక బ్రాండ్‌ నేమ్‌ను త్వరగా నిర్ణయించి, వైకుంఠ ఏకాదశిలోపు అందుబాటులోకి తేవాలన్నారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, టీటీడీ ఉన్నతాధికారులు బాలాజీ, హరనాథరెడ్డి, శ్రీనాథ రెడ్డి, మరళీధర్‌, శేష శైలేంద్ర, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement