ధరణి సమస్యలు పరిష్కరిద్దాం

ABN , First Publish Date - 2022-07-06T08:34:52+05:30 IST

ధరణి పోర్టల్‌తో తలెత్తుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ధరణి సమస్యలు పరిష్కరిద్దాం

  • 15 నుంచి రెవెన్యూ సదస్సులు
  • మూడు రోజులకు ఒక మండలం
  • చొప్పున 100 బృందాలతో నిర్వహణ
  • సదస్సులకు స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వం
  • రైతుల భూసమస్యలకూ పరిష్కారం
  • అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • 11న ప్రగతి భవన్‌లో అవగాహన సదస్సు
  • గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి 
  • ఉపాధి శిక్షణ కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లు: కేసీఆర్‌
  • మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌తో తలెత్తుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం అధికారులతో చర్చించారు. ప్రధానంగా ధరణిలో భూమి కొనుగోలు దారుల పేర్లు నమోదు కాకపోవడం, విక్రయించిన వారి పేరు కొనసాగడంపై పలు ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నమోదైన భూ విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆయా సర్వే నెంబర్లలో చూపుతున్నట్టు పలువురు రైతుల నుంచి ఫిర్యాదులందుతున్నాయి. 


మరికొన్ని ప్రాంతాల్లో సర్వే నెంబర్‌ వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సంబంధిత భూమి లేకపోవడం, ఉన్నా విస్తీర్ణంలో అనేక వ్యత్యాసాలున్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనికితోడు ఆయా సర్వే నెంబర్లలోని కొంత స్థలంపై ఏర్పడిన వివాదం.. కోర్టు తీర్పులతో సర్వే నెంబర్‌లోని భూమి మొత్తానికి వర్తించే సాంకేతికపరమైన సమస్యలను అధికారులు గుర్తించారు. ఇటీవల సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో జూన్‌ 14న ఉన్నతాధికారుల బృందం.. ధరణి సమస్యలపై సర్వే నిర్వహించగా 270 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధరణితో తలెత్తిన సమస్యలతోపాటు ఆయా ప్రాంతాల్లోని రైతుల భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  నిర్ణయించారు. 100 బృందాలను ఏర్పాటు చేసి, మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 11న ప్రగతి భవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.


కళాశాలలుగా గురుకులాల అప్‌గ్రేడ్‌..

నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పాఠశాల స్థాయి గురుకులాలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల ద్వారా రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, వాటిని ఇంటర్మీడియట్‌, డిగ్రీ స్థాయి కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తే ఎక్కువ మంది ఉన్నత విద్యావకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని తెలిపారు. దీంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఉపాధి అందించే శిక్షణా కేంద్రాలుగా మార్చాలన్నారు. కేవలం ఉద్యోగార్థులకు మాత్రమే శిక్షణ అందించడం కాకుండా ఆయా రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేలా స్టడీ సర్కిళ్ల రూపురేఖలను మార్చాలని సూచించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2022-23 విద్యా సంవత్సరంలో 400 వరకు గురుకుల పాఠశాలలు కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ కానున్నాయి. 


రాష్ట్ర వ్యాప్తంగా 261 బీసీ గురుకుల విద్యాలయాలు, 230 ఎస్సీ, 105 ఎస్టీ, 207 మైనారిటీ కలిపి మొత్తం 803 గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రస్తుతం అన్ని కేటగిరీల్లో 600 వరకు గురుకుల కళాశాలలను నిర్వహిస్తుండగా.. ప్రణాళికా బద్ధంగా మరిన్ని పాఠశాలలను కళాశాలలుగా అప్‌ గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇదివరకు గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అక్కడే ఇంటర్‌ కోర్సుల్లోనూ చేరేందుకు అవకాశం కలగనుంది. సమీక్షలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా,  గురుకులాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T08:34:52+05:30 IST