అమరావతి భూములు అమ్మేద్దాం!

ABN , First Publish Date - 2022-06-26T07:28:13+05:30 IST

అమరావతి భూములు అమ్మేద్దాం!

అమరావతి భూములు అమ్మేద్దాం!

మౌలిక సదుపాయాల కోసమంటూ రాజధానికి రైతులిచ్చిన భూముల విక్రయం

2,480 కోట్ల సమీకరణకు సీఆర్డీయే ప్లాన్‌... పచ్చ జెండా ఊపిన సర్కారు.. జీవో జారీ

తొలి విడతలో మెడ్‌సిటీ, లండన్‌ కాలేజీలకు కేటాయించిన 248.34 ఎకరాల విక్రయం

దశల వారీగా మరో 600 ఎకరాలు కూడా.. ఎకరా 10 కోట్ల చొప్పున అమ్మే ప్రతిపాదన

బ్యాంకులు అప్పులివ్వనందునే నిర్ణయం.. కార్పొరేషన్ల రుణాలకు బ్యాంకు గ్యారెంటీ

అమరావతికి మాత్రం ఇవ్వబోనన్న సర్కారు..  తాజా విక్రయ నిర్ణయంపై సర్వత్రా విస్మయం


అమరావతి/విజయవాడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): సంక్షేమం సహా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఎడా పెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. కీలకమైన రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో మాత్రం అప్పులకు బదులు ‘అమ్మకం’ మంత్రం పఠిస్తోంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను తానివ్వక.. అప్పు చేద్దామంటే హామీ కూడా ఉండక.. ఇక్కడి భూములు అమ్మేసి నిధులు సమకూర్చుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఎంతో దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది. 


ఏం జరిగింది?

అమరావతిలో రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో సేకరించిన భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి వ్యవహారాలను పర్యవేక్షించే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్డీయే) దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో వివిధ సంస్థలకు కేటాయించిన భూములను అమ్ముకోవటానికి వీలు కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 389) ఇచ్చింది. దీంతో భూసమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన వేల ఎకరాల్లో.. తొలి విడతలో 248.34 ఎకరాలను విక్రయించాలని సీఆర్‌డీయే నిర్ణయించింది. ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. నిర్దేశిత భూములను జూలైలో వేలం వేయనున్నారు. గత ప్రభుత్వం రాజధానిలో మెడ్‌సిటీ కోసం 100 ఎకరాలను కేటాయించింది. అదేవిధంగా లండన్‌ కింగ్స్‌ కాలేజీ నిర్మాణం కోసం 148.34 ఎకరాలు ఇచ్చింది. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘మూడు రాజధానులు’ అని ప్రకటించడంతో అమరావతిపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు ముందుకురాలేదు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో చివరకు అమరావతిలోనే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. దీనికిగాను అప్పట్లో ఆయా సంస్థలకు ఇచ్చిన స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. 


ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంటే..

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు విస్పష్టంగా తీర్పు ఇచ్చిన అనంతరం.. అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిందేనని చెప్పిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పలు బ్యాంకులతో సీఆర్డీయే సంప్రదింపులు జరిపింది. అయితే, ఏ బ్యాంకు కూడా అప్పు ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి.. ఇంకా అప్పులిచ్చేందుకు బ్యాంకులు సుముఖత చూపలేదని సమాచారం. అయితే, సీఆర్డీయేకు రుణం ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు మాత్రం సుముఖత చూపాయని తెలిసింది. కానీ, ఆ రుణాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించాయి. దీనికి ప్రభుత్వం సంసిద్ధత చూపకపోవడంతో బ్యాంకులు వెనక్కి తగ్గాయని సమాచారం. కార్పొరేషన్ల ద్వారా రూ.వేల కోట్ల రుణం తెచ్చేందుకు హామీ ఉంటున్న ప్రభుత్వం అమరావతి విషయంలో మాత్రం ఎందుకు హామీ ఉండలేదన్నది ప్రశ్నార్థకం. ఇదిలావుంటే, సీఆర్‌డీయే ఇటీవల మంగళగిరి సమీపంలో నవులూరులోని అమరావతి టౌన్‌షి్‌పలో మిగులు ప్లాట్ల వేలం ద్వారా రూ.300 కోట్ల ఆదాయాన్ని పొందాలని నిర్దేశించుకుంది. అదేవిధంగా సీఆర్‌డీయే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అన్ని అంశాలపై దృష్టి పెడతామని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో టౌన్‌షిప్‌ మిగులు ప్లాట్ల వేలంతో పాటు, రాజధానిలో పలు సంస్థలకు కేటాయించి, నిర్మాణాలు చేపట్టని భూములను అమ్మకడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రణాళిక వేసింది. ఈ ప్రణాళికకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.


దశల వారీగా.. విక్రయం

ఈ ఏడాది భూములు వేలం వేశాక.. దానికి వచ్చే స్పందన చూసి.. దశల వారీగా మరిన్ని భూములు విక్రయించాలని సీఆర్‌డీయే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మరో 600 ఎకరాలను దశలవారీగా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే, సీఆర్డీయే ప్రతిపాదించిన ధరకు కొనుగోలుదారులు ఏ మేరకు వస్తారన్నది చూడాలి. అమరావతిలో భూములకు ఎకరా రూ.10 కోట్లు పెద్ద ధర కాదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందిన అమరావతిలో అయితే నిజంగానే అంతకన్నా ధర ఉండేది. అయితే, మూడేళ్లుగా రాజధానిపై దోబూచులాడడం, ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా వ్యవహరించడంతో ఇప్పుడు నమ్మకంగా వేలంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆ ధర కూడా రాకుంటే.. ఇంకా తగ్గించి అయినా అమ్మేందుకు సీఆర్డీయే ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఉందని సమాచారం. ఇదిలావుంటే, ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు సహా ప్రజాసంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల త్యాగాలను అమ్మేయడమేనని విమర్శిస్తున్నారు.


జూలై తొలివారంలో వేలం ప్రకటన

అమరావతి భూముల అమ్మకం నిరంతర ప్రక్రియలా సాగనుంది. 600 ఎకరాల పైబడి భూములను విక్రయించాలని సీఆర్‌డీయే ప్రణాళిక నిర్దేశించింది. ప్రభుత్వం కూడా దశల వారీగా ఈ భూములు అమ్ముకోవటానికి తాజా జీవో 389లో లైన్‌ క్లియర్‌ చేసింది. ఈ క్రమంలో 248.34 ఎకరాల విక్రయానికి జూలై తొలివారంలోనే వేలం ప్రకటన విడుదల చేయనున్నారు.   



Updated Date - 2022-06-26T07:28:13+05:30 IST