ఇప్పటికి 10 సార్లు చెప్పాం.. మళ్లీ చెప్పాలా?

ABN , First Publish Date - 2022-01-20T07:57:16+05:30 IST

ఇప్పటికి 10 సార్లు చెప్పాం.. మళ్లీ చెప్పాలా?

ఇప్పటికి 10 సార్లు చెప్పాం.. మళ్లీ చెప్పాలా?

రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్‌

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

చెల్లించకపోవడంపై తీవ్ర ఆగ్రహం

మాకు ఆతృత ఉంది కానీ.. మీకు లేదు

కోర్టు చెప్పినప్పుడే పనిచేస్తారా?

సున్నితంగా వ్యవహరించలేరా..?

కోర్టుకు రావాలని సీఎ్‌సకు ఆదేశం

మధ్యాహ్నం కోర్టు ముందుకు సమీర్‌శర్మ

తొలిసారి సుప్రీం ముందు హాజరయ్యా

చాలా అవమానంగా భావిస్తున్నా

వారం రోజుల్లో చెల్లింపులు చేస్తాం

2 వారాల్లో దరఖాస్తులన్నీ పరిష్కరిస్తాం

ధర్మాసనానికి సీఎస్‌ హామీ

చెప్పిన సమయానికి చెల్లించాలి: కోర్టు


పరిహారం చెల్లించండి.. చెల్లించండని ప్రతిసారీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలా..? ఇప్పటికి 10 సార్లు చెప్పాం. అనేక ఉత్తర్వులిచ్చాం. అయినా చేయలేదు కాబట్టే సీఎ్‌సను మా ముందుకు రమ్మన్నాం.

- సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కరోనా మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించనందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరించలేరా అని నిలదీసింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. దాంతో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం వర్చువల్‌గా విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తిరిగి విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరిహారం చెల్లించాలని ఆంధ్ర ప్రభుత్వానికి ఇప్పటికి 10 సార్లు చెప్పామని.. అనేక ఉత్తర్వులిచ్చినా చేయనందునే తమ ముందు హాజరు కావాలని సీఎ్‌సను ఆదేశించామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌ స్పందిస్తూ.. తమకు వారం సమయం ఇవ్వాలని కోరారు. పరిహారం కోసం 41,292 దరఖాస్తులు వచ్చాయని, అందులో 34,819 దరఖాస్తులు అర్హత సాధించాయని పేర్కొన్నారు. వాటిలో 23,835 దరఖాస్తులకు చెల్లింపులు చేశామని.. మరో 10,900 మందికి చెల్లింపులు చేయాల్సి ఉందని చెప్పారు. వాటిలో 5,141 క్లెయిమ్స్‌ను ప్రభుత్వం క్లియర్‌ చేసిందని వెల్లడించారు. ‘ఈ దరఖాస్తులను ఈ రోజు ఉదయం క్లియర్‌ చేశారా..? అంటే చెల్లింపులు చేయలేదు కదా..’ అని ధర్మాసనం ప్రశ్నించింది. సరిగా సమయం చెప్పలేను గానీ ఇప్పటి వరకు క్లియర్‌ చేశారని, కోర్టు ఆతృత వంటి కారణాల ఫలితంగా చేశారని న్యాయవాది సమాధానమిచ్చారు. దానికి తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ‘అదే మేమూ చెప్పాలనుకుంటున్నది. మాకు ఆతృత ఉంది కానీ మీకు లేదు’ అని కటువుగా వ్యాఖ్యానించింది. క్లియర్‌ అయిన వాటికి రెండు మూడు రోజుల్లో చెల్లింపులు చేస్తామని బసంత్‌ తెలిపారు. మిగతా వాటి సంగతేంటని ఽప్రశ్నించగా.. మిగతా 3,796 దరఖాస్తులకు సంబంధించి కొన్ని రికార్డులు అందాలని.. వాటిని పరిశీలించాలని.. మరో 2,107 దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాలు ఆపరేషన్‌లో లేవని.. అధికార యంత్రాంగం వారి వద్దకు వెళ్లి ఆ ఖాతాలను క్రియాశీలం చేస్తుందని.. అందుకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలని ఫిర్యాదుల కమిటీని సీఎస్‌ ఆదేశించారని, అర్హత సాధించని దాదాపు 6 వేల దరఖాస్తులను ఆ కమిటీ సుమోటోగా తీసుకుని పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మొత్తం చెల్లింపులను పూర్తి చేయడానికి రెండు వారాల సమయం కోరారు. ‘మీరు మరో రెండు వారాల సమయం అడుగుతున్నారు. కానీ మేం 6 నెలల నుంచి చెబుతూనే ఉన్నాం. కోర్టులు చెప్పినప్పుడు మాత్రమే పనిచేస్తారా? ఇలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు చూస్తున్నారు..? ఎందుకు సున్నితంగా వ్యవహరించడం లేదని గతంలోనే ప్రశ్నించాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 5,141 దరఖాస్తుదారులకు గురువారంలోగా చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వచ్చిన 41 వేల దరఖాస్తుల్లో అధికారికంగా నమోదైన దాదాపు 14వేల మరణాలకు సంబంధించిన దరఖాస్తు లు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఉన్నాయని బసంత్‌ సమాధానమిచ్చారు. వాటిలో అన్నీ ఉన్నట్లు సరిచూసుకున్నారా లేదా అని అడుగగా.. వ్యక్తిగతంగా తాను సరిచూడలేదని, కానీ అన్నీ ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఆయన తెలిపారు. 14 వేల అధికారిక మరణాలకు కేవలం 7 వేల దరఖాస్తులే వచ్చాయని ధర్మాసనం పేర్కొనగా.. ఒకసారి సరిచూడాలని ప్రభుత్వానికి తెలియజేస్తానని బసంత్‌ బదులిచ్చారు.


చాలా అవమానంగా భావిస్తున్నా: సమీర్‌ శర్మ

‘కోర్టుకు రావడం చాలా అవమానకరంగా భావిస్తున్నాను’ అని సీఎస్‌ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందించి.. ‘మిమ్మల్ని ఇలా పిలవడం మాకూ ఇష్టం ఉండదు. కానీ మరో మార్గం లేదు’ అని స్పష్టం చేసింది. ‘నా జీవితంలో ఎప్పుడూ సుప్రీంకోర్టుకు ఇలా విచారణకు హాజరుకాలేదు. చాలా భయంకరమైన పరిస్థితి. తొలిసారి హాజరయ్యాను. జరిగిన దానికి ముందుగా క్షమాపణలు. నేను వ్యక్తిగతంగా బాధ్యతగా తీసుకుని చెల్లింపులు జరిగేలా చూస్తాను. 14 వేల అధికారిక మరణాలకు పరిహారం చెల్లింపునకు సంబంధించి.. కొన్ని చోట్ల మృతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. కొన్నింటికి వయసు మాత్రమే ఉంది. వాటిని సమగ్రంగా పరిశీలించి సాఽధ్యమైనన్ని 41వేల దరఖాస్తుల్లో చేర్చాం’ అని సీఎస్‌ వివరించారు. ‘ఇది చాలా సీరియస్‌ వ్యవహారం. కేవలం పేరు ఉండి చిరునామా, వయసు లేకుండా.. మీరు నిర్వహిస్తున్న రికార్డుల్లో తప్పుందా’ అని ధర్మాసనం ప్రశ్నించింది. రికార్డులు సరిగానే ఉన్నాయని, దరఖాస్తు చేసిన వారు హడావుడిలో అసంపూర్తిగా వివరాలు పేర్కొన్నారని.. అయినప్పటికీ మరోసారి సరిచూసుకుంటామని ఆయన తెలిపారు. వ్యక్తితంగా చొరవ తీసుకుంటానని, అది చేయలేకపోతే కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికీ పరిహారం అందాలన్నదే తమ ఉద్దేశమని.. సాంకేతిక కారణాలతో దరఖాస్తులను తిరస్కరించవద్దని సీఎ్‌సకు ధర్మాసనం సూచించింది. తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, దరఖాస్తులో పొరపాట్లు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. స్పందించిన సీఎస్‌.. ఆ దరఖాస్తులను సమీక్ష చేయిస్తానని, సంబంధిత కు టుంబసభ్యుల వద్దకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను పంపి పొరపాట్లను సరిదిద్దడంతో పాటు బ్యాంకు ఖాతాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చెల్లింపులకు వారం రోజులు, పూర్తి స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి రెండు వారాల సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎస్‌ తమకిచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నామని, చెప్పిన సమయానికి చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది.


తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు పరిహారం

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పరిహారం చెల్లించాలని అన్ని రాష్ట్రాలనూ సుప్రీంకోర్టు ఆదేశించింది. బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో రాష్ట్ర ప్ర భుత్వాలు పొందుపరచిన వివరాల ప్రకారం దాదాపు 10 వేల మంది పిల్లలు తల్తిదండ్రులను కోల్పోయారని.. వారికి కూడా పరిహారం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు.. సాంకేతిక కారణాలతో దరఖాస్తులను తిరస్కరించవద్దని.. పొరపాట్లు ఉంటే సరిదిద్దే అవకాశం కల్పించాలని.. దరఖాస్తులను తిరస్కరిస్తే ఏ కారణంతో తిరస్కరించారో దరఖాస్తుదారులకు తెలియజేయాలని తెలిపింది. తెలంగాణలో 1,489 దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయని ధర్మాసనం ప్రస్తావించింది.

Updated Date - 2022-01-20T07:57:16+05:30 IST