చేనేత రంగాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2022-08-08T08:02:54+05:30 IST

చేనేత కళ భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఈ రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

చేనేత రంగాన్ని కాపాడుకుందాం

అది మనందరి బాధ్యత బీమా పథకంతో నేతన్నను ఆదుకుంటాం

ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి

చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పిలుపు

కేంద్రం జీఎస్టీ విధించడం మరణ శాసనమేనని విమర్శ


హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత కళ భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఈ రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజలంతా చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా నేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం పీపుల్స్‌ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహాత్మాగాంధీ చరఖాతో నూలు వడికి జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారని, అలాంటిది.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమని కేటీఆర్‌ అన్నారు.


ఇది చేనేత పరిశ్రమకు మరణశాసనం లాంటిదన్నారు. ’’దేశంలోని నేతన్నలు అందరి తరఫున నేను కేంద్రానికి చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’’ అని విజ్ఞప్తి చేశారు. నేతన్నలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలులోకి తెచ్చిందని, ఏ కారణంతో వాళ్లు మరణించినా.. రూ.5 లక్షలు బీమా వరిస్తుందని తెలిపారు. 80 వేల మంది చేనేత కళాకారులు, కార్మికులకు మేలు చేసే ఈ పథకాన్ని తెచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి ఎల్‌ఐసీ ద్వారా బీమా సదుపాయం కల్పిస్తున్నామని, ఎల్‌ఐసీ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున రూ.50 కోట్ల చెక్కును అందజేశామని వివరించారు. ’’చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత కార్మికుల రుణ మాఫీ పథకంతో పాటు మరమగ్గాల పరిశ్రమకు విద్యుత్‌ వినియోగంలో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నాం’’ అని మంత్రి తెలిపారు.


ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్ర్తాలను తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నేత కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట అవార్డులను ప్రదానం చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 28 మందికి అవార్డును ప్రదానం చేయడంతోపాటు రూ.25 వేల నగదు అందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చేనేత, జౌళిశాఖ, ఎల్‌ఐసీ ఇండియా మధ్య చేనేత బీమా అమలుపై ఓ ఒప్పందం కుదిరింది. అంతకుముందు ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ బుద్ధప్రకాష్‌, ఇతర అధికారులు చేనేత వస్త్ర ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు.

Updated Date - 2022-08-08T08:02:54+05:30 IST