గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2021-02-27T06:09:22+05:30 IST

గోవాడ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు పేర్కొన్నారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కాపాడుకుందాం
సమావేశంలో మాట్లాడుతున్న శరగడం రామునాయుడు

ఫాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం నేత రామునాయుడు



చోడవరం, ఫిబ్రవరి 26: గోవాడ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక్టరీని దెబ్బతీసే ప్రయత్నాలను కార్మికులు సంఘటితంగా తిప్పికొట్టాలన్నారు. ఫ్యాక్టరీ క్రషింగ్‌ను నిలిపివేసి రైతుల్లో అనుమానాలను రేకెత్తించే ఉద్దేశంతో కొందరు చెరకు కేన్‌ క్యారియర్‌లో ఇనుపరాడ్లను పడేశారని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తుల కుట్రలను భగ్నం చేయాలని కోరారు. యూనియన్‌ గొడవలు ఫ్యాక్టరీ నిర్వహణపై రుద్ది ఫ్యాక్టరీని రాజకీయాల మయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఫ్యాక్టరీని కార్మికులు నాశనం చేస్తున్నారన్న ఆపోహలు రైతుల్లో రేకెత్తించేందుకు పనిగట్టుకుని క్రషింగ్‌ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు, వేతనాలు సకాలంలో అందేలా చూస్తామన్నారు. మార్కెట్‌లో ప్రస్తుత పంచదార ధరలను చూస్తే ఫ్యాక్టరీ ఆర్థికంగా గాడినపడే అవకాశం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఫాక్ట్టరీలో చిరుద్యోగుల బదిలీల విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్మిక సంఘం నాయకులు రాయి సూరిబాబు, పీఎస్‌ నాయుడు, జామి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T06:09:22+05:30 IST