అభ్యంతరాలు ఉంటే తెలపండి - ఆర్డీఓ

ABN , First Publish Date - 2022-05-25T05:30:00+05:30 IST

కొండాపురం గ్రామానికి సంబంధించిన గండికోట పునరావాస పరిహారం కింద సప్లిమెంటరీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు.

అభ్యంతరాలు ఉంటే తెలపండి - ఆర్డీఓ
కొండాపురం నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్డీఓ శ్రీనివాసులు

కొండాపురం, మే 25: కొండాపురం గ్రామానికి సంబంధించిన గండికోట పునరావాస పరిహారం కింద సప్లిమెంటరీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. పునరావాసం కింద అర్హులై ఉండి కూడా పరిహారం అందని 540 మందితో కూడిన సప్లిమెంటరీ జాబితాను తహసీల్దార్‌ కార్యాలయంలో ఉంచినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇంకా అర్హులై ఉండి కూడా ఈ జాబితాలో చోటుచేసుకోకుంటే అభ్యంతరాలు చెప్పవచ్చని ఆర్డీఓ తెలిపారు. స్థానిక స్త్రీశక్తిభవన్‌లో బుధవారం కొండాపురం ముంపువాసులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఎన్‌టీఎ్‌ఫ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతిలు అర్హులై ఉండి కూడా చాలా మంది పేర్లు ఈ జాబితాలో రాలేదని, తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొండాపురం గ్రామ పరిధిలోనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. అర్హులందరికీ తప్పక పరిహారం అందుతుందని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శోభన్‌బాబు, నిర్వాసితులు ఈశ్వర్‌రెడ్డి, చిన్న శివారెడ్డి, బీజేపీ నాయకులు బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-25T05:30:00+05:30 IST