సాగు ఫామ్‌లోకి వచ్చేలా

ABN , First Publish Date - 2021-12-25T06:35:09+05:30 IST

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలసాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.

సాగు ఫామ్‌లోకి వచ్చేలా
నర్సరీలోని ఆయిల్‌పామ్‌ మొక్కలు

సాగు విస్తీర్ణం పెంపే లక్ష్యంగా సర్కారు కృషి

నూతనంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఎంపిక

ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యం

రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వ రాయితీలు

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలసాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. వంట నూనెలకు జాతీయంగా, అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశానికి అవసరమైన నూనెల్లో 70 శాతం  విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలను గత యేడాదే ఆయిల్‌పామ్‌ సాగుకు ఎంపిక చేయగా తాజాగా (ఈ యేడాది) జిల్లాను కూడా ఆయిల్‌పామ్‌ సాగుకు  అనుకూలమైనదిగా ఎంపిక చేశారు. 

మోత్కూరు

ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో రైతులకు అవగాహన కల్పించి వారితో ఆయిల్‌పామ్‌ సాగు పెంచేలా కృషిచేసే బాధ్యతను రుచిసోయా (ప్రైవేటు కంపెనీ) తీసుకోగా, జిల్లా బాధ్యతలు ఆయిల్‌ఫెడ్‌ తీసుకుంది. ఈ సంవత్సరం నల్లగొండ, సూర్యాపేటల్లో 20వేల ఎకరాల చొప్పున 40వేల ఎకరాల్లో, జిల్లాలో 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో రుచిసోయా కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో రైతులతో 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయించేందుకు ఆయిల్‌ఫెడ్‌ సంస్థ ముమ్మరంగా కృషి చేస్తోంది. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో సుమారు 70 ఎకరాల స్థలం తీసుకొని నర్సరీలో ఆయిల్‌పాం మొక్కల పెంపకంకోసం పనులు ప్రారంభించారు. 


రైతులకు ప్రోత్సాహకంగా రాయితీలు

ఆయిల్‌పామ్‌ మొక్క పెంచడానికి సుమారు రూ.250 ఖర్చవుతుంది. ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.87సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.33 చెల్లించాలి. మిగతా రూ.130 కంపెనీలు భరిస్తాయి. రైతులు ఎకరాకు రూ.1881 చెల్లిస్తే ఎకరాకు అవసరమైన 57 మొక్కలు అందిస్తారు. రైతులు మొక్కలు నాటాక మొదటి సంవత్సరం డ్రిప్‌కు, మొక్క పెంపకానికి ప్రభుత్వం రూ.26 వేలు సబ్సిడీ ఇస్తుంది. రెండో సంవత్సరం రూ.5వేలు, మూడో సంవత్సరం రూ.5వేల చొప్పున సబ్సిడీ ఇస్తుంది. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఆయిల్‌పామ్‌ సాగుకు ఇచ్చే సబ్సిడీలన్నీ కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తాయి.


నర్సరీలో మొక్కలు పెంపకం ఇలా.. 

ఆయిల్‌పామ్‌ గింజలు మనదేశంలో దొరకవు. కోస్టారికా (అమెరికా), ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలనుంచి మొలకెత్తిన ఆయిల్‌పామ్‌ గింజలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో గింజ ధర రూ.75 ఉంటుంది. గింజలు చెన్నై ఎయిర్‌పోర్టుకు మాత్రమే వస్తాయి. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల్లోని స్థానిక నర్సరీలకు తరలిస్తారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొలకెత్తిన గింజలను మొదట రెండు కిలోల ప్లాస్టిక్‌ కవర్‌ (బ్యాగ్‌)లో మట్టి నింపి అందులో గింజలు పెట్టి మూడు నెలలు షెడ్‌నెట్‌లో పెంచుతా రు. ఆ తర్వాత పెద్ద బ్యాగులో 18 కిలోల మట్టి నిం పి మొక్కలను అందులోకి మార్చి షెడ్‌నెట్‌ బయట పెట్టి తొమ్మిది నెలలు పెంచుతారు. ఇలా 12 నెలలు పెంచిన మొక్కను నాటడానికి రైతులకు ఇస్తారు. 


ఆయిల్‌పామ్‌లో రకాలు

ఆయిల్‌పామ్‌లో స్ర్పింగ్‌, టనేరా రకాలు మొదటి నుంచి ఉన్నాయి. ఆంగామ్‌బీ, సిరాయిడ్‌, అవలంచ రకాలు కొత్తగా వచ్చాయి. వీటిలో సిరాయిడ్‌ చెట్టు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఆంగామ్‌బీ రకంలో ఆయిల్‌ రికవరీ శాతం ఎక్కువగా ఉంటుంది. 


నాలుగో ఏడాది నుంచి పంట దిగుబడి 

ఆయిల్‌పామ్‌ మొక్క ఒక్కసారి నాటితే చెట్టు సుమారు 30ఏళ్లు ఉంటుంది. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. నాలుగో సంవత్సరం ఎకరాకు రెండు, మూడు టన్నులు, ఐదో సంవత్సరం ఐదు టన్నులు, ఆరో సంవత్సరం ఎనిమిది టన్నులు, ఇక ఏడో సంవత్సరం నుంచి సుమారు 30 ఏళ్లవరకు యేటా 12 టన్నుల దిగుబడి వస్తుంది. తోటల నిర్వహణ బాగుంటే మరో రెండు టన్నుల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశముంటుంది. పండ్ల ధర టన్నుకు రూ.15వేల పైనే ఉంటున్నది. సంవత్సరానికి ఎకరాకు రూ.50వేల నుంచి లక్షన్నర వరకు ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయిల్‌పామ్‌ తోటలు ఏపుగా పెరిగే వరకు సుమారు పదేళ్లవరకు తోటల్లో కోక్‌, పెసర, జొన్న, మొక్కజొన్న, పత్తిలాంటి పంటలు వేసుకుని ఆదాయం పొందవచ్చు. ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండదు. నామ మాత్రపు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. పండ్లకు ముళ్లు ఉంటున్నందున కోతులు, అడవి పందుల బెడద కూడా ఉండదు. 


చౌడు, జాలువారే నేలలు మినహా..

ఆయిల్‌పామ్‌ సాగుకు చౌడు, జాలు భూములు మినహా ఎర్ర, దుబ్బ తదితర నేలలన్నీ అనుకూలమే. ఎకరాకు 57 మొక్కల చొప్పున నాటుతారు. తొలిదశలో ఒక్కో మొక్కకు సుమారు 50 లీటర్ల నీరు అవసరం. మొక్క ఎదుగుతున్న కొద్దీ నీటి అవశ్యకత పెరుగుతుంది. ఏడు సంవత్సరాల తర్వాత ఒక్కో మొక్కకు రోజుకు సుమారు 250లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయిల్‌పామ్‌ చెట్ల ఆకులు, మట్టలు ఎరువుగా ఉపయోగపడతాయి. 


ఆయిల్‌పామ్‌ సాగు పెంపునకు కృషి : కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించిన జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు పనులు ముమ్మరం చేశాం. ఈ సంవత్సరం నూతనంగా యాదాద్రిభువనగిరి జిల్లాను కూడా మా సంస్థకు ఇచ్చారు. ఈ జిల్లాలో నర్సరీ ఏర్పాటుచేసి లక్ష మొక్కలు పెంచేందుకు అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నాం. దశలవారీగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయిల్‌పామ్‌ సాగు వల్ల అధిక లాభాలు ఉన్నందున, రైతులు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయిల్‌పామ్‌ తోటలు పెంచాలి. 

Updated Date - 2021-12-25T06:35:09+05:30 IST