కిడ్నీలపై కన్నేద్దాం...

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

మధుమేహం, అధిక రక్తపోటు, అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు... ఇవన్నీ మూత్రపిండాలను దెబ్బతీసేవే! అయితే వీటన్నింటి కంటే ముఖ్యంగా సరిపడా నీళ్లు తాగకపోవడం మూలంగా, మరీ ముఖ్యంగా వేసవిలో కిడ్నీలు కుదేలవుతూ ఉంటాయి.

కిడ్నీలపై కన్నేద్దాం...

నీళ్లూ, రాళ్లూ... మూత్రపిండాల ఆరోగ్యం ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే తాగే నీళ్ల విషయంలో, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 


ధుమేహం, అధిక రక్తపోటు, అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు... ఇవన్నీ మూత్రపిండాలను దెబ్బతీసేవే! అయితే వీటన్నింటి కంటే ముఖ్యంగా సరిపడా నీళ్లు తాగకపోవడం మూలంగా, మరీ ముఖ్యంగా వేసవిలో కిడ్నీలు కుదేలవుతూ ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు వేసవిలో రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. డయాలసిస్‌ తీసుకుంటున్నవాళ్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు, లేదా అలాంటి తత్వం కలిగినవాళ్లు శరీరంలో నీటి శాతం సమంగా ఉండేలా చూసుకోవాలి.


డయాలసిస్‌ రోగులు ఇలా...

మూత్రపిండాలు దెబ్బతిని, డయాలసిస్‌కు ముందు దశలో ఉన్నవాళ్లు, లేదా డయాలసిస్‌ తీసుకుంటున్నవాళ్లు వేసవిలో తాగే నీళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎన్ని నీళ్లు తాగుతున్నారు, మూత్రం ద్వారా ఎంత నీరు బయటకు వెళ్లిపోతోందో గమనించుకుంటూ ఉండాలి. వీళ్లు అవసరానికి మించి నీళ్లు తాగి ఓవర్‌ హైడ్రేట్‌ చేసుకోకూడదు, అలాగని అవసరానికంటే తక్కువ నీళ్లు తాగి డీహైడ్రేషన్‌కు కూడా గురి కాకూడదు. ఈ కోవకు చెందిన వాళ్లు డీహైడ్రేషన్‌కు గురైతే, మూత్రపిండాలు పూర్తిగా పని చేయడం మానేస్తాయి. అలా కాకుండా ఓవర్‌ హైడ్రేట్‌ అయితే కిడ్నీలు వాటిని వడగట్టలేకపోవడం మూలంగా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. కాబట్టి శరీరంలో నీటి శాతాన్ని లెక్కించడం కోసం ప్రతి రోజూ శరీర బరువు చెక్‌ చేసుకోవాలి. బరువు ఒకటిన్నర నుంచి రెండు కిలోలకు మించినా, తగ్గినా అప్రమత్తం కావాలి. వైద్యుల సూచన మేరకు తాగే నీటి మోతాదును పెంచడం లేదా తగ్గించడం చేయాలి. అలాగే ఎండ ప్రభావానికి గురవకుండా చూసుకోవాలి. దాహం తీవ్రతను పెంచే పనులకు దూరంగా ఉండాలి. 


తాగే నీళ్లు పరిమితిగా...

శరీర బరువు, క్రియాటినిన్‌ మోతాదు, గుండె సమస్యలు, కిడ్నీలో రాళ్లు... ఈ అంశాల ఆధారంగా మూత్రపిండాల రోగులు తీసుకోవలసిన రోజువారీ నీటి మోతాదును వైద్యులు లెక్కిస్తారు. కిడ్నీ పనితీరు సక్రమంగా ఉండి, కిడ్నీలో రాళ్లు కలిగిన వాళ్లు రోజులో మూత్రం ద్వారా రెండు లీటర్ల నీరు బయటకు వెళ్లేందుకు సరిపడా నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే వేసవిలో దాహం పెరుగుతుంది. అయినా మోతాదు మించకూడదు కాబట్టి నీళ్లు తాగకుండా ఉండిపోవలసిన అవసరం లేదు. ఇలాంటప్పుడు పరిమితి మేరకు దాహం తీర్చుకోవచ్చు. అయితే మూత్రపిండాల డ్యామేజ్‌ చివరి దశకు చేరుకున్నవాళ్లు ఎండకు బహిర్గతమై, దాహార్తిని పెంచుకుని, ఒకేసారి లీటరు నీళ్లు తాగుదామనుకోవడం సరికాదు. ఈ దశలో మూత్రపిండాల పనితీరు పూర్తిగా కుంటుపడి ఉంటుంది కాబట్టి అంతటి నీళ్లను అవి వడగట్టలేవు. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లతో పాటు, మూత్రపిండాలు డ్యామేజీకి గురైన ప్రతి ఒక్కరూ ఎండకు బహిర్గతం కాకుండా ఉండాలి. అలాగే మధుమేహం కలిగి ఉన్న కిడ్నీ పేషెంట్లు వేసవిలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు వడదెబ్బ, డయేరియాలకు గురైతే మూత్రపిండాలు అతి త్వరగా ఫెయిల్యూర్‌ దశకు చేరుకుంటాయి. 


రాళ్లు రాకుండా...

వేసవిలో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా పెరుగుతుంది. రాయిగా తయారయ్యే వీలున్న ఘన పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడానికి సరిపడా మూత్రం తయారు కాని సందర్భాల్లోనే అవన్నీ రాళ్లుగా మారతాయి. ఇలా క్రిస్టలైజ్‌ అయ్యే తత్వం కలిగి ఉన్న ఘనపదార్థాలు శరీరంలో అవసరానికి మించి పెరగకుండా చూసుకోవడంతో పాటు, వాటిని పలుచన చేసేలా సరిపడా నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. లేదంటే అవన్నీ మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ రాళ్లు ప్రారంభంలో ఎటువంటి సమస్యనూ కలిగించకపోయినా, వేసవిలో డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు వీటి పరిమాణం పెరిగి లక్షణాల రూపంలో సమస్య బయటపడుతుంది. నిజానికి సోడియం, క్యాల్షియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌.. ఇలా రాయిగా మారే తత్వం ఉండే పోషకాలన్నీ ఆహారం ద్వారా మన శరీరంలో చేరుకుంటూ ఉంటాయి. అయితే శరీరం ఉపయోగించుకోగా మిగిలిన ఈ పోషకాలు మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే సరిపడా మూత్రం తయారవదో, అప్పుడు ఇవన్నీ రాళ్లుగా రూపం దాల్చడం మొదలుపెడతాయి. 

క్యాల్షియం ఆగ్జలేట్‌: మూత్రపిండాల్లో ఏర్పడే 80ు రాళ్లు ఈ కోవకు చెందినవే!

యూరిక్‌ యాసిడ్‌: మాంసాహారం ఎక్కువగా తినేవాళ్లలో ఇవి ఏర్పడే అవకాశం ఎక్కువ.

ట్రిపుల్‌ ఫాస్ఫేట్‌: తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు లోనవుతూ ఉండడం మూలంగా సదరు బ్యాక్టీరియా వల్ల ఈ తరహా రాళ్లు ఏర్పడతాయి.


ఆహార నియమాలతో...

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే తత్వం ఉన్నవాళ్లు ఆకుకూరలు, టమాటాలు, మాంసాహారం, కాఫీ, టీ, తీపి పదార్థాలు, శీతల పానీయాలు, మద్యపానం తగ్గించాలి. అరటి, నిమ్మ, క్యారట్‌, కాకరకాయ, పైనాపిల్‌, కొబ్బరినీళ్లు, బార్లీ, ఉలవలు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


క్రియాటినిన్‌ మోతాదు ఎంత?

క్రియాటినిన్‌ శరీరంలో తయారయ్యే వ్యర్థం. దీన్ని మూత్ర పిండాలు ఎప్పటి కప్పుడు వడగడుతూ ఉంటాయి. ఆరోగ్య వంతులైన పురుషుల్లో క్రియాటినిన్‌ మోతాదు 1.2 మి.గ్రా., స్త్రీలల్లో 1.1 మి.గ్రా. కంటే తక్కువ ఉంటుంది. మూత్రపిండాలు దెబ్బతినడం మొదలైనప్పుడు ఈ మోతాదు క్రమేపీ పెరుగుతుంది. కాబట్టి రక్తంలో క్రియాటినిన్‌ మోతాదు, మూత్ర పిండాలు దెబ్బతిన్న మోతాదును అంచనా వేయడానికి ఉపయోగ పడుతుంది. 


రాళ్లకు కారణాలు ఇవే!

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం సరిపడా నీళ్లు తాగకపోవడమే! కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, కుటుంబసభ్యులు జాగ్రత్త పడాలి. అలాగే ఒకసారి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి, ఆ సమస్య నుంచి బయటపడినా, జీవితాంతం తిరిగి రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటూనే ఉంటాయనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. 

శరీర తత్వం: సరిపడా నీళ్లు తాగుతున్నప్పటికీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే తత్వం ఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. సోడియం, రక్తంలోని క్యాల్షియంను మూత్రంలోకి నెడుతుంది. కాబట్టి సోడియం ఎక్కువగా తీసుకున్నప్పుడు, అవసరానికి మించి క్యాల్షియం మూత్రంలోకి చేరుకుని, రాయిగా మారుతుంది. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. ఇందుకోసం జంక్‌ ఫుడ్‌, నిల్వ పచ్చళ్లు, ఉప్పుతో కూడిన చిప్స్‌, శ్నాక్స్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌, ప్రిజర్వేటివ్‌లు కలిపిన రెడీ టు ఈట్‌ పదార్థాలకు దూరంగా ఉండాలి. 

ఓబేసిటీ: అధిక బరువు ఉన్నవాళ్లలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అధిక బరువు తగ్గించుకోవాలి.

క్యాల్షియం సప్లిమెంట్లు: వైద్యులు సూచించే క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకుంటున్నవాళ్లు, వాటిని అవసరమైనంత కాలమే వాడుకుని, ఆ తర్వాత ఆపేయాలి. అలాగే వాటిని వాడుతున్నంత కాలం తాగే నీటి మోతాదును పెంచాలి. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు క్యాల్షియం మాత్రలు వాడుతూ ఉంటారు. తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తుందనే కారణంతో వీళ్లు నీళ్లు తక్కువగా తాగితే, మూత్రపిండాల్లో క్యాల్షియం ఆగ్జలేట్‌ రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు క్యాల్షియం రాయిగా మారకుండా నియంత్రించే టానిక్‌ తీసుకోవాలి. అలాగే మూత్రాన్ని నియంత్రించుకునేలా చేసే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వైద్యుల సూచనమేరకు వీటిని వాడుకుంటూ, వేసవిలో సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. 

యూరిక్‌ యాసిడ్‌: యూరిక్‌ యాసిడ్‌తో రాళ్లు తయారయ్యే తత్వం ఉన్నవాళ్లు మాంసాహారం తగ్గించాలి. 


రాళ్లను వదిలించాలంటే...

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించలేకపోయినా, వాటిని బయటకు వెళ్లిపోయేలా చేసే మందులున్నాయి. అయితే వాటితో రాళ్లు బయటకు వెళ్లకపోయినా, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ మొదలైనా, కిడ్నీ పనితీరు తగ్గుతున్నట్టు కనిపించినా, రక్తంలో క్రియాటినిన్‌ మోతాదు పెరిగిపోతున్నా ఎండోస్కోపిక్‌ సర్జరీతో మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించవలసి ఉంటుంది. 


వేసవిలో వేధించే యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ 

ఈ ఇన్‌ఫెక్షన్‌ వేసవిలోనే పెరగడానికి కారణం సరిపడా నీళ్లు తాగకపోవడమే! ఈ ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను మూత్రవిసర్జనతో శరీరంలోకి చొరబడకుండా చేయాలి. ఇందుకోసం వీలైనంత ఎక్కువ మూత్రవిసర్జన జరిగేలా ఎక్కువ మోతాదుల్లో నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవి వేడిమికి తగ్గట్టు శరీరంలో నీటి మోతాదును సమంగా ఉంచుకుంటూ ఉండాలి.


డాక్టర్‌ పి. వంశీ కృష్ణ,

కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌,

కేర్‌ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌. 


ఈ అంశాల మీద కన్నేసి..

మూత్రపిండాలు సక్రమంగా పని చేయాలంటే దాని మీద ఒత్తిడి పడే వీల్లేని జీవనశైలిని అనుసరించాలి. అయితే కొన్ని అలవాట్లు, జీవనశైలి సమస్యల మూలంగా మూత్రపిండాల సామర్థ్యం కుంటు పడుతూ ఉంటుంది. కాబట్టి వాటిని దెబ్బతీసే ఈ అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మధుమేహం: ఇరవై ఏళ్ల వయసు నుంచే మధుమేహ సమస్య మొదలైనవాళ్లు

ఊబకాయం: శరీర బరువు అదుపు తప్పిన వాళ్లు

పెయిన్‌ కిల్లర్స్‌: కీళ్ల నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ మందులు వాడుకుంటున్నవాళ్లు

క్యాల్షియం సప్లిమెంట్లు: దీర్ఘకాలికంగా వీటిని తీసుకుంటున్నవాళ్లు

మధుమేహం కలిగి ఉండి ధూమపానం చేసేవాళ్లు.

Read more