భారతావనికి దిక్సూచిగా నిలుపుదాం

ABN , First Publish Date - 2022-08-16T06:17:20+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల వేదికగా యావత్‌ భారతావనికి తెలంగాణను, రాజన్న సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామని, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర వేడుకలల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

భారతావనికి దిక్సూచిగా నిలుపుదాం
పోలీస్‌ వందనాన్ని స్వీకరిస్తున్న మంత్రి కేటీఆర్‌

 - సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలైనా అధిగమించవచ్చు 

- జాతీయ జెండాల తయారీలో సిరిసిల్ల ప్రధాన భూమిక 

- సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఇవ్వండి 

- చేనేత రంగంపై జీఎస్టీ జీరో చేయండి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

- ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల వేదికగా యావత్‌ భారతావనికి తెలంగాణను, రాజన్న సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామని, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర వేడుకలల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాలికి గాయం కావడంతోకేటీఆర్‌ స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక వ్యాన్‌లో వచ్చారు. వేదికపైన కూర్చొని సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత పంథాలో సుదీర్ఘ పోరాట ఫలింతంగా ఏర్పడిన తెలంగాణ   సఫల రాష్ట్రంగా స్థిరపడిందన్నారు. పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రతి ఘాతుక శక్తుల ప్రయత్నాలు అనాడు పోరాటంలో ఎదురయాయ్యయని, ఈనాడు పరిపాలనలో ఎదురవుతున్నాయని అన్నారు. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదామన్నారు. జాతిపితా మహాత్మాగాంధీ సహా ఎందరో మహానీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నామని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసిందని అన్నారు భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగాధనులందరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మహోద్యమాన్ని నిర్మించి  స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహానీయులు త్యాగాలు వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 8వ తేదీ నుంచి 22 వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను నిర్వహిస్తోందన్నారు.  ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  

సిరిసిల్ల మెగాపవర్‌లూం క్టస్టర్‌కు విజ్ఞప్తి 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ మంజూరు చేయాలని సిరిసిల్ల వేదికగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, చేనేత, జౌళి శాఖ మంత్రికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే పదిసార్లు సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌కోసం విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.  మెగా పవర్‌లూం క్లస్టర్‌తోపాటు చేనేతపై విధించిన జీఎస్టీని జీరో చేయాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం  సందర్భంగా దేశంలోనే తొలిసారిగా నేతన్నబీమా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. దురదృష్టవ శాత్తు ఏ నేత కార్మికుడైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుం దన్నారు.  సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి బతుకమ్మ చీరలు, క్రిస్‌మస్‌, రంజాన్‌ ఆర్డర్లను ప్రభుత్వం ఇస్తోందన్నారు. పెద్దూర్‌ వద్ద 60 ఎకరాల్లో అపెరల్‌ పార్కు పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే గోకుల్‌దాస్‌ పరిశ్రమ స్థాపించామన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటిపైనా ఎగురవేసేందుకు 1.20 కోట్ల జాతీయ జెండాలను 5 వేల మరమగ్గాలపై తయారు చేసినట్లు చెప్పారు. దేశంలోని 12 రాష్ట్రాలకు జాతీయ జెండాల తయారీలో సిరిసిల్ల ప్రధాన భూమిక పోషించిందన్నారు.

పండుగలా వ్యవసాయం 

 రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతోందని, రైతు బంధు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 39 వేల 491 మందికి వెయ్యి కోట్ల 76 వేల రూపాయలను పెట్టుబడి కింద అందించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నామని,  జిల్లాలో  1600 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు. జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా 5 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్ల సర్దాపూర్‌లో 25 ఎకరాల్లో అధునాతన మార్కెట్‌ యార్డును నిర్మించామని, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోరెం, పోత్గల్‌, సింగిల్‌విండోల పరిధిలో 2400 మెట్రిక్‌ టన్నుల గోదాములను నిర్మిస్తున్నామని అన్నారు. ఆరు వ్యవసాయ ఔట్‌ లెట్‌లను ప్రారంభించామన్నారు. సిరిసిల్లలో రైతు బజార్‌ను నిర్మించామని, వేములవాడలో  సమీకృత వెజ్‌, , నాన్‌వెజ్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. జిల్లాలో  1524 మంది  రైతులు అకాల మరణం చెందగా రైతుబీమా పథకం ద్వారా  ఆ కుటుంబాలకు రూ.76.20 కోట్ల బీమా పరిహారం చెల్లించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 57 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించామని, నర్మాలలో 309 ఎకరాల్లో పుడ్‌ ప్రాసెసింగ్‌, ఇండస్ర్టీయల్‌ పార్కును ఏర్పాటు చేశామని అన్నారు. రూ.100 కోట్లతో రెండు పరిశ్రమలు నిర్మించనున్నట్లు, 500 మంది స్థానికులకు ఉపాధి లభించనున్నట్లు చెప్పారు.  వేములవాడ మండలం నాంపల్లిలో 47 ఎకరాల్లో ధాన్యపు అధారిత ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.  వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో మైక్రో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజీల ద్వారా లక్షా 39వేల 246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌, మిడ్‌ మానేరు ద్వారా 55 వేల 980 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల ద్వారా రెండు నియోజకవర్గాల్లో 86 వేల 150 ఎకరాలకు, జిల్లాలో మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ ద్వారా 57వేల 146 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా  294 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. మానేరు, మూలవాగులపై 24 చెక్‌ డ్యాంల నిర్మాణాలు చేపట్టామని, 12 నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. 

మిడ్‌ మానేరు వద్ద ఆక్వాహబ్‌ 

తెలంగాణ మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుందని ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో మార్పు వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల మిడ్‌ మానేరు కేంద్రంగా రూ.2 వేల కోట్లతో పది వేల మందికి ఉపాధి లభించే విధంగా 367 ఎకరాల్లో అతిపెద్ద ఆక్వాహబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ అన్నారు.  జిల్లాలో 16 వేల 162 మంది గొల్లకురమల కుటుంబాల అభివృద్ధికి మొదటి విడత 11548 మందికి గొర్రెల యూనిట్లను అందించామని, రెండో విడతలో రూ.81.20 లక్షల వ్యయంతో మిగిలిన 4640 మందికి సెప్టెంబరులో యూనిట్లను అందిస్తామని తెలిపారు. 

‘డబుల్‌’ ఇళ్లు పేదల అత్మగౌరవ ప్రతీక 

పేదల అత్మగౌరవ ప్రతీకగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిలిచాయని ఇప్పటివరకు 3402 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని  కేటీఆర్‌ అన్నారు. మండెపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్ధిదారుల కోసం రూ.87.67 కోట్లతో నిర్మించిన 1320 ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారన్నారు.  సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రారంభిస్తా మన్నారు. హరితహారం 7 విడతలో  4.70 కోట్ల మొక్కలను నాటినట్లు చెప్పారు.  8వ విడత కార్యక్రమం కొనసాగుతోందన్నారు.  

అభాగ్యులకు గౌరవంగా ఆసరా 

 జిల్లాలో తెలంగాణకు ముందు 56,116 మందికి మాత్రమే పింఛన్లు  అందేవని, ప్రస్తుతం లక్షా 7 వేల 212 మందికి అందుతున్నాయని మంత్రి అన్నారు. ప్రతి నెలా రూ.22.47 కోట్లు పింఛన్ల కింద అందిస్తున్నట్లు చెప్పారు.  జిల్లాలో కొత్తగా ఆసరా  పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని పెండింగ్‌లో ఉన్న 7300 మంది, 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్స ఉండి దరఖాస్తు చేసుకున్న 19934 మందికి కలిపి 27,234 మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ ద్వారా రూ.లక్షా116 అందిస్తున్నట్లు చెప్పారు.  

నిరుపేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం 

నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి, మాత శిశు సంరక్షణ కేంద్రం, ఐసీయూ, డయాలసిస్‌ ఏర్పాటు చేశామన్నారు. రూ.2 కోట్లతో కొవిడ్‌ ఐసీయూ, 50 పడకలతో కొవిడ్‌ అక్సిజన్‌ ఐసోలేషన్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. నిమ్స్‌తో ఒప్పందం చేసుకొని టెలిపోగ్రాం ద్వారా గుండె జబ్బులకు చికిత్స అందిస్తున్నామని, టెలి మెడిసిన్‌ ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. జిల్లా ఆస్పత్రికి వరుసగా మూడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలో రూ.159 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని మంజూరు చేసినట్లు, తాజాగా ప్రభుత్వం జిల్లాలో మెడికల్‌ కాలేజీ మంజూరు చేసినట్లు చెప్పారు. 2022-23లోనే మెడికల్‌ కళాశాల ప్రారంభం కానుందన్నారు. వేములవాడలో తిప్పాపూర్‌ ప్రాంతీయ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, ప్రారంభించిన సంవత్సరంలోపే కాయకల్పలో అవార్డు సొంతం చేసుకోవడం గర్వకారమణమని అన్నారు. దేశంలోనే మొదటి సారిగా రాష్ట్ర ప్రజలందరి అరోగ్య సంక్షేమం కోసం ఈ హెల్త్‌ ప్రొపైల్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టామన్నారు.   

వేగంగా జిల్లా కేంద్రం అభివృద్ధి 

సిరిసిల్ల జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అన్ని రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్ర పట్టణంగా అవార్డు అందుకుందన్నారు. పట్టణ ప్రగతి ఇన్నోవేషన్‌ అవార్డుల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పీఎం స్వానిధి, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందజేయడంతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌, రెండో ట్రెచ్‌ ర్యాంక్‌లను సాధించిందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లలోనూ తెలంగాణలో మొదటి ర్యాంక్‌ సాధించిందన్నారు. సిరిసిల్ల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను రూ.100 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణమని అన్నారు. దేశంలో సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే 19 తెలంగాణకు చెందినవన్నారు. కేంద్రం ఏటా దీన్‌దయాళ్‌ పంచాయతీ స్వశక్తి కరణ్‌ పేరిట ఇచ్చే అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు మూడు అవార్డులు వచ్చాయన్నారు.  మండెపల్లిలో అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం ద్వారా 332 మందికి శిక్షణ ఇవ్వగా 139 మందికి ప్లేస్‌మెంట్‌ లభించిందన్నారు. జిల్లా కేంద్రంలో స్టేడియం అందుబాటులోకి తెచ్చుకు న్నామని, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదనాన్ని రూ.2 కోట్లతో ప్లే గ్రౌండ్‌గా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. 

ఽధార్మిక క్షేత్రంగా  వేములవాడ అభివృద్ధి 

జిల్లా కేంద్రం సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ధార్మిక క్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని కేటీఆర్‌ అన్నారు. ఇటీవల వేములవాడలో ఆరు మండలాలతో కూడిన ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ప్రణాళికా బద్ధంగా అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. కోటి రూపాయలతో వైకుంఠధామాన్ని నిర్మించుకున్నామని, రూ.2.71 కోట్లతో కూరగాయల మార్కెట్‌, రూ.4.50 కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు జరుగుతున్నాయని అన్నారు.  రూ.20 కోట్లతో మౌలిక సదుపాయల పనులు చేపడుతున్నామన్నారు. గుడిచెరువు, ట్యాంక్‌బండ్‌, మూలవాగు, ఇతర జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.  రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఏటా శివరాత్రి జాతరనను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

దళితుల అభ్యున్నతికి గొప్ప పథకం 

దేశ చరిత్రలోనే తొలిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళితబంధు అని జిల్లాలో పథకంలో భాగంగా వెటర్నరీ రంగంలో 49 పరిశ్రమలు, పరిశ్రమల రంగంలో 46, ఇతర రంగాల్లో 110 పరిశ్రమలు కలిపి 205 మంది లబ్ధిదారులను ఎంపిక  చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  దళితుందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రూపంలో 137 మంది లబ్ధిదారులకు రూ.కోటి 9 లక్షలు విడుదల చేశామని అన్నారు. ముస్లిం, క్రిస్టియన్‌, మైనార్టీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చిలు, కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణం కోసం 98 పనులకు రూ.5.61 కోట్లు మంజూరు చేశామన్నారు. మహిళలకు 500 కుట్టు మిషన్లు అందించామన్నారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి కోసం సిరిసిల్లలో ఒక ఎకరం స్థలంలో రూ.2 కోట్లతో డాక్టర్‌ బీ ఆర్‌ అంభేద్కర్‌ భవన్‌ను ప్రారంభించుకున్నామన్నారు.  

రైల్వే మార్గానికి  భూ సేకరణ 

సిరిసిల్ల ప్రాంతం గుండా రైలు మార్గం వెళ్లాలన్నది ఇక్కడి ప్రజల దశాబ్దాల కలని,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనుందని ఇందుకోసం జిల్లాలో 946 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా 553 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామని తెలిపారు. 

ధరణి గమ్యస్థానంలా నిలిచింది

భూ లావాదేవీలకు ధరణి గమ్మస్థానంగా నిలిచిందని పోర్టల్‌ ప్రారంభంతో రిజిస్ర్టేషన్‌ సేవలు ప్రజలకు చేరువయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మొన్నటి వరకు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ధరణి తహసీల్దార్‌లకు జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదా ఇవ్వడంతో తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 6226 భూ సమస్యలను పరిష్కరించామన్నారు.  టీఎస్‌ఐ పాస్‌ ద్వారా రూ.1234 కోట్ల పెట్టుబడితో 731 పరిశ్రమలు స్థాపించామని, 6579 మందికి ఉపాధి కల్పించామని అన్నారు. 

విద్యతోనే భవితకు పునాది 

విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో సర్ధాపూర్‌, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించుకున్నామని, జిల్లాకు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల మంజూరు కాగా అగ్రహారంలో తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల భవన సముదాయం  ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.  జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం రూ .16.24 కోట్లతో 153 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నామన్నారు.  ఇప్పటికే గీతానగర్‌ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలను మోడల్‌ పాఠశాలగా తీర్చిదిద్దామని, గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణలో మొట్టమొదటి కేజీ టూ పీజీ సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని అన్నారు.  

నేరాల నియంత్రణకు పోలీస్‌ యంత్రాంగం కృషి

సాంకేతికత దన్నుగా నేర నియంత్రణకు   పోలీస్‌ యంత్రాంగం కృషి చేస్తోందని మంత్రి అన్నారు.  శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోందని, పోలీస్‌ స్టేషన్‌లో ఎళ్లవేళలా పెండ్ర్లీ పోలీస్‌ విధానంతో సేవలు అందిస్తున్నారని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవిరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల అధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, గుండం నర్సయ్య, నాగం కుమార్‌, గుగులోతు కళావతి, కత్తెరపాక ఉమ, ఎంపీపీలు పడిగెల మానస, వంగ కరుణ, జనగామ శరత్‌రావు, సెస్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గోపాల్‌రావు, అగ్గిరాములు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌,  కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-16T06:17:20+05:30 IST