రైతుల ఆదాయం పెంచుదాం

ABN , First Publish Date - 2022-05-21T07:54:15+05:30 IST

జిల్లాలో రైతుల ఆదాయం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.

రైతుల ఆదాయం పెంచుదాం
సమావేశంలో ప్రసంగిస్తున్న వెంకట రమణారెడ్డి

జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశంలో కలెక్టర్‌ పిలుపు


తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల ఆదాయం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశానికి మండలి చైర్మన్‌ రఘునాథరెడ్డి అధ్యక్షత వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారేలా యంత్రాంగం పనిచేస్తుందని స్పష్టం చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ.. రైతులు వరి పంటకు బదులు వేరుశనగ, రాగులు, సజ్జలు వంటి పంటలపై దృష్టి పెడితే లాభసాటిగా ఉంటుందన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో ఆక్వా ఎగుమతులకు క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలు తమిళనాడులో నష్టాల్లేకుండా నడుస్తుంటే జిల్లాలో మూతపడటం ఏమిటని ప్రశ్నించారు. కారణాలపై అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ.. చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రైతుల నుంచి బుడ్ల రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జాయింట్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ డీడీ సుబ్బారెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ జేడీ గీతారాణి, అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


ఇలాగైతే ఎలా స్వామీ..!

మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేల డుమ్మా


జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశానికి కూడా మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గురువారం జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు తొలి సమావేశానికి సైతం ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. వ్యవసాయ సలహా మండలి మొదటి సమావేశమైనా.. జిల్లా మంత్రి రోజా, ఇన్‌చార్జి మంత్రి నారాయణ స్వామితోపాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో సాగునీటి సలహా బోర్డు, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు వరుసగా జరిగితే మెజారిటీ ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అత్యంత కీలక రంగాలకు ప్రజాప్రతినిధులిస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో.. రైతుల పట్ల నేతల చిత్తశుద్ధి, ఆసక్తి ఏ మేరకు ఉందో ఈ సమావేశాలు తేటతెల్లం చేసినట్లయ్యాయి. 

Updated Date - 2022-05-21T07:54:15+05:30 IST