ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు పట్టుకుందాం

ABN , First Publish Date - 2022-07-04T05:15:40+05:30 IST

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి కావాలని, వైసీపీ ప్రభుత్వ ఓటును పట్టుకుని ఈసారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు పట్టుకుందాం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్‌

మాజీ మంత్రి అమరనాథరెడ్డి

మదనపల్లె టౌన్‌, జూలై 3: రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి కావాలని, వైసీపీ ప్రభుత్వ ఓటును పట్టుకుని ఈసారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మదనపల్లె ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో మినీమహానాడుపై నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ సమావేశానికి రావడం ఆలస్యం కావడంతో అమరనాథరెడ్డి ముఖ్యభూమిక పోషించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఈనెల 6న మినీ మహానాడులో పాల్గొంటారని, రాత్రి కలికిరిలో బస చేసి అక్కడ ఏడు నియోజకవర్గాల టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. అదేరోజు రాత్రి తిరుపతి చేరుకుని అక్కడ బస చేస్తారన్నారు. 8వ తేదీ నగిరి, కార్వేటినగరంలలో జరిగే రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. మదనపల్లెలో నిర్వహించే మినీ మహానాడుకు దగ్గర నియోజకవర్గాలైన మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒక్క మదనపల్లె నియోజకవర్గం నుంచే 25 వేల మంది వచ్చేలా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ వ్యతిరేకతను ఓటు రూపంలో టీడీపీ తీసుకోవాలన్నారు. కుప్పం తరువాత టీడీపీకి కంచుకోట అయిన మదనపల్లెలో బలమైన క్యాడర్‌ ఉందని, ఎన్ని అభిప్రాయభేదాలున్నా చంద్రబాబునాయుడును సీఎం చేయడానికి మదనపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అఽభ్యర్థి ఎవరు నిలబడినా, అక్కడ చంద్రబాబునాయుడే అభ్యర్థి అనుకుని కార్యకర్తలు కృషి చేయాలన్నారు. చివరగా సమావేశానికి వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకులతో ప్రత్యేకంగా సమీక్షించారు. కార్యక్రమంలో పుంగనూరు సమన్వయకర్త  ఎన్‌.శ్రీనాథరెడ్డి, పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, భవానీప్రసాద్‌, ఎస్‌ఎం రఫి, టీడీపీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:15:40+05:30 IST