పుస్తకాల్లో దాక్కుందాం!

ABN , First Publish Date - 2020-04-20T10:47:23+05:30 IST

ప్రపంచమంతా మరో ఊసు, ఇంకో ధ్యాస లేకుండా కోవిడ్‌-19 గురించే కోడై కూస్తుంది. వైరస్‌ సోకితే ఒక తంట! సోకకపోయినా మనకి ఎప్పుడూ అనుభవంలేని లాక్‌డౌన్‌. స్కూళ్ళూ, కాలేజీలు, దుకాణాలు, మార్కెట్టులు సమస్తం బంద్‌...

పుస్తకాల్లో దాక్కుందాం!

ఈ జాబితా తయారు చేస్తున్నప్పుడు ఇంగ్లీషులో లభ్యమయ్యే సాహిత్యానికి, తెలుగులో ఉన్న కంటెంటుకి పోలికే కనిపించలేదు. అలానే వేరే భార తీయ భాషలతో పోలిస్తే కూడా మనకి తక్కువ ్చఠ్ఛిుఽఠ్ఛట ఉన్నాయి. ఎందుకంటే మనం చదవటమనే అలవాటుకే దూరమైపోతున్నాం. చదివేవాళ్ళు ఎక్కువైతేనే పుస్తకాలు రాసేవాళ్ళూ, వేసేవాళ్ళూ, అమ్మేవాళ్ళూ కూడా ఎక్కువవుతారు. టీవీలు, యూట్యూబులు, వాట్సాపులు ఎన్ని ఉన్నా, వాటిమీద వెగటు పుట్టగల పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, కాస్తయినా ధ్యాస పుస్తకాల మీదకి మళ్ళితే మనకి, మన ముందు తరాల వారికి శుభసూచకం.


ప్రపంచమంతా మరో ఊసు, ఇంకో ధ్యాస లేకుండా కోవిడ్‌-19 గురించే కోడై కూస్తుంది. వైరస్‌ సోకితే ఒక తంట! సోకకపోయినా మనకి ఎప్పుడూ అనుభవంలేని లాక్‌డౌన్‌. స్కూళ్ళూ, కాలేజీలు, దుకాణాలు, మార్కెట్టులు సమస్తం బంద్‌. వీలైతే ఇంటి నుండి పనిచేసుకోవటం, లేకపోతే ఉన్నదాంట్లో తిని పడుకో వడం. కాలక్షేపానికి నిరంతర వార్తా స్రవంతులు, అడ్డూ అదుపులేని సోషల్‌ మీడియా ఫార్వార్డులు. ఎప్పుడూ ఊహించనంత తీరిక దొరికిందే అన్నట్టు అనిపి స్తుంది కానీ, నిశ్చింత మాత్రం లేదు. ఇవ్వాళ పూట ఎలాగోలా గడిచినా రేపటి గురించి బెంగ. ఎన్నాళ్ళిలా అన్న విసుగు. అవి తెచ్చిపెట్టే--మనం ప్రాముఖ్యత నిస్తూ కూడా ఎప్పుడూ బాహాటంగా చర్చించుకోని--భయం, ఆందోళన, ఒత్తిడి. అన్నింటి కన్నా భయంకరం చాప కింద నీరులా చేరే ఒంటరితనం. ఏదో ఉపాయం ఉండాలి కదా?  


ఎందుకు లేదు! ఉన్నచోటునే ఉండి ప్రపంచాలను చుట్టేలా చేసే పుస్తకం ఉంది కదా! ఊరటో, ఉత్సాహమో, పలాయనమో ఏదో ఒకటి ఇవ్వగలదు పుస్తకం. పుస్తకమంటే మంచి మిత్రుడే కాదు, మంచి వైద్యుడు కూడా.  మానసిక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచటంలో పుస్తక పఠనం విశేషంగా దోహదపడుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ యూని వర్సిటీలూ, నాలెడ్జ్‌ సైట్లూ తమ తమ విజ్ఞాన ఖజానాలను అందరికి అందు బాటులో ఉండేలా చూస్తున్నాయి. వాటితోపాటు తెలుగులో రచనలు లభ్యమవు తున్న కొన్ని సైట్లను ఈ జాబితాలో చేర్చాము. చదువుకునే సమయం ఉన్నా, పుస్తకాలు చేతులో లేవే అని వాపోతున్నవారికి పనికొస్తుందేమోనన్న ఆశ.  

ఆన్లైన్‌ లైబ్రరీలు 

ఆర్కైవ్‌.ఆర్గ్‌ (https://archive.org/details/booksbylanguage_telugu): ఈ వెబ్‌సైట్‌లో ఇంగ్లీషు పుస్తకాలతోపాటు తెలుగు పుస్తకాలు కూడా దొరుకు తాయి (ఇక్కడ ఇచ్చిన లింక్‌ తెలుగు పుస్తకాలదే). అమెరికాలో కరోనా సృష్టి స్తున్న విపత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్కైవ్‌.ఆర్గ్‌లోని ప్రత్యేక విభాగమైన నేషనల్‌ ఎమర్జెన్సీ లైబ్రరీను (national emergency library) కూడా ఇప్పుడు అందరికి అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్నీ ముఖ్యంగా పిడిఎఫ్‌ ఫార్మాటులో ఉంటాయి. పుస్తకాలని స్కాన్‌ చేసిన కాపీలు. ఇప్పడు లభ్యంకాని ఎన్నో పాత తెలుగు పుస్తకాలని ఇందులో వెతుక్కొని చదువుకోవచ్చు. 

కథానిలయం (kathanilayam.com): ప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావుగారి నేతృత్వంలో నడుస్తున్న కథానిలయానికి అంతర్జాల రూపం ఇది. తెలుగు కథల పుట్ట. కొన్ని అరుదైన పుస్త కాలు, ఆంధ్ర పత్రికలాంటి పాత పత్రికలు ఈ సైటునుండి పిడిఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్లోడు చేసుకో వచ్చు. గురజాడ, చలం, శ్రీపాద, విశ్వనాథ, రావి శాస్త్రి, కొడవటిగంటి... ఇలా పేరెన్నికగన్న కథకులే గాక, మల్లాది రామకృష్ణశాస్త్రి, అల్లం శేషగిరిరావు వంటి అరుదైన కథకుల కథలెన్నో ఇందులో వెతుక్కొని చదువుకోవచ్చు. 

జగర్నాట్‌ బుక్స్‌ (Juggernaut books): భారతదేశంలో లాక్‌డౌన్‌ నడుస్తున్న సందర్భంగా ఈ కంపెనీవాళ్ళు ప్రస్తుతం తమ అన్ని ప్రచుర ణలను తమ మొబైల్‌ ఆప్‌లో ఉచితంగా చదువు కునే వీలు కల్పిస్తున్నారు. సమకాలీన పరిస్థితు లను ప్రతిబింబించే రచనలే కాకుండా, ప్రాంతీయ భాషలనుండి ఇంగ్లీషులోకి అనువాదాలైన నవ లలు/ కథలు, క్రీడారంగానికి చెందిన పుస్తకాలూ కూడా ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌లలో లభ్యమవుతుంది. ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు దొరుకుతాయి. 

ఇవికాక తెలుగు వెబ్‌ పత్రికలైన తెలుగు వన్‌ (teluguone.com), కౌముది (koumudi.net), ఈమాట (eemaata.com)లోకూడా గ్రంథాలయం సెక్షన్లలో కొన్ని ఆసక్తికరమైన రచనలు చదువు కోవచ్చు. సమకాలీన రచయితలు రాసిన ధారా వాహికలో, లేదా పాత పుస్తకాలో దొరుకుతాయి. 


కవిత్వం, క్లాసిక్స్‌

తెలుగు భాగవతం ఆప్‌ (telugu bhagavatam): ఇది మొబైల్‌ ఆప్‌ (ఫణి కుమార్‌ వుల్లపల్లి అనే ఆయన డెవలప్‌ చేసింది. ప్లే స్టోరులో వెతికేటప్పుడు డెవలపర్‌ పేరు కూడా చూసుకోండి). ఫోన్‌లో వేసుకుంటే పోతన భాగవతం మొత్తం చదువుకునే వీలుంటుంది. ప్రతీ పద్యానికి ఆడియో రికార్డింగుతో పాటు ప్రతిపదార్థము, భావమూ కూడా ఉంటాయి. కాలక్షేపానికి భాగవతం వినాలను కున్నా, రోజురోజుకీ దూరమైపోతున్న తెలుగు భాషకు మళ్ళీ దగ్గరయ్యే ప్రయ త్నాల్లో ఉన్నా చక్కని ఉపకరణం ఇది. 

దాసుభాషితం (dasubhashitam): ఇది తెలుగు పుస్తకాలని ఆడియో రూపంలో అందజేసే మొబైల్‌ ఆప్‌. కావ్యాలనుండి, ఆధ్యాత్మిక రచనలు, సాంఘిక రచనలు వరకూ అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి, వినడానికి. 

ప్రాజెక్టు గుటెన్‌బర్గ్‌ (www.gutenberg.org): కాపీరైట్లు చెల్లుబాటైన పుస్త కాల భాండాగారం ఈ సైటు. అనేకానేకమైన అరుదైన పాత పుస్తకాలు ఇక్కడ చదువుకోడానికి వీలుగా ఉండే పలు ఫార్మాటుల్లో ఉచితంగా లభిస్తాయి. తెలుగు రచనలు కేవలం మహీధర రామ్మోహనరావు రచనలే ఉన్నాయి, అదీ కొందరు ఔత్సాహికులు పూనుకొని రచనలన్నీ టైపు చేసి అక్కడుంచారు కాబట్టి. 


లిటరరీ అప్రిసియేషన్‌ కోర్సులు
ఇంతకుముందంటే కేవలం ఎం.ఏ లిటరేచర్‌ లాంటివేవో చేస్తేనే సాహిత్యం లోని లోతుపాతులను విశ్లేషించడానికి కావాల్సిన అవగాహన దొరికేది. కానీ ఇప్పుడు మూక్‌ (MOOC-massive open online courses) వల్ల ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లోని సాహిత్యపు కోర్సులు కొన్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌ విశ్వవిద్యాయాల నుండి మంచి కోర్సులు వస్తున్నాయి గత ఏడెనిమిదేళ్ళుగా. 


కోర్సెరా.ఆర్గ్‌ (coursera.org): మూక్‌ (mooc) లకు ప్రజాదరణ బాగా పెరగ డానికి కీలక పాత్ర వహించిన సైటు ఇది. రచనా వ్యాసంగానికి సంబంధించిన కోర్సులు నిర్వహిస్తుంటారు, ముఖ్యంగా. సాహిత్య విశ్లేషణకు సంబంధించిన కోర్సులూ కొన్ని ఉన్నాయి. సర్టిఫికేట్‌ కావాలనుకుంటే డబ్బులు కట్టి కోర్సులో పరీక్షలన్నీ పూర్తిచేయాలి గానీ, మామూలుగా అయితే రెజిస్టరు అయ్యి కోర్సు వీడియోలన్నీ చూడచ్చు. కోర్సులో భాగంగా చదవాల్సిన పుస్తకాలని దాదాపుగా ఆన్లైనులో దొరికేట్టు చూస్తారు. తప్పనిసరి అయితే మనం కొనుక్కొని చదవాలి. 

ఎడెక్స్‌.ఆర్గ్‌ (http://www.edx.org/course/subject/literature): ఇది కూడా పైన చెప్పిన కోర్సెరా వెబ్‌సైట్‌ లానే పనిజేస్తుంది. కాకపోతే విశ్లేషించే పుస్తకాలు, సాహిత్యాంశాల్లో మరింత వైవిధ్యం ఉంటుందని నాకనిపిస్తుంది. ఇవ్వన్నీ కూడా పెద్ద యూనివర్సిటీల నుండి వచ్చినవే కాబట్టి క్వాలిటీ పరంగా బాగుంటాయి. ‘‘మాడర్న్‌ మాస్టర్‌పీసెస్‌ ఆఫ్‌ వల్డ్‌ లిటరేచర్‌’’ అనే కోర్సులో ప్రముఖ టర్కీ రచయిత ఒర్హాన్‌ పాముక్‌తో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాంటివన్నీ సాహిత్యప్రియులకి విందు భోజనం లాంటివే!

గ్రేట్‌ కోర్సెస్‌ (thegreatcoursesplus.com): ఇది కేవలం యూనివర్సిటీ లెక్చర్లకే పరిమితం కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు అందించే కోర్సులు కూడా ఉంటాయి. చరిత్ర, సైన్సు లాంటి రంగాల్లో అనేకాంశాలపై విస్తృతమైన కోర్సులున్నాయి. సాహిత్యంలోనూ రాయడానికి, విమర్శకి పనికొచ్చే కోర్సులు ఉంటాయి. కోర్సుకి ఇంతని డబ్బు కడితే, వాళ్ళ ఆప్‌లో ఆ కోర్సుకి సంబంధించిన ఆడియోలన్నీ వినవచ్చు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో వాళ్ళు కొన్ని కోర్సులని ఉచితంగా అందిస్తున్నారు. 

మాస్టర్‌క్లాస్‌ (masterclass.com): ఇది పూర్తిగా ఆయా రంగాల్లో తలపండిన వాళ్ళు నిర్వహించే వీడియో మాస్టర్‌ క్లాసులు. సాహిత్యంలో మార్గరెట్‌ ఆట్‌వుడ్‌, నీల్‌ గేమెన్‌, డాన్‌ బ్రౌన్‌, జూడీ బ్లూమ్‌ లాంటి ఉద్దండపిండాల నుండే వాళ్ళ రచనా వ్యాసంగం గురించి తెల్సుకుంటూ, కిటుకులూ కనికట్టులూ నేర్చుకుంటూ మన రచనలోని క్వాలిటీని పెంచుకునే అరుదైన అవకాశం. దాదాపు పది భాగాలుగా ఉండే కోర్సులో - వీడియో లెక్చర్లు, అసైన్మెంట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు కరోనా కారణంగా వాళ్ళు ఒక ఏడాదికి తీసుకునే సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు ఇంకొకరికి కూడా ఉచితం అందిస్తున్నారు. 

నాలెడ్జ్‌ సైట్లు

స్ర్కైబ్డ్‌.కాం (scribd.com): ఇదో అమెరికన్‌ ఈ-బుక్‌, ఆడియో బుక్‌ కంపెనీ. నెలకి/ ఏడాదికి ఇంతని కొంత ఫీ చెల్లిస్తే వాళ్ళ దగ్గరున్న అన్ని పుస్తకాలూ చదువుకోవచ్చు. ఆడియో బుక్కులో అమెజాన్‌వాళ్ళ ‘ఆడిబల్‌’ కన్నా ఇది బాగుం టుందంటారు. వీళ్ళు కూడా కరోనా నేపథ్యంలో ముప్ఫైరోజుల వరకూ (క్రెడిట్‌ కార్డు కూడా అడగకుండా) సైన్‌ అప్‌ అయితే చాలు, ఉచితంగా ఇస్తున్నారు. 


సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ అందుకున్నవారి ఉపన్యాసాలు (http://www.nobelprize.org/prizes/lists/video-lectures-from-noble-laureates-in-literature): పేరు సూచిస్తున్నట్టే ఇవి సాహిత్యంలో నోబెల్‌ పురస్కారాన్ని అందుకునేటప్పుడు ఆయా రచయితలు ఇచ్చిన ఉపన్యాసాల రికార్డింగ్‌. ప్రతి ఉపన్యాసంలో రచన వ్యాసంగం గురించి చర్చలే కాకుండా వారు వచ్చిన ప్రాంత, దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా అర్థం చేసుకునే అవకాశాన్ని ఈ ఉపన్యాసాలు ఇస్తాయి. ఒక మంచి కథో, నవలో చదివేసి పక్కనపడేయ కుండా, ఆ రచయిత ఎక్కడివారి, ఎప్పటివారి కథ చెప్పాడో, ఎందుకు చెప్పాడోనన్న ఆసక్తి ఉన్నవారికి ఇదో గొప్ప ఖజానా. 

కొన్ని సలహాలు/ చిట్కాలు

ఆన్‌లైన్‌ పుస్తకాలతో కుస్తీ ఎలా? 
1) పాత పుస్తకాలని దాదాపుగా స్కాన్‌ చేసి పి.డి.ఎఫ్‌ రూపంలో పెడుతుంటారు. స్కాన్‌ క్వాలిటీని బట్టి పుస్తకం క్వాలిటీ ఉంటుంది. ఇలాంటివాటిని డెస్క్‌టాప్‌, లాప్‌టాప్‌లలో చదువుకోవడం ఉత్తమం. కొన్ని పుస్తకాలు కిండిల్‌ లాంటి ఉపకరణాలలో బాగానే ఇముడుతాయి. ఉచితంగా లభించే పుస్తకాల్లో ఆ అవకాశాలు తక్కువే! 2) ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌లలో వచ్చే పుస్తకాలు చాలా సౌకర్యంగా ఫార్మాట్‌ చేయబడి ఉంటాయి. అందుకని స్కాన్‌ పుస్తకాలలో ఉన్నన్ని తిప్పలు ఉండవు. 3) ఏదైనా స్ర్కీనుపైన చదవటం కళ్ళకి చాలా ఇబ్బంది. అందుకని కొద్దికొద్దిగా చదువుతూ, కళ్ళకి విశ్రాంతి ఇస్తూ చదువుకోవడం మంచిది. స్ర్కీను బ్రైట్‌నెస్‌ కూడా తక్కువ పెట్టుకుంటే కళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. 

ఆడియో పుస్తకాల ప్రయోజనం ఏంటి?
1) ముఖ్యంగా పుస్తకం చేతి దగ్గర లేనప్పుడో, లేదా చేతిలో పుస్తకం పట్టుకొని కూర్చునే వీలు లేనప్పుడే ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే, డ్రైవింగ్‌లో లేదా వాకింగ్‌లో వింటారు ఎక్కువమంది. 2) అయితే, నేను వీటిని ఇంకో తరహాగా కూడా వాడడం మొదలు పెట్టాను. చదవడానికి కష్టంగా ఉన్న పుస్తకాన్ని ఏదైనా  చేతిలోకి తీసుకొని, దాని ఆడియో చెవిలో పెట్టుకుంటూ చదివితే, భాషలోని శబ్దమాధుర్యానికి దగ్గరవుతాం. ఇప్పటికి పిల్లలకి స్కూలులో, కాలేజీలలో తెలుగుతో పరిచయం తక్కువ కాబట్టి, వారికి తెలుగు సాహిత్యం చదవటం అలవాటు చేయాలంటే ఇదో చక్కని ఉపాయం. 3) వెబ్‌లో తెలుగు ప్రముఖ నిఘంటువులన్నీ కలిపి ఒక చోట వెతుక్కునే వీలు ఆంధ్రభారతి సైట్‌లో దొరుకుతుంది (http://andhrabharati.com/dictionary). ఏవైనా ఇంగ్లీషు పదాలు పంటి కింద రాయిలా అడ్డు పడితే, అర్థం కోసం ఈ సైటుకి వెళ్ళడమే!

ఆన్‌లైన్‌ కోర్సుల్లో ఎలా నెట్టుకొని రావాలి? 
1) ఉచితంగా వస్తుంది కదా అని ఎక్కువ కోర్సులలో చేరవద్దు. బాగా ఆసక్తి ఉన్న ఒక కోర్సులో చేరి, అది మధ్యలో వదిలేయకుండా చూసుకోవాలి. 2) పుస్తకం కొనుక్కుంటే మనం చదువుతాం. కాసేపు ఆలోచించి పక్కన పెడతాం. కానీ ఈ కోర్సుల్లో పుస్తకాల విశ్లేషణ, విమర్శ చాలా ముఖ్యం. అందుకని కోర్సులో భాగంగా ఉండే చర్చలు, రైటింగు సబ్మిషన్లు చేయకపోతే వీటిలోని అసలు సారం అందదు. 

ఎక్కడ మొదలెట్టాలి, ఏం వదిలేయాలి? 
1) బాగా ఇష్టమైనది ఎక్కువగా దొరికినా తలనొప్పే! అన్నీ చదివేయాలని పిస్తుంది. కానీ మానవసాధ్యం కాదు కదా అది. అందుకని ఆన్‌లైన్‌ రీడింగ్‌కు కూడా ఒక పద్ధతి, ఒక ప్రణాళిక తయారుచేసుకుంటే ఉత్తమం. కొన్ని ఉదాహరణలు: వారంలో ఒక రెండు-మూడు గంటలు మాత్రమే పుస్తకాలు గురించి వెతికాలి, ఆసక్తి అనిపించినవాటితో ఒక జాబితా తయారుచేసుకోవాలి, వాటిలో కనీసం ఒకటీ అరా పుస్తకమో/ ప్రసంగమో పూర్తి చేస్తేగానీ మళ్ళీ గూగుల్‌ జోలికి పోకూడదు. 2) ఉచితంగానే కాకుండా, ఎప్పటికీ మన దగ్గరే ఉంటుందన్న నమ్మకం ఉన్నప్పుడు కూడా, తర్వాత చదవచ్చులెమ్మని పక్కకు పెట్టేస్తాం. చాలావరకూ అలానే జరిగినా, సమయం ఉన్నప్పుడు మాత్రం మంచి పుస్తకాలను పూర్తి చేయడమే మంచిది. 
ఈ జాబితా తయారు చేస్తున్నప్పుడు ఇంగ్లీషులో లభ్యమయ్యే సాహిత్యానికి, తెలుగులో ఉన్న కంటెంటుకి పోలికే కనిపించ లేదు. అలానే వేరే భారతీయ భాషలతో పోలిస్తే కూడా మనకి తక్కువ avenues ఉన్నాయి. ఎందుకంటే మనం చదవటమనే అలవాటుకే దూరమై పోతున్నాం. చదివేవాళ్ళు ఎక్కువైతేనే పుస్తకాలు రాసేవాళ్ళూ, వేసేవాళ్ళూ, అమ్మేవాళ్ళూ కూడా ఎక్కువవుతారు. టీవీలు, యూట్యూబులు, వాట్సాపులు ఎన్ని ఉన్నా, వాటి మీద వెగటు పుట్టగల పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, కాస్తయినా ధ్యాస పుస్తకాల మీదకి మళ్ళితే మనకి, మన ముందు తరాల వారికి శుభసూచకం. 

పూర్ణిమ తమ్మిరెడ్డి
purnimat07@gmail.com


ప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావుగారి నేతృత్వంలో నడుస్తున్న కథానిలయానికి అంతర్జాల రూపం ఇది. తెలుగు కథల పుట్ట. కొన్ని అరుదైన పుస్తకాలు, ఆంధ్ర పత్రికలాంటి పాత పత్రికలు ఈ సైటు నుండి పిడిఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్లోడు చేసుకోవచ్చు. 




Updated Date - 2020-04-20T10:47:23+05:30 IST