ఆ స్వాతంత్య్రం సాధిద్దాం

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

భారతదేశ స్వాత్రంత్య్ర సంగ్రామ చరిత్రలో అంతులేని విలక్షణ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఆ స్వాతంత్య్రం సాధిద్దాం

భారతదేశ స్వాత్రంత్య్ర సంగ్రామ చరిత్రలో అంతులేని విలక్షణ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది నిపుణులు, ఔత్సాహికులు, నిర్భయులు, దృఢ సంకల్పం కలిగిన కర్తవ్య పరాయణులు, సరళ స్వభావులైన దేశ భక్తులు, చారిత్రక వ్యక్తుల జీవన గాథలెన్నో వాటితో ముడిపడి ఉన్నాయి. ఈ కథలను చదివితే పిల్లల్లో, యువతలో ఆలోచన రేకెత్తుతుంది. ఏదో చేయాలనే ఉత్సాహం తలెత్తుతుంది. ‘ఆ రోజుల్లో మేము ఉండి ఉంటే... మా ప్రియమైన మాతృభూమి సేవలో చెమటోడ్చి, రక్తాన్ని చిందించి.. ఈ నేల రుణం తీర్చుకొని తరించే వాళ్ళం కదా!’ అనుకుంటారు. స్వాతంత్య్రం మనకందరికీ ప్రాణాలకన్నా మిన్న. మనకు లభించిన స్వతంత్రం ఒక రూపంలో రాజకీయ స్వాతంత్రం. 1857లో నిప్పురవ్వలా మొదలై... 1947లో దేశ విముక్తితో అది ముగిసింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రం అనే భావన చాలా విశాలమైనది. 


ద్వాపరయుగం తరువాత నేటి వరకూ ఉన్న చరిత్రలో... మానవుడు స్వాతంత్య్రం కోసం విలవిలలాడడమే వృత్తాంతం. నేటికి 2,500 ఏళ్ళ క్రితం ప్రజలకు విలువల పట్ల నమ్మకం ఉండేది. అజ్ఞానం, అత్యాశలు లేవు. అయినప్పటికీ సమయానుసారంగా ఎందరో ధర్మపితలు చెప్పిన సాధన, ఆచరణ, త్యాగం, నిషేధాలు... మానవ విముక్తి కోసమే. భోగలాలసల బానిసత్వానికి తిలోదకాలు ఇవ్వాలని శ్రీ ఆదిశంకరులు ఉద్బోధించారు. మర్యాద పూర్వకమైన ఆచరణ కోసం ఇబ్రహీమ్‌ పిలుపునిస్తే, కోరికల నుంచి విముక్తి పొందాలని గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. ద్వేషానికి అతీతమైన ప్రేమ మార్గాన్ని క్రీస్తు బోధించాడు. గురునానక్‌ దూర ప్రాంతాలకు కాలినడకన తిరుగుతూ... సామాన్య మానవులతో పాటు చక్రవర్తులకు కూడా అజ్ఞానం, అపవిత్రత, సంకుచిత సంస్కారాల విముక్తికోసం దీక్ష ఇచ్చాడు. ఎంతోమంది యోగులు, తపస్వులు హిమాలయాల సమీపంలోని గుహల్లో, నిర్జన ప్రదేశాల్లో... రోజుల తరబడి నీరు, ఆహారం తీసుకోకుండా... కఠోర సాధనలో నిమగ్నమయ్యారు. 


ఇప్పుడు మన దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటికీ... ప్రతి ఒక్కరూ పరతంత్రులయ్యే జీవిస్తున్నారు. ఎందుకంటే వారిని పూర్వ జన్మల కర్మ బంధాలు, దైహిక సంబంధాలు, పాపభారాలు బంధించి వేస్తున్నాయి. ఈ దృష్టితో చూస్తే... ముక్తికోసం చేసే సంఘర్షణ సమాప్తం కావడం లేదు. మరి ఈ ప్రభావాల బంధనాల నుంచి ఎలా స్వతంత్రులం కావాలి? దేహాభిమానం కలిగిన వ్యక్తులను గుడ్డిగా అనుసరించకుండా... ఆత్మ తాలూకు సహజ గుణాలను ఎలా వృద్ధి చేసుకోవాలి? మనం ఇతరుల ప్రభావం తాలూకు బంధన నుండి ఎలా స్వతంత్రులం కావాలి? మరి దేహాభిమానం కలిగిన వ్యక్తులను గుడ్డిగా అనుసరించక ఆత్మయొక్క సహజ గుణాలను ఎలా వృద్ధి చేసుకోగలగాలి?


అదృష్టవశాత్తూ ఆ రోజుల్లో సమాజానికి బాపూజీ మార్గదర్శకత్వం లభించింది. త్యాగం, అహింస, సత్యం, స్నేహం, క్షమ, అలసటలేని సేవ లాంటి గొప్ప లక్షణాలకు ఆయన ప్రతిరూపం. ఈశ్వరుడి పట్ల అపారమైన విశ్వాసాన్ని పెంచుకొని, మనోబలంతో ఆయన ముందడుగు వేశారు. కానీ నేటి ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని మానవత్వాన్నంతటినీ బంధిస్తున్న సంకెళ్ళను ఎలా తెంచాలి? దానికి ముక్తి ప్రదాత అయిన భగవంతుడి పట్ల విశ్వాసంతోపాటు ఆయన తోడు, నీడ, మార్గదర్శకత్వం.... ఇవన్నీ మనకు అవసరమే. పతనానికి దారితీసే వాటి నుంచి విముక్తినీ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్నీ ఆయన మార్గదర్శనలో సాధించాలి. అందరూ ప్రయత్నిస్తే ఆ బంగారు క్షణాలు ఎంతో దూరం లేవు. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం నిజమైన సంగ్రామం మనందరి మనసుల్లోనే జరుగుతోందని గ్రహించి, నిగ్రహంతో కార్యోన్ముఖులై, విజేతలుగా నిలుద్దాం.

బ్రహ్మ కుమారీస్‌ , 9010161616


Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST