మౌత్‌ అల్సర్లను వదిలించుకుందాం!

ABN , First Publish Date - 2021-05-19T05:30:00+05:30 IST

మౌత్‌ అల్సర్లు (నోటిలో పుండ్లు) చాలా ఇబ్బంది పెడతాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, కొన్ని పోషకాలు లోపించడం, పొగాకు వాడకం లాంటి ఎన్నో కారణాలతో మౌత్‌ అల్సర్లు తలెత్తుతాయి

మౌత్‌ అల్సర్లను వదిలించుకుందాం!

మౌత్‌ అల్సర్లు (నోటిలో పుండ్లు) చాలా ఇబ్బంది పెడతాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, కొన్ని పోషకాలు లోపించడం, పొగాకు వాడకం లాంటి ఎన్నో కారణాలతో మౌత్‌ అల్సర్లు తలెత్తుతాయి. చిన్న పూతగా మొదలై పుండ్లుగా మారుతాయి. సాధారణంగా ఇవి వారం రోజుల వరకూ ఉంటాయి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంట్లోనే లభించే పదార్థాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు.

  • కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలం. ఇది నొప్పులను తగ్గించి, సత్వర ఉపశమనం కలిగిస్తుంది. కొంచెం కొబ్బరి నూనెను మౌత్‌ అల్సర్‌ ఉన్న చోట రోజూ కొన్ని సార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • తులసి ఆకుల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. నోటిలో ఇన్ఫెక్షన్లను దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు త్వరగా తగ్గిస్తాయి. రోజూ కనీసం రెండు సార్లు తులసి ఆకులను నమిలి, కొద్దిసేపటి తరువాత వేడి నీటిని పుక్కిలిస్తే మౌత్‌ అల్సర్ల సమస్య తగ్గుతుంది. 
  • తేనెలోనూ యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు అధికం. మౌత్‌ అల్సర్లు ఉన్న చోట తేనెను రాస్తే, ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రదేశం పొడిబారిపోకుండా తేమగా ఉండేలా చేస్తుంది. తేనెలో కాస్త పసుపు వేసుకొని రాయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • మౌత్‌ అల్సర్ల కారణంగా కలిగిన నొప్పిని కలబంద లేదా అలోవెరా జ్యూస్‌ లేదా జెల్‌ చక్కగా నివారిస్తాయి. అల్సర్లు ఉన్న చోట వాటిని రోజుకు రెండు సార్లు రాస్తే చాలు, నొప్పి నియంత్రణలోకి వస్తుంది. అల్సర్లు త్వరగా తగ్గుతాయి. 
  • నోటిలో పూత లేదా పుండ్లకు చిరకాలంగా వినియోగిస్తున్న పదార్థం ఉప్పు. నోటిలోని బ్యాక్టీరియాను ఇది గణనీయంగా తగ్గించడంలో మౌత్‌ వాష్‌ కన్నా సమర్థవంతంగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి, రోజూ రెండుసార్లు పుక్కిలిస్తే మౌత్‌ అల్సర్లతో పాటు నోటికి సంబంధించిన ఇతర సమస్యలను నియంత్రించుకోవచ్చు.

Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST