కేసీఆర్‌ కుటుంబ పాలనకు పాతరేద్దాం!

ABN , First Publish Date - 2022-07-02T05:12:59+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు

కేసీఆర్‌ కుటుంబ పాలనకు పాతరేద్దాం!

  • రాష్ట్రాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం
  • మోదీ పాలనా దక్షతతో భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు
  • అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు నిధులు 
  • వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం 
  • బీజేపీ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌మహంతి 


తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఆ పార్టీ జాతీయ నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజవర్గాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. 


ఆమనగల్లు /కడ్తాల్‌ / షాద్‌నగర్‌ అర్బన్‌, జులై 1: రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం, అహంకార పాలనకు పాతరేసే సమయం ఆసన్నమైందని బీజేపీ ఒడిస్సా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌మహంతి అన్నారు. ఆమనగల్లు విఠాయిపల్లిలోని ఓ పంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమీర్‌మహంతి, జాతీయ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమీర్‌మహంతి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకొని కేసీఆర్‌ కుటుంబం విదేశాల్లో దాచుకుంటుందని ఆయన ఆరోపించారు. కేంద్రం అన్నిరాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఫామ్‌హౌజ్‌, ప్రగతి భవన్‌లో ఉండే కేసీఆర్‌కు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశం అద్భుత విజయాలు సాధించిందన్నారు. మోదీ బహిరంగ సభకు భారీగా తరలివచ్చి తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చాటాలని ఆయన పిలుపు నిచ్చారు. బీజేపీ విజయ సంకల్పన సభ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాంది అన్నారు. సమావేశంలో కండె హరిప్రసాద్‌, శేఖర్‌రెడ్డి, కాసుల వెంకటేశ్‌, గోరటి నర్సింహ, చెక్కాల లక్ష్మణ్‌, వీరయ్య, విష్ణు, బక్కికుమార్‌, శ్రీకాంత్‌, దుర్గయ్య, రాంపాల్‌, మన్యనాయక్‌ పాల్గొన్నారు. 


రాష్ట్రంలో అధికారమే బీజేపీ లక్ష్యం : ఆర్‌పీ సింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ తెలిపారు. షాద్‌నగర్‌లోని బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రధాని మోదీ శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలు బాగుపడతారని, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా కార్యకర్తల్లో చైతన్యం తీసుకొస్తున్నామని అన్నారు. షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రేపు జరిగే బీజేపీ విజయసంకల్ప సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎన్‌. శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, దేపల్లి అశోక్‌గౌడ్‌, డాక్టర్‌ టి.విజయ్‌కుమార్‌, కక్కునూరి వెంకటే్‌షగుప్త, డాక్టర్‌ ప్రణీత్‌రెడ్డి, పి. వెంకటేశ్వర్‌రెడ్డి, కె. మనోహర్‌రెడ్డి, మఠం రుషీకేష్‌, మోహన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


తండాలో నిద్ర.. బోరు వద్ద స్నానం

ఫరూఖ్‌నగర్‌ మండలం గుండ్యానాయక్‌ తండాలోని బిజెపి కార్యకర్త వినోద్‌నాయక్‌ ఇంట్లో గురువారం రాత్రి ఆర్‌పిసింగ్‌ బస చేశారు. శుక్రవారం ఉదయం తండా పరిసరాల్లోని వ్యవసాయ పొలాల్లో తిరిగి, బోరు వద్ద స్నానం చేశారు. అనంతరం గిరిజనులు ఇచ్చిన జొన్నరోట్టెను అల్ఫాహారంగా తిన్నారు. ఈ సందర్భంగా ఆర్‌పీసింగ్‌ మాట్లాడారు. మానవ మనుగడకు ప్రకృతి కల్పించిన వనరులను అందిపుచ్చుకుని సహజసిద్ధంగా జీవనం గడిపేవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు.  మనిషి సాంకేతిక విప్లవంలో పరుగులు పెడుతూ కృత్రిమ వనరులకు భానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయాన్ని వదిలి, రసాయనిక వ్యవసాయ ఉత్పత్తులతో అనారోగ్యాలకు గురవుతున్నారని వివరించారు.


నడ్డా రోడ్‌షో అదుర్స్‌

రంగారెడ్డి అర్బన్‌/శంషాబాద్‌ రూరల్‌/ శంషాబాద్‌ / షాద్‌నగర్‌, జూలై 1 : హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరయ్యేందుకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీకాన్వాయి మధ్య శంషాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున రోడ్‌ షో నిర్వహించారు.  వందలాది వాహనాలతో సుమారు గంటకు పైగా రోడ్‌ షో సాగింది. ఈ రోడ్డు షోలో నడ్డాతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, పార్టీ సీనియర్‌ నాయకులు తూళ్ల వీరేందర్‌గౌడ్‌, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఉన్నారు.  కిలో మీటర్‌ వరకు నిర్వహించిన రోడ్‌ షోలో జాతీయ అధ్యక్షుడికి దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ ఆయన ముం దుకు సాగారు. కమలనాథులు పూల వర్షం కురిపించారు. ముస్లిం మహిళలు నడ్డాకు స్వాగతం పలికారు. పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా శంషాబాద్‌కు రాకతో పట్టణమంతా కాషాయ రంగును సంతరించుకుంది. పార్టీ జెండాలు, బ్యానర్లు పోస్టర్లు దారి పొడవునా దర్శనమిచ్చాయి. ముస్లిం మహిళలు నడ్డాకు స్వాగతం పలికారు. పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. జేపీ నడ్డా రోడ్‌ షో సందర్భంగా  పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శంషాబాద్‌ మండల కేంద్రానికి వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు రావడంతో శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయం సందడిగా మారింది. భారత సంప్రదాయబద్ధంగా బీజేపీ మహిళా కార్యకర్తలు హారతులు ఇచ్చి  స్వాగతం పలికారు.

Updated Date - 2022-07-02T05:12:59+05:30 IST