డ్రెడ్జింగ్‌తో తోడేద్దాం!

ABN , First Publish Date - 2020-10-24T08:36:56+05:30 IST

రాష్ట్రంలో నూతన ఇసుక విధానం తీసుకురానున్న ప్రభుత్వం.. అందులో భాగంగా డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇసుకను నది ఒడ్డునున్న

డ్రెడ్జింగ్‌తో తోడేద్దాం!

ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద మేట వేసిన ఇసుకపై సర్కారు కన్ను!

నదీగర్భాల్లో యంత్రాలతో తవ్వకం నిషిద్ధం

పర్యావరణానికీ ప్రమాదం

ఎవరైనా ఇలా చేస్తే అక్రమమే

సక్రమం చేయాలని యోచన

నూతన ఇసుక విధానంలో

డ్రెడ్జింగ్‌కు అధికార అనుమతి!

పర్యావరణ సమస్యలపై మదింపు

నూతన ఇసుక విధానంలో అనుమతి!!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో నూతన ఇసుక విధానం తీసుకురానున్న ప్రభుత్వం.. అందులో భాగంగా డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇసుకను నది ఒడ్డునున్న రీచ్‌లలోనే కాకుండా.. నది మధ్యలో అత్యంత లోతుకు వెళ్లి తవ్వేందుకు అనుమతివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. భారీ యంత్రాల ద్వారా నదుల మధ్యలో.. ముఖ్యంగా బ్యారేజీల వద్ద పేరుకుపోయిన ఇసుకను తీసేందుకు అనుమతివ్వాలని అనుకుంటున్నారు.


కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ, గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజీల వద్ద కొన్ని కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉందని అంచనా. అయితే ఇది నదుల మధ్యలో ఉంది. దానిని మామూలుగా తవ్వితీయడం వీలుకాదు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రెడ్జర్లు.. కొన్ని వందల అడుగుల వరకు వెళ్లి ఇసుకను పైకి తోడేస్తాయి. సముద్ర గర్భానికి వెళ్లి చమురును వెలికితీసినట్లుగా నదీగర్భాల్లో కూడా డ్రెడ్జర్‌ యంత్రాల ద్వారా ఇసుకను వెలికితీయొచ్చు. అయితే ఇందుకు పర్యావరణ అనుమతులు కావలసి ఉంటుంది. అందుకే ఇంతవరకు డ్రెడ్జింగ్‌కు గతంలో ఏ ప్రభుత్వమూ అనుమతి ఇవ్వలేదు.  ఇప్పుడు ఈ ప్రక్రియకు అధికారికంగానే అనుమతి ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం యోచిస్తోంది.


తద్వారా నదుల మీద నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల వద్ద దశాబ్దాల నుంచి పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించేందుకు, అదే సమయంలో కొన్ని కోట్ల టన్నుల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయన్న ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారు. 




బ్యారేజీల వద్ద ఐదేళ్లకు సరిపడా ఇసుక!

రాష్ట్రంలో ఏటా సుమారు కోటి యూనిట్లకు పైగా ఇసుక అవసరమని అంచనా. ఈ లెక్కన ఐదేళ్లపాటు మన రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇసుక నిల్వలు గోదావరి, కృష్ణా బ్యారేజీల వద్దే ఉన్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో బ్యారేజీల వద్ద పూడిక తీసినట్లూ అవుతుంది.. నీటి నిల్వ సామర్థ్యమూ పెరుగుతుంది.


నదులు, వాగుల్లో ఉన్న అన్ని రీచ్‌లతో పాటు ఇలా డ్రెడ్జింగ్‌కు అనుమతిచ్చి బ్యారేజీల వద్ద ఇసుకను తీస్తే ఎంత డిమాండ్‌ ఉన్నప్పటికీ తేలిగ్గా సరఫరా చేయగలుగుతామన్నది ప్రభుత్వ యోచనగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి పర్యావరణ అంశాలను మదింపు చేస్తున్నారు. నదీ గర్భాల్లోకి వెళ్లి డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను తోడేయడం వల్ల పర్యావరణపరంగా ఇబ్బందులు వస్తాయి.. ఈ ఇసుక మేటలతో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందని.. నీటి ఊటలను ఇంకింపజేసుకుని భూగర్భ జలాలను పెంచుకోవడానికి సహకరిస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.


Updated Date - 2020-10-24T08:36:56+05:30 IST