రైతులకు చేయూతనిద్దాం

ABN , First Publish Date - 2021-06-24T04:47:21+05:30 IST

పామాయిల్‌ తోటలు సాగు చేయడంలో సిద్దిపేట నియోజకవర్గం ముందుండాలని, సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించి వారికి చేయూతనిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

రైతులకు చేయూతనిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

 పామాయిల్‌ సాగుపై అవగాహన కల్పించాలి

 రసాయన ఎరువుల వాడకం తగ్గించి,               

      పచ్చిరొట్ట విత్తనాలు వాడేలా ప్రోత్సహించాలి

 సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, జూన్‌ 23: పామాయిల్‌ తోటలు సాగు చేయడంలో సిద్దిపేట నియోజకవర్గం ముందుండాలని, సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించి వారికి చేయూతనిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి రైతులు ముందుకొచ్చేలా చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. బుధవారం సిద్దిపేట సుడా కార్యాలయంలో వరి వెదసాగు, పామాయిల్‌ తోటలు పెంపకం, మల్బరీ తోటల సాగుపై అగ్రికల్చర్‌, సెరి కల్చర్‌ అధికారులు, నియోజకవర్గ పరిధిలోని అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూర్‌, నారాయణరావుపేట, నంగునూర్‌ మండలాల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చందలాపూర్‌ క్లస్టర్‌లో 200 ఎకరాల లక్ష్యం ఉండగా,  36 ఎకరాల్లో పూర్తయిందని, మిగిలిన 60 ఎకరాలు నెలలోపు పూర్తి చేయాలని సూచించారు. మరో 100 ఎకరాలు జూలైలో పూర్తి చేయాలని సెరికల్చర్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. విత్తన సాగు, ఆయిల్‌ పామ్‌, వరి వెదసాగు, మల్బరీ తోటలు పెంపకం చేపట్టేలా చూడాలని, అలాగే రైతుబంధు పడని రైతులు ఉండరాదన్నారు. జిల్లాలో రైతుబంధు డబ్బులు 95 శాతం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. రైతుబంధు పడని రైతుల కోసం స్పెషల్‌ డైరవ్‌ చేపట్టి రైతుబంధు చేరేలా అధికారులు చొరవ చూపాలన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, పచ్చిరొట్ట విత్తనాలు, పత్తి, కంది సాగు పెంచి వరి తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీటిపై ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపులో అప్‌డేట్‌ చేయాలని ఏఈఓలకు సూచించారు. ఒక్కో ఏఈఓ వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి 10 మంది రైతులతో మల్బరీ తోటల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో మొదటిసారిగా 50 వేల ఎకరాలు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులను ప్రశంసించారు. పచ్చిరొట్ట ఎరువుల సాగుతో భూసారం పెరిగి యూరియా వాడకం తగ్గుతుందన్నారు. 


రైతులను పట్టించుకోకుంటే తొలగించాలి


మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితి అధ్యక్షులు రైతులను పట్టించుకోకుంటే పదవి నుంచి తొలగించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతీ రైతువేదికలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కూర్చోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు నిర్దేశించిన 25 శాతం వరిలో వెదజల్లే పద్ధతిని తప్పకుండా చేపట్టాలన్నారు. ఈ వానాకాలంలో నియోజకవర్గంలో 10 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. వరి వెదసాగు, విత్తనోత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించారని ఏఈఓలు, వ్యవసాయ అధికారుల వారీగా మంత్రి ఆరా తీశారు. విత్తనోత్పత్తిపై కంపనీ ఆర్గనైజర్లతో రైతులకు అవగాహన, చైతన్య సమావేశాలు జరపాలని సూచించారు.  


 

Updated Date - 2021-06-24T04:47:21+05:30 IST