ఆయన మళ్లీ టీడీపీ గూటికే.. కీలక పదవి..!?

ABN , First Publish Date - 2021-09-03T05:30:00+05:30 IST

ఆయన మళ్లీ టీడీపీ గూటికే.. కీలక పదవి..!?,,

ఆయన మళ్లీ టీడీపీ గూటికే.. కీలక పదవి..!?
మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన జిల్లా టీడీపీ నాయకులు

  • బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేద్దాం
  • టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌.. నేడు అధికారిక ప్రకటన
  • జమ్మలమడుగు ఇన్‌చార్జిగా దేవగుడి భూపేశరెడ్డి
  • జిల్లా నాయకుల భేటీలో అధినేత చంద్రబాబు

కడప/అమరావతి, సెప్టంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి. రానున్న బద్వేలు ఉప ఎన్నికల్లో సత్తా చాటాలి’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కడప పార్లమెంట్‌ నాయకులతో అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇనచార్జిలు, ముఖ్య నాయకులతో చంద్రబాబు విడివిడిగా చర్చించారు. పార్టీని వీడిన వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం.


బద్వేలు టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌

బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే విషయంపై బద్వేలు, జిల్లా నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత బద్వేలు ఉప ఎన్నికల్లో తప్పక పోటీ చేద్దాం.. పార్టీ అభ్యర్థిగా డాక్టరు రాజశేఖర్‌ బరిలో ఉంటారని చంద్రబాబు పేర్కొనడంతో జిల్లా నాయకులు సమష్టిగా మద్దతు తెలిపారు. నేడు అధికారికంగా బద్వేలు టీడీపీ అభ్యర్థిని ప్రకటించనున్నారు.


జమ్మలమడుగు ఇన్‌‌చార్జి దేవగుడి భూపేశరెడ్డి..?

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దేవగుడి భూపేశ్‌రెడ్డిని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్‌ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేశారు. కాని ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా... రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. కాని రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకొన్నాయి. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఆ వర్గంలో ప్రధాన నేత అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఆయన కుమారుడు భూపేశ్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కడప జిల్లా నేతలు చంద్రబాబు నిర్ణయానికి  ఆమోదం తెలిపారు. తాము నియోజకవర్గంలో తమ వర్గానికి చెందిన వారందరినీ కలిసి మాట్లాడి మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతామని దేవగుడి వర్గీయులు చెప్పినట్లు సమాచారం. కాగా.. కొంతకాలంగా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి జమ్మలమడుగు ఇనచార్జిగా ఉన్నారు.


అయితే.. రాబోయే ఎన్నికల్లో ఆయన పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉండడంతో జమ్మలమడుగుకు బలమైన నాయకత్వం కోసం పార్టీ కసరత్తు చేసింది. అందులో భాగంగా భూపేశను ఎంపిక చేశారు. అధినేతతో భేటీ అయిన వారిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మైదుకూరు ఇనచార్జి, టీటీడీ మాజీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌, ప్రొద్దుటూరు ఇనచార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బద్వేలు టీడీపీ యవనాయడు రితేష్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టరు రాజశేఖర్‌తో పాటు జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-09-03T05:30:00+05:30 IST