కేసీఆర్‌ సర్కారును దించేద్దాం

ABN , First Publish Date - 2022-07-03T08:31:42+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును సాగనంపాలని బీజేపీ కంకణం కట్టుకుంది! కాషాయ సర్కారు ఏర్పాటుకు సంకల్పం చెప్పుకొంది

కేసీఆర్‌ సర్కారును దించేద్దాం

  • రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు
  • అమరుల త్యాగాలను కేసీఆర్‌ గౌరవించలేదు
  • జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై
  • ప్రత్యేక తీర్మానం ముసాయిదాలో బీజేపీ
  • నేడు ప్రవేశపెట్టి, ఆమోదించే అవకాశం
  • సీఎం కేసీఆర్‌ తనకు కాకుండా, యశ్వంత్‌కు 
  • స్వాగతం పలకడంపై మోదీ మనస్తాపం!
  • మోదీ దృష్టికి నగరంలో ఫ్లెక్సీల రాజకీయం
  • కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న రాష్ట్ర నేతలు


న్యూఢిల్లీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును సాగనంపాలని బీజేపీ కంకణం కట్టుకుంది! కాషాయ సర్కారు ఏర్పాటుకు సంకల్పం చెప్పుకొంది! కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించింది! ఈ మేరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక తీర్మానాన్ని ఆదివారం ప్రవేశపెట్టి, ఆమోదించనుంది. తెలంగాణ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటికే తీర్మానం ముసాయిదాను రూపొందించారు. తెలంగాణలో పూర్తిగా వారసత్వ పాలన నడుస్తోందని, కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు కేటీఆర్‌, కవిత, హరీశ్‌ పాలనా వ్యవస్థను ఆక్రమించుకుని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారని తీర్మానంలో పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అవినీతి మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదని, దానిని అంతమొందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకు ఎందరో అమరులు త్యాగాలు చేశారని, వారిని కేసీఆర్‌ గౌరవించలేదని మండిపడ్డారు. వారి త్యాగాలను గౌరవించాలంటే ప్రజలకు సన్నిహితమైన పాలన రావాల్సి ఉందని, అది బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సాధారణంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తూ ఉంటారు. కానీ, ఈసారి వాటితోపాటు తెలంగాణపై ప్రత్యేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించాలనుకోవడం రాష్ట్రంపై బీజేపీ సీరియ్‌సనె్‌సను తెలియజేస్తోంది. అంతేనా, తొలుత తెలంగాణపై తీర్మానంలో పరుష పదజాలం ఉండకూడదని భావించిన నాయకత్వం.. శనివారం కేసీఆర్‌ అవలంబించిన వైఖరితో తమ అభిప్రాయం మార్చుకోవడం విశేషం.


మోదీ తీవ్ర మనస్తాపం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది. వరుసగా మూడోసారి హైదరాబాద్‌ వచ్చిన తనకు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకకపోవడం; మరీ ముఖ్యంగా, ఈసారి తనకు స్వాగతం పలకకపోవడానికితోడు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలకడం, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తనపై తీవ్ర దుర్భాషలాడడంపై మోదీ మనో వేదనకు గురైనట్లు తెలిసింది. ఇక, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం; అడుగడుగునా టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు పెట్టడం, చివరికి, వేదిక వద్ద కూడా బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించి టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించడాన్ని రాష్ట్ర నేతలు మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్‌ చాలా అల్పంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఒక నేత వ్యాఖ్యానించినప్పుడు.. మోదీ తలపంకించి.. ఆయన భుజం తట్టినట్లు సమాచారం. అనంతరం నోవాటెల్‌ హోటల్‌ వద్ద  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలకకుండా రాజకీయ మర్యాదలకు కేసీఆర్‌ తూట్లు పొడిచారని మండిపడ్డారు. ప్రొటోకాల్‌ పాటించని కేసీఆర్‌ అవమానించింది ఓ వ్యక్తిని కాదని, వ్యవస్థనని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌ నియంత అని మండిపడ్డారు. సహకార సమాఖ్య విధానంలో భాగంగా కేసీఆర్‌తోపాటు దేశంలో ఎంతోమంది నేతలను ప్రధాని కలుస్తుంటారని, హుందాగా వ్యవహరిస్తారని, కానీ, కేసీఆర్‌ కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరించారని తప్పుబట్టారు.


తెలంగాణపై ప్రత్యేక వ్యూహ రచన

తెలంగాణలో ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయాలని, పన్నా ప్రముఖ్‌లను నియమించాలని రాష్ట్ర నాయకులకు జాతీయ నేతలు సూచించారు. తెలంగాణకు చెందిన నేతలతో జాతీయ నేతలు ప్రత్యేకంగా సమావేశమై వ్యూహ రచన చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై కూడా చర్చించారు. బూత్‌ స్థాయిలో పటిష్ఠం చేయడమే లక్ష్యం కావాలని నిర్దేశించారు. కేంద్ర స్థాయిలో అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులను తెలంగాణలో కూడా గుర్తించి వారి వద్దకు చేరుకోవాలని సూచించారు.

Updated Date - 2022-07-03T08:31:42+05:30 IST