సిలికా జోలికోస్తే ఒప్పుకోం

ABN , First Publish Date - 2022-08-18T06:23:41+05:30 IST

తరతరాలుగా సిలికా భూములను నమ్ముకుని జీవిస్తున్నాం..ఆ భూములను మైనింగ్‌ లీజుల పేరుతో మాకు దూరం చేయాలని చూస్తే ఒప్పుకోమంటూ సముద్రతీరప్రాంత గ్రామాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు.ఆందోళనకారుల నిరసనలతో చేసేదిలేక అధికారులు వెనుదిరిగారు.

సిలికా జోలికోస్తే ఒప్పుకోం
గ్రామసభ మాకొద్దు... అధికారులు గోబ్యాక్‌ అంటూ ప్లేకార్డులతో బైఠాయించిన గ్రామస్థులు

ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న కొత్తపట్నంవాసులు 

చేసేదిలేక వెనుదిరిగిన అధికారులు 


కోట, ఆగస్టు 17 : తరతరాలుగా సిలికా భూములను నమ్ముకుని జీవిస్తున్నాం..ఆ భూములను మైనింగ్‌ లీజుల పేరుతో మాకు దూరం చేయాలని చూస్తే ఒప్పుకోమంటూ సముద్రతీరప్రాంత గ్రామాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు.ఆందోళనకారుల నిరసనలతో చేసేదిలేక అధికారులు  వెనుదిరిగారు.కోట మండలంలో సముద్ర తీర ప్రాంత పంచాయతీ అయిన కొత్తపట్నంలో సర్వే నెంబరు 314/ఎలో 30 ఎకరాల సిలికా భూములున్నాయి.వాటిని  మైనింగ్‌ పేరుతో లీజుకు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో కొత్తపట్నంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో తహసీల్దారు పద్మావతి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆర్డీవో మురళీకృష్ణ,  మైనింగ్‌ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు, ఎంపీడీవో భవానీ ఉదయం కొత్తపట్నం చేరుకున్నారు. సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు  ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు గ్రామసభ జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.కొత్తపట్నం, గోవిందపల్లి,  గోవిందపల్లిపాళెం,  వావిళ్ల దొరువు, గున్నంబడియా, యమదిన్నెపాళెం గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణ సభకు ట్రాక్టర్‌లో తెప్పిస్తున్న షామియానా, కుర్చీలను మధ్యలోనే దించేసి కొన్ని కుర్చీలను విరగ్గొట్టారు.ప్లకార్డులు పట్టుకొని సిలికా, మైనింగ్‌ మాకొద్దు... అధికారులూ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు.పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అధికారుల వైపు రానివ్వకుండా వెనక్కు నెట్టారు. దీంతో కొంతమంది అధికారులు అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయే మోనని పక్కనే ఉన్న సచివాలయంలోకి వెళ్లిపోయారు. గంట తరువాత ఆందోళనకారులు, సర్పంచ్‌ తిరుపాల్‌, ఉప సర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌, ప్రభాకర్‌గౌడ్‌, ఎంపీటీసీ శేషయ్య, మురళీ తదితరులు అధికారుల వద్దకు చేరుకొని తమ వాదన విన్పించారు. సిలికా భూములున్న ప్రాంతంలో తరతరాలుగా సొన కాలువలున్నాయని.. ఆ కాలువల నుంచి సహజసిద్ధంగా వచ్చే నీటిధారతో వందలాది ఎకరాల భూముల్లో వరి, వేరుశనగ పంటలను పండించుకుంటున్నామన్నారు.ఆ సిలికా భూముల్లోనే ఫిల్టర్‌ పాయింట్ల ద్వారా కొత్తపట్నం పంచాయతీలోని వందలాది కుటుంబాలకు తాగునీరు సరఫరా అవుతోందన్నారు.ఆ భూములను మైనింగ్‌ పేరుతో లీజుకు ఇస్తే ఆ సౌకర్యాలన్నీ కోల్పోతామన్నారు. ఆ భూముల జోలికి రావొద్దని కోరారు.గ్రామసభను నిర్వహించాలని చూస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. సుమారు 2 గంటలపాటు అధికారులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో గ్రామసభను వాయిదావేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తహసీల్దారు పద్మావతి మాట్లాడుతూ గ్రామసభ ఎప్పుడు జరిగేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 



Updated Date - 2022-08-18T06:23:41+05:30 IST