బతికి సాధించుకుందాం

ABN , First Publish Date - 2021-06-19T06:08:21+05:30 IST

నిర్వాసితులారా ఆత్మహత్యలు వద్దు.. బతికి సాధించుకుందామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఉంటే పోరాటం చేద్దాం కానీ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల్లో నిజమైన అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామంలో రైతు ఆత్మబలిదానం చేసుకోగా ఎమ్మెల్యే తొగుట మండలం వేములఘాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.

బతికి సాధించుకుందాం
మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

పోరాటం చేద్దాం.. ఆత్మహత్యలకు పాల్పడొద్దు

ప్రభుత్వం నిజమైన అర్హులకు న్యాయం చేయాలి

ఇంటి కట్టెను చితిగా పేర్చుకుని సజీవదహనం చేసుకోవడం 21వ శతాబ్దంలో ఇదే మొదటిది

పగులుతున్న గుండెలు.. మండుతున్న చితి మంటలను చూసైనా స్పందించాలి

ముఖ్యమంత్రికి జీవితాన్నిచ్చిన సొంత జిల్లాలోనే రైతులు ఇలా చనిపోతే ఎలా ?

20న సీఎం గంటపాటు సమయమిచ్చి సమీక్షించాలి

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజ్ఞప్తి


గజ్వేల్‌/సిద్దిపేట క్రైం, జూన్‌ 18 : నిర్వాసితులారా ఆత్మహత్యలు వద్దు.. బతికి సాధించుకుందామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఉంటే పోరాటం చేద్దాం కానీ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల్లో నిజమైన అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామంలో రైతు ఆత్మబలిదానం చేసుకోగా ఎమ్మెల్యే తొగుట మండలం వేములఘాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బేగంపేట పోలీ్‌సస్టేషన్‌కు ఆయనను తరలించారు. అనంతరం రైతు మృతదేహాన్ని సిద్దిపేట మార్చురీలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేములఘాట్‌కు చెందిన రైతు తుటుకూరు మల్లారెడ్డి సజీవదహనం చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. తన పాత ఇంటి కట్టెను చితిగా పేర్చుకుని సజీవదహనం చేసుకోవడం 21వ శతాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. తన చావైనా ఇతరులకు న్యాయం చేస్తుందని భావించి మల్లారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. జిల్లా, రెవెన్యూ యంత్రాంగం నిజమైన అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. బెదిరించే విధానానికి స్వస్తి పలకాలని, దీంతో రైతులు మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలకు దిగుతున్నారన్నారు. పగులుతున్న గుండెలను, మండుతున్న చితి మంటలను చూసైనా జిల్లా అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఈ ఘటనతో అభివృద్ధి అంతా డొల్ల అనేది నిజమైందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతిపక్షాలు మాట్లాడితే అవహేళన చేసే టీఆర్‌ఎస్‌ నాయకులకు రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. రైతు తన ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకోవడం చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. వేల కోట్ల రూపాయలు కుర్చీలకు, ఏసీలకు, రంగుల పేరిట ఖర్చు చేసే అధికారులు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి జీవితాన్నిచ్చిన సొంత జిల్లాలోనే రైతులు ఇలా చనిపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం రైతు మృతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 20న జిల్లాకు వస్తున్నందున ప్రత్యేకంగా ఒక గంటపాటు సమయం ఇచ్చి ఈ విషయంపై సమీక్ష చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానని రఘునందన్‌రావు తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలే్‌షగౌడ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగొని సురే్‌షగౌడ్‌, మీడియా సెల్‌ జిల్లా కన్వీనర్‌ గోనె మార్కండేయులు, వెంకట్‌, నవీన్‌, ప్రవీణ్‌, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు

రాయపోల్‌, జూన్‌ 18 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తొగుట మండలం వేములఘాట్‌ గ్రామంలో రైతు సజీవ దహనానికి పాల్పడిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న ఆయనను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం దౌల్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే వేములఘాట్‌ గ్రామంలో రైతు సజీవ దహనానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తాను గెలిచిన తర్వాత ఆరు నెలల్లోపు ముంపు గ్రామాల రైతులకు న్యాయం చేస్తానని, లేకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఆయన వెంట సీనియర్‌ నాయకులు నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.




Updated Date - 2021-06-19T06:08:21+05:30 IST