కరోనా నేర్పుతున్న పాఠాలు

ABN , First Publish Date - 2020-04-01T05:56:32+05:30 IST

కరోనా వైరస్ మూలంగా దేశ వ్యా ప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్‌ను పొడిగించే విషయంలో ఎ లాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ప్రకటించిన రోజే మరో ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది...

కరోనా నేర్పుతున్న పాఠాలు

సమస్యలు వస్తే కాని ప్రభుత్వాలు కార్యాచరణకు దిగవని మన ప్రాథమిక ఆరోగ్య సంక్షేమ రంగాన్ని చూస్తేనే అర్థమవుతుంది. దేశంలో ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే ఒక్క గదిలోనూ, గుడిసెల్లోనూ, చాలీ చాలని వసతుల్లోనూ, ఆఖరుకు విద్యుత్  కూడా లేని స్థితిలో  నడుస్తున్నాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో మన ఆరోగ్య రంగం ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో స్పష్టమవుతోంది. ఈ వైరస్ ప్రమాదం తొలిగిన తర్వాతనైనా ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వం సమగ్ర దృష్టిని సారించాలి.


కరోనా వైరస్ మూలంగా దేశ వ్యా ప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్‌ను పొడిగించే విషయంలో ఎ లాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ప్రకటించిన రోజే మరో ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మార్చి రెండవ వారంలో హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగీ జమాత్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశాల్లో పాల్గొన్నవారిలో అనేకమందికి కరోనా వైరస్ సోకిందని, వారి ద్వారా ఇతరులకు కూడా పాకిందనే వార్త సహజంగానే చాలామందికి భయాందోళనలు కలిగించింది. నిజానికి ఈ విషయంపై గత రెండు మూడు రోజులుగా విలేఖరులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో మార్చి రెండవవారంలో పెద్ద సంఖ్యలో ఒక మతస్థులు ఏమైనా సమావేశాలు జరిపారా.. అని ఆరా తీశారు. నిజానికి ఢిల్లీలోని రామలీలా మైదానంలో కాని, ఇతర బహిరంగ ప్రాంతాల్లో కానీ మార్చి రెండో వారంలో అధికారికంగా ర్యాలీలు, సమావేశాలు జరగలేదు.  కాని నిజాముద్దీన్ ప్రాంతంలోని అలామీ మర్కజ్ బంగ్లేవాలీ మసీదులో అనధికారికంగా ప్రార్థనా సమావేశాలు జరిగాయని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా సోకిన వారు అనేకమంది ఈ సమావేశాలకు హాజరయ్యారని చివరకు తేలింది. ఈ మసీదులో ఇలాంటి ప్రార్థనా సమావేశాలు జరగడం, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్ తదితర దేశాల వారు కూడా ఈ ప్రార్థనా సమావేశాలకు హాజరు కావడం తరుచూ జరుగుతుంటుందని కూడా తెలిసింది.


ప్రగాఢ భక్తి విశ్వాసాలను ప్రచారం చేసే తబ్లీగీ జమాత్ సంస్థ నిర్వహించే ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యేవారు పూర్తిగా దైవభక్తిలోనే లీనమై ఉంటారు. లౌకిక విషయాల పట్ల వారికి పట్టింపు ఉండదు. బయట ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో, రాజకీయాలు ఎలా ఉన్నాయో వారికి సంబంధం ఉండదు. టీవీలు, పేపర్లు కూడా చూడరని అంటారు. ఆహారం, విలాసాలపై కూడా వారికి మక్కువ ఉండదు. భోజనం, నిద్రకు తక్కువ సమయం కేటాయించి నిత్యం ప్రార్థనలోనే నిమగ్నమవుతారు. టెక్నాలజీని పెద్దగా పట్టించుకోరు. తమ రోజువారీ ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తాము నేర్చుకున్న మత బోధనల గురించి ఒకరికొకరు సన్నటి స్వరంతో పంచుకుంటారు. వారేం మాట్లాడుకుంటున్నారో ఇతరులు గ్రహించలేరు. ప్రపంచంలో ఇలాంటి మత విశ్వాసాలు ఉండేవారు పెద్ద సంఖ్యలో అనేక మతాల్లో ఉన్నారు. ఉపవాసాలు చేసేవారు, నిష్టగా ఉండాల్సిన సమయంలో మంచినీరు కూడా ముట్టని వారు, మైళ్ల కొద్దీ నడిచి తీర్థయాత్రలకు వెళ్లేవారు, పొర్లు దండాలు పెట్టేవారు ఎలాంటి వారో  తబ్లీగీ జమాత్ సంస్థ  విశ్వాసాలు నమ్మే వారు కూడా అలాంటి వారే. అయితే ఈ సంస్థ పేరు ఉపయోగించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినవారు లేకపోలేదు. అందుకే కొన్ని దేశాల్లో ఈ సంస్థను నిషేధించారు.


మన దేశంలో ఈ సంస్థ గురించి ఎలాంటి అనుమానాస్పద సమాచారం అందనందువల్లనేమో వారి ప్రార్థనా సమావేశాలు యథావిధిగా సాగుతున్నాయి. భారత దేశంలో సిఐఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ, కరోనా వైరస్ తీవ్రత ఇతర దేశాల్లో పొడసూపినప్పటికీ నిజాముద్దీన్ వద్ద మసీదులో జరిగిన సమావేశానికి వివిధ దేశాల వారు వచ్చి ప్రార్థనలు జరుపుకోవడానికి వీలుగా వారికి వీసాలు లభించాయి. ఇందుకు ప్రార్థనలు జరిపిన వారిని కానీ నిర్వహించిన వారిని కానీ తప్పుపట్టడానికి వీలు లేదు. మతం ప్రాతిపదికగా నిందించడానికి కూడా ఆస్కారం లేదు. ఆ సమయంలో దేశంలో ఇతర చోట్ల కూడా పెళ్లిళ్లూ, విందులూ, రాజకీయ సమావేశాలు జరిగాయి. ఒక విందుకు హాజరైన పార్లమెంటు సభ్యులు కూడా క్వారంటైన్ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ సభ్యులు, విఐపిలు, విదేశాలనుంచి వచ్చిన ప్రముఖులు అయితే సులభంగా గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. వారి గురించి మీడియా కూడా ప్రముఖంగానే ప్రచురిస్తుంది. కాని సామాన్య యాత్రికులు, పర్యాటకులు జమాత్ లాంటి ఎలాంటి అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నారో. ఎక్కడెక్కడ తిరిగారో కనిపెట్టడం అంత సులభం కాదు. అందుకే నిజాముద్దీన్ ప్రార్థనా సమావేశం గురించి వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తోంది. అయినా ఏదైనా అనుభవంలోకి వచ్చిన తర్వాత కాని చర్యలు తీసుకోకపోవడం అనేది  మన దేశంలో వ్యవస్థలకు. ప్రభుత్వాధినేతలకు అలవాటైన విషయమే. ఇప్పుడు తీసు కున్న చర్యలను రెండు వారాల ముందు తీసుకుని ఉంటే జమాత్ లాంటి సమావేశాలకు ఆస్కారం ఉండేది కాదనేది చాలామంది పెద్దల అభిప్రాయం. మార్చి 23 వరకూ దేశంలో జరిగిన పరిణామాలను చూస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన తర్వాతే చర్యలు వేగవంతమయ్యాయని అర్థమవుతోంది.


ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేయడం ఎన్ని నష్టాలకు దారితీస్తుందో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా అన్ని నష్టాలకూ దారితీస్తుంది. నాలుగేళ్ల క్రితం మన దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆకస్మికంగా జరపడంతో ప్రజల జీవితాల్లో కల్లోలం రేగిన తర్వాత అనేక చర్యల్ని తీసుకోవాల్సి వచ్చింది. అదే విధంగా జీఎస్టీ అమలు కూడా ఎన్నో సమస్యలకు దారితీసింది. పౌరసత్వ చట్టం చేయాలని అనుకున్నప్పుడు కూడా తర్వాత అది సామాజిక ప్రకంపనలకు, చివరకు మత కల్లోలాలకు  దారితీస్తుందని ప్రభుత్వం ఊహించలేదు. కొద్ది రోజుల క్రితం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు కూడా ప్రభుత్వం దాని వల్ల వచ్చే సమస్యలని అంచనా వేసినట్లు కనపడలేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మధ్యతరగతి, సంపన్నులను దృష్టిలోనే పెట్టుకుని తీసుకుంటుంది కాని, సామాన్యులు, పేదలను, అసంఘటిత వర్గాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోదని పాలకులు చేసే ప్రకటనలను బట్టి, ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగాలను బట్టి అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలోని ప్రజలు గ్రామాలకు వలస వెళతారని, బస్టాండులు కిక్కిరిసిపోయి తొక్కిసలాటలు జరుగుతాయని, మైళ్లకు మైళ్లు రహదారులు, రైలు పట్టాల మీద నడిచి వెళతారని, ఆకలితో అలమటిస్తారని ప్రభుత్వం అంచనా వేసినట్లు కనపడలేదు. రెండు మూడు రోజుల తర్వాత, పత్రికల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దృశ్యాలు ప్రచారమైన తర్వాత కాని ప్రభుత్వంలో కదలిక కనపడలేదు. పేదల గురించి మేమెందుకు ఆలోచించడం లేదు? 36 గంటలే కదా అయింది.. అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీని ప్రకటిస్తూ అన్నారు. ఆమె నోట అత్యంత అరుదైన ‘గరీబ్‌’ అన్న పదం వినపడడం సంతోషకరమే కాని లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఎవరూ ఎక్కడకూ వెళ్లనవసరం లేదని, వారందరికీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలోనూ, ఇతర భవనాల్లోనూ, రోడ్డు ప్రక్కన క్యాంపుల్లోనూ ఆశ్రయం కలిపిస్తామని ఎందుకు స్పష్టం చేయ లేదు? పరిస్థితి తీవ్రమైన తర్వాతే కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాష్ట్రాలకు లేఖ రాయాల్సి వచ్చింది.


లాక్‌డౌన్ ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత బస్సులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. విచిత్రమేమంటే ఈ పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అక్టోబర్‌లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి వేలాదిమంది బిహార్‌కు చెందిన అభాగ్యులు తమ గ్రామాలకు పరుగులెత్తడం బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. అంతేకాదు, గ్రామాలకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లడం వల్ల కరోనావైరస్ గ్రామాలకు పాకే ప్రమాదం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.


మన ప్రభుత్వాలు సమస్యలు వస్తే కాని కార్యాచరణలోకి దూకవని మన ప్రాథమిక ఆరోగ్య సంక్షేమ రంగాన్ని చూస్తేనే అర్థమవుతుంది. రాజ్యాంగం లోని 21వ అధికరణ ప్రకారం ప్రజలకు జీవించే హక్కును ప్రసాదించాలని చెప్పినప్పటికీ, ఈ అధికరణ ప్రకారం, ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పూచీ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు కూడా పలు సార్లు స్పష్టం చేసినప్పటికీ, 90 శాతం ప్రజల ఆరోగ్య అవసరాలను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ద్వారా తీర్చాలని ప్రపంచ బ్యాంకు చెప్పినప్పటికీ  మన  ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. జీడీపీలో కేవలం ఒక శాతం మాత్రమే కేటాయిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజల ప్రాణాల్ని వదిలేశాయి. గత బడ్జెట్‌లో కూడా కేంద్రం ఆరోగ్య రంగానికి పెద్దగా కేటాయింపుల్ని పెంచలేదు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు కూడా నిధులు తగ్గించారు. ప్రాథమిక ఆరోగ్యానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసును కూడా కేంద్రం పట్టించుకోలేదు. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  46 శాతం డాక్టర్లు, 82శాతం నిపుణుల కొరత ఉన్నదని ఒక అంచనాలో తేలింది. రెండేళ్ల క్రితం ఆరోగ్య, కుటుంబసంక్షేమంపై పార్లమెంటు స్థాయీ సంఘం నివేదిక ఆరోగ్య పరిశోధనావసరాలకూ, కేటాయింపులకూ పొంతన లేదని తేల్చింది. కొత్త ప్రయోగశాలలకు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు, ఆరోగ్య పరిశోధనా సదుపాయాల పెంపునకు సరిపోయే నిధులే లేవు. దేశంలో ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే ఒక్క గదిలోనూ, గుడిసెల్లోనూ, చాలీచాలని వసతుల్లోనూ, ఆఖరుకు విద్యుత్‌ కూడా లేని స్థితిలో నడుస్తున్నాయి. చాలా రాష్ట్రాలు నిధులు లేకపోవడం వల్ల వీటిని సమర్థంగా ఉపయోగించుకోవడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సమర్థంగా పనిచేయించడం,  ప్రతి జిల్లాలోనూ  మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పర్చి డాక్టర్లు, అంటురోగ వ్యాధుల నిపుణులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మన ఆరోగ్య రంగం ఎంత లోపభూయిష్టమో స్పష్టమవుతోంది. ఈ వైరస్ ప్రమాదం తొలిగిన తర్వాతనైనా ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వం సమగ్ర దృష్టిని సారించాలి.


విచిత్రమేమంటే మన ప్రధానమంత్రి మోదీ ఉపన్యాస కళలో మహా ఉద్దండుడు. లక్షలాది మంది పళ్లాలు, గంటలు మోగించేలా చేయడమే కాదు, ఉన్నట్లుండి తనను క్షమించమని ప్రజలను వేడుకుని ఉపన్యాసాన్ని రక్తి కట్టించగలరు. ఇవాళ లాక్‌డౌన్ వల్ల నిత్య జీవితంలో రాజ్యం విశ్వరూపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రజలు స్వచ్ఛందంగానే తాత్కాలికంగా తమ జీవితాల్లో రాజ్యంపెట్టిన ఆంక్షలను ఆహ్వానిస్తున్నారు కాని బలంవంతంగా కాదని గ్రహించాలి. చివరకు ప్రజలను మెప్పించాలంటే ప్రజల ఆరోగ్య, ఆర్థిక అవసరాలను తీర్చడం ద్వారానే జరగాలి కాని తమ ఉనికిని ఏదో రూపంలో ప్రదర్శించుకోవడం ద్వారా జరగదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-04-01T05:56:32+05:30 IST