నిజా నిజాలు బయటకొస్తాయి: అదాశర్మ

ABN , First Publish Date - 2020-09-06T05:30:00+05:30 IST

‘హార్ట్‌ఎటాక్‌’ సినిమాలో హయాతీగా కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన హీరోయిన్‌ అదాశర్మ.

నిజా నిజాలు బయటకొస్తాయి: అదాశర్మ

‘హార్ట్‌ఎటాక్‌’ సినిమాలో హయాతీగా కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన హీరోయిన్‌ అదాశర్మ. కళ్లల్లో అమాయకత్వం, మాటల్లో చురుకుదనం ఉన్న ఆమె-  ‘క్షణం’ సినిమాతో గ్లామర్‌తో మాత్రమే కాకుండా నటనతోను మెప్పించగలనని నిరూపించారు. ప్రస్తుతం అనేక భాషల్లో నటిస్తున్న అదాశర్మ కొవిడ్‌ సమయంలో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు. 


ఎప్పుడూ నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటా. తిండి విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటా. మాంసాహారం తినను. శాకాహారమే తింటా. నా ఉద్దేశంలో మాంసాహారం తింటే చర్మం నునుపుగా ఉండదు.


కొవిడ్‌ అందరికీ అనేక పాఠాలు నేర్పింది. నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నా. పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్‌ సిబ్బంది- ఇలా అనేక మంది కొవిడ్‌ను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే వారికి సెల్యూట్‌ చేయాలనిపించింది. మన కోసం వారు చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం. 


అమ్మకు సాయం.. 

షూటింగ్‌లు లేవు కాబట్టి.. కాస్తంత విశ్రాంతి దొరికింది. వంట చేయటం, ఇల్లు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం.. ఇలా నా పనులన్నీ నేనే చేసుకున్నా. బయటకు వెళ్లే పని లేదు కాబట్టి ఎక్కువ సమయం వర్క్‌అవుట్స్‌తోనే గడిపేదాన్ని. సాయంత్రం మాత్రం పియానో మీద ప్రాక్టీస్‌ చేసేదాన్ని. 


గ్లామర్‌ రహస్యమిదే..

శారీరకంగా, మానసికంగా మనపై ఉండే ఒత్తిడి మన ఆరోగ్యంపై పడుతుంది. అందుకే ఎప్పుడూ నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటా. తిండి విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటా. మాంసాహారం తినను. శాకాహారమే తింటా. నా ఉద్దేశంలో మాంసాహారం తింటే చర్మం నునుపుగా ఉండదు. 


వందేళ్ల అదాశర్మ...

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ‘1920’తో నటిగా నా కెరీర్‌ మొదలైంది. ఇటీవల ఒక కొత్త సినిమా ప్రారంభమయింది. నేను నిజంగా 1920లలో పుట్టి ఉంటే ఎలాంటి మేకప్‌ వేసుకొనేదాన్ని? అనే చిలిపి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి.. ఒక వీడియో తీసి.. ‘వందేళ్ల అదాశర్మ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశా. అది బాగా వైరల్‌ అయింది. లాక్‌డౌన్‌లో ఖాళీ సమయంలో నేను చేసిన పనుల్లో ఇదొకటి. 


ప్రస్తుతం..

హిందీలో ‘కమాండో 4’, ‘మ్యాన్‌ టు మ్యాన్‌’, తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఓ సినిమా సెట్స్‌ మీదున్నాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రెండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. నటులందరూ ఎప్పుడోఒకప్పుడు వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటించాల్సిందే! అందుకే  హిందీలో ‘ఎంఓహెచ్‌’, ‘ద హాలీడే’ అని రెండు వెబ్‌ సిరీస్‌లు చేశా. మంచి కథలొస్తే వెబ్‌ సిరీస్‌లను వదలుకోను. 


జాగ్రత్తలు తప్పనిసరి...

‘క్వశ్చన్‌ మార్క్‌’ సినిమా కోసం నెలరోజులుగా ఒక అడవిలో షూటింగ్‌ చేస్తున్నాం. కొవిడ్‌ వల్ల అనేక నిబంధనలు అమలు చేస్తున్నారు. షూటింగ్‌కు ఎక్కువ మందిని అనుమతించటం లేదు. పార్టీ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఉన్నప్పుడు మాత్రం మాస్క్‌, శానిటైజర్‌, పీపీఈ కిట్లు వాడుతున్నాం. భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తున్నాం. 


నో కామెంట్‌...

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేస్‌ సీబీఐ చేతిలో ఉంది. వారి దర్యాప్తులో నిజానిజాలు బయటకొస్తాయని  నమ్ముతున్నా. అయితే ఏం జరుగుతుందో తెలియకుండా.. అవగాహన లేకుండా ఇలాంటి కేసు విషయాల్లో ఎవరూ మాట్లాడకూడదు. కామెంట్లు అసలు చేయకూడదు. ఏం జరుగుతుందో వేచిచూద్దాం. 


ఆలపాటి మధు

Updated Date - 2020-09-06T05:30:00+05:30 IST