పాఠ్యాంశంగా కొప్పరపు కవుల సాహిత్యం

ABN , First Publish Date - 2021-07-25T14:12:11+05:30 IST

గంటలో వేగంగా కనీసం యాభై పద్యాలు చెప్పగలిగి తెలుగులో పద్యసాహిత్యాన్ని, అవధాన ప్రక్రియ ను ప్రభావితం చేసిన కొప్పరపు కవుల సాహిత్యాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలని పలువురు వక్తలు కో

పాఠ్యాంశంగా కొప్పరపు కవుల సాహిత్యం

- భాషా సేవాపురస్కార ప్రదాన అంతర్జాల సదస్సులో వక్తల అభిలాష

- ’గిడుగు’ పేరిట ఇక నెల నెలా అవార్డు


చెన్నై: గంటలో వేగంగా కనీసం యాభై పద్యాలు చెప్పగలిగి తెలుగులో పద్యసాహిత్యాన్ని, అవధాన ప్రక్రియ ను ప్రభావితం చేసిన కొప్పరపు కవుల సాహిత్యాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలని పలువురు వక్తలు కోరారు. వారి పేరుతో ప్రముఖ పాత్రికే యుడు కవి మాశర్మ నిర్వహిస్తున్న కొప్పరపు కవుల కళాపీఠం ఇరవై ఏళ్లుగా తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి అనన్య సేవలు అందిస్తోందని వారు కొనియాడారు. నవసాహితీ ఇంటర్నేషనల్‌ నెలకొల్పిన ఉత్తమ భాష సేవా పురాస్కారాన్ని కొప్పరపు కవుల కళాపీఠానికి శనివారం ప్రముఖ కవి, భాషావేత్త పాత్రికేయుడు ఏల్చూరి మూరళీధరరావు అంతర్జాలంలో మాశర్మకు అందజేశారు. తమిళనాడులో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరొందిన కె.సుబ్రమణ్యం ఆచారి సంస్మరణగా ఈ అవార్డును ఆయన సతీమణి విద్వాన్‌ విశ్వం కుమార్తె కాదంబరి అందజేశా రు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆచార్య సీఎంకే రెడ్డి  మాట్లాడుతూ నవసాహితీ దాశరథి గురజాడ, అద్దేపల్లి రామ మోహనరావు, గోరా శాస్త్రి పేరుతో అవార్డుకు ఇచ్చి, చర్చలు నిర్వహించడం మంచి ప్రయత్నమన్నారు. నవసాహితీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు గురుపూర్ణిమ సందర్భంగా సుబ్రమణ్యం వంటి ఉత్తమ అధ్యాపకునికి ఇలా నివాళులర్పించడం సముచితమని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్‌ పాత్రికేయుడు ఎస్‌వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి నెలా గిడుగు రామమూర్తి పేరుతో ఉత్తమ భాష సేవా పురస్కారాన్ని ఒక సాహిత్య సంస్థకు ఇవ్వడం జరుగుతుందని, ఆ విధంగా అన్ని సాహితీ సంస్థలను ఒకే తాటిమీదకు తీసుకురావడమే తమ ధ్యేయమని చెప్పారు. ప్రముఖ కవి డాక్టర్‌ కె.నరసింహారెడ్డి నెల్లూరు నుంచి ఆత్మీయ వచనాలు అందించారు. కన్వీనర్‌ ఝాన్సీ ముంబై నుంచి, ప్రముఖ నాట్యశాస్త్ర కళాకారిణి గజల్‌ రచయిత్రి డాక్టర్‌ సి.ఉదయశ్రీ చెన్నై నుంచి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Updated Date - 2021-07-25T14:12:11+05:30 IST