గోడలకు పాఠాలు!

ABN , First Publish Date - 2021-06-17T08:29:51+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా 1,192 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. కానీ వాటిలో 1,657మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

గోడలకు పాఠాలు!

  • బడులు మూతపడినా టీచర్లు యథాతథం!
  • టీచర్ల హేతుబద్ధీకరణ, స్కూళ్ల విలీనంపై
  • నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం
  • 1,192 పాఠశాలల్లో విద్యార్థులే లేరు
  • వాటిలో 1,657మంది ఉపాధ్యాయులు
  • కొన్ని చోట్ల స్టూడెంట్స్‌ కంటే ఎక్కువ మంది
  • నామమాత్రంగానే తాత్కాలిక సర్దుబాట్లు
  • ఏటా రూ.500 కోట్ల ప్రజా ధనం వృథా
  • 21 నుంచి ప్రారంభం కానున్న స్కూళ్లు
  • 2 నెలల్లో ప్రత్యక్ష బోధన జరిగే అవకాశం
  • అప్పటికైనా సర్దుబాటు చేస్తేఉపయోగం


హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా 1,192 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. కానీ వాటిలో 1,657మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 1,175 ప్రాథమిక పాఠశాలల్లో 1,570 మంది, 7 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14 మంది, 10 ఉన్నత పాఠశాలల్లో 73 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కొన్ని చోట్ల తాత్కాలిక సర్దుబాటుతో సమీపంలోని స్కూళ్లకు డిప్యుటేషన్‌పై పంపించామని అధికారులు చెబుతున్నప్పటికీ, చాలా చోట్ల అలాగే కొనసాగుతున్నారు. ఫలితంగా అత్యంత నైపుణ్యం, ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలలు ఉండగా.. వీటిలో 1.10లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 


స్కూళ్ల నిర్వహణ కోసమే ప్రభుత్వం ఏటా రూ.11వేల కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ఇందులో ఉపాధ్యాయుల జీతభత్యాలకే సింహభాగం ఖర్చవుతోంది. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్న సర్కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి అనుగుణంగా మార్పులు తేవడంలో విఫలమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 3 కి.మీ. పరిధిలో ఒక ప్రాథమిక, ప్రతి 5 కి.మీ. పరిధిలో ఒక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయగా.. కాలక్రమేణా అవి ఆదరణ కోల్పోయాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి వాటిని స్థానికంగా ఉన్న ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలన్న విద్యాశాఖ ప్రతిపాదనపై కొన్నేళ్లుగా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ అంశంపై 2011లో ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నా.. పలు కారణాలతో అది అమలు కాకుండా వాయిదా పడుతోంది. కొన్నాళ్ల క్రితం విద్యాశాఖ కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి ఉన్నప్పుడు ఈ విషయంపై దృష్టి సారించారు. ఆయన్ను బదిలీ చేయడంతో ఈ ప్రతిపాదన మళ్లీ మూలనపడింది. 


నైపుణ్యం.. నిరుపయోగం 

ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల నైపుణ్యం, ఉన్నత విద్యార్హతల విషయంపై ఎవరికీ అనుమానం లేదు. అయితే, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వారి సేవలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది. ఒక్క విద్యార్థి కూడా లేని 1,175 ప్రాథమిక పాఠశాలల్లో 1570 టీచర్లు ఉండగా, 1-10మంది లోపు విద్యార్థులున్న బడుల్లో 2053 మంది, 11-20 మంది విద్యార్థులున్న బడుల్లో 5782 మంది, 21-30మంది విద్యార్థులున్న బడుల్లో 6273 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలల్లోనైతే విద్యార్థులకంటే ఉపాధ్యాయుల సంఖ్యే ఎక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట సిబ్బంది సరిపోక అదనంగా విద్యా వలంటీర్లను ప్రభుత్వం నియమిస్తోంది. 


ఈ పరిస్థితి మారాలంటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణే ఏకైక మార్గం. ఈ ప్రతిపాదననూ కొన్నేళ్లుగా ప్రభుత్వం పక్కనబెట్టడంతో టీచర్ల సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతోంది. పాఠశాలల విలీనం, టీచర్ల హేతుబద్ధీకరణ జరగకపోవడంతో ఏటా రూ.500 కోట్లు వృథా అవుతున్నాయని అంచనా. మరోవైపు, ఈ నెల 21న పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. మరో రెండు నెలల్లో ప్రత్యక్ష బోధన సైతం ప్రారంభం కానుంది. అప్పటికైనా టీచర్ల హేతుబద్ధీకరణ, స్కూళ్ల విలీనాన్ని పూర్తి చేస్తే తరగతులు సజావుగా సాగే అవకాశం ఉంటుందని టీచర్ల సంఘాల నాయకులు చెబుతున్నారు.


విలీనమే ఏకైక ప్రత్యామ్నాయం

కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. కొన్ని చోట్ల సరిపడా టీచర్లు లేరు. దీనికి పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణే ఏకైక పరిష్కారం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేసి, మౌలిక వసతులు కల్పించాలి. ఈ ఏడాది పాఠశాలల అభివృద్ధికి రూ.2వేల కోట్లు ప్రకటించిన నేపథ్యంలో విలీనం తర్వాత వసతుల కల్పనకు ఖర్చు చేయాలి.

- ఆర్‌.చంద్రప్రకాశ్‌, అధ్యక్షుడు, తెలంగాణ గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం


పాడు‘బడి’ పోతున్నాయ్‌..!! 

కరోనా దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు కళ తప్పాయి. నెలల తరబడి తెరుచుకోకపోవడంతో ఏడాదిన్నరగా నిర్వహణ కరువై ‘పాడు’బడి పోతున్నాయి. ఈ ఫొటోలో శ్లాబ్‌ పెచ్చులూడి పోయి, గోడలు పగుళ్లు బారి కనిపిస్తున్నది ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం కుంటగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంజీగూడ ప్రాథమిక పాఠశాల. కరోనా కారణంగా ఇది మూతబడడంతో స్థానికులు ఇలా ఎడ్లబండిని పెట్టుకుంటున్నారు. 

                                                                                    - ఆదిలాబాద్‌, ఆంధ్రజ్యోతి 

Updated Date - 2021-06-17T08:29:51+05:30 IST