గణపతి నేర్పిన పాఠం!

ABN , First Publish Date - 2020-08-21T05:30:00+05:30 IST

ఒక పిల్లవాడికి విద్యారంభం చేయాలంటే, మొదట స్తుతించేది గణపతినే! ఎందుకంటే ఆయన

గణపతి నేర్పిన పాఠం!

ఒక పిల్లవాడికి విద్యారంభం చేయాలంటే, మొదట స్తుతించేది గణపతినే! ఎందుకంటే ఆయన తేజోవంతుడైన గొప్ప పండితుడు. సకల విద్యాప్రదాత. అంతేకాదు, గణేశుడు భోజన ప్రియుడు. మరి ‘గణపతి బొజ్జ, కుబేరుడి ఖజానా...’ ఈ రెంటిలో ఏది గొప్ప? సద్గురు జగ్గీవాసుదేవ్‌ చెబుతున్న ఈ కథ చదివితే తెలుస్తుంది.


యక్షుల రాజు కుబేరుడు. ఇప్పటికీ ఎవరినైనా గొప్ప ధనవంతుడు అని చెప్పాలంటే ‘కుబేరుడు’ అంటారు. కుబేరుడికి శారీరకమైన వైకల్యం ఉన్నప్పటికీ, ఒంటినిండా కిలోల కొద్దీ బంగారు, వజ్రాల నగలు ధరించి, ఆ వైకల్యాన్ని కప్పేసేవాడు. తన మాదిరిగా శివుణ్ణి కూడా అలంకరించాలనుకొనేవాడు. ప్రతీ రోజూ కొత్త నగతో శివుడి దగ్గరకు వచ్చి ‘‘మీరిది వేసుకోవాల్సిందే!’’ అని కోరేవాడు.  

‘‘నేను ధరించేది ఒకటే... బూడిద. నాకెలాంటి నగలూ అవసరం లేదు’’ అనేవాడు శివుడు. 

కానీ కుబేరుడు తేలిగ్గా పట్టు వదిలే స్వభావం ఉన్నవాడు కాదు. నగలు వేసుకోమని శివుణ్ణి పదేపదే సతాయించేవాడు. 

ఒక రోజు శివుడు ‘‘ఎవరో ఒకరిని ఆదరించాలని నువ్వు అంతగా అనుకుంటే నా కుమారుణ్ణి ఆదరించు’’ అని, కొంచెంగా పుష్టిగా ఉన్నగణపతిని చూపించి ‘‘ఇదిగో, ఇతడే నా కుమారుడు. ఇతడు ఆహారప్రియుడు. మీ ఇంటికి తీసుకెళ్ళి ఇతను తృప్తి చెందేంత వరకూ భోజనం పెట్టు’’ అన్నాడు. 

ఆహారం ప్రస్తావన వినిపించగానే గణపతి లేచి ‘‘ఆహారమా? ఎక్కడ? ఎప్పుడు?’’ అని అడిగాడు.

గణపతిని కుబేరుడు తన ఇంటికి ఆహ్వానించాడు. వినాయకుడు వెళ్ళాడు. కుబేరుడు తన సంపద, తన రాజ భవన వైభవం పట్ల మితిమీరిన గర్వంతో ఉండేవాడు. గణపతి తన బురద కాళ్ళతో మెరిసే పాలరాతిపై నడుస్తూ కుబేరుడి భవనంలోకి వచ్చాడు. సేవకులు ఆ నేలను ఆయన వెనుకనే తుడుచుకుంటూ వెళ్ళారు.

‘ఎంతైనా శివుడి కుమారుడు కదా! పరవాలేదు’ అనుకున్నాడు కుబేరుడు.

గణపతి కూర్చున్నాక భోజనం వడ్డించారు, ఆయన తినడం మొదలుపెట్టాడు. వడ్డించేవాళ్ళు తెచ్చిన ఆహారమంతా అయిపొయింది. వంటవారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వండుతూనే ఉన్నారు.

అది చూసి కుబేరుడు ‘‘నీ వయసుకు నువ్వు తిన్న ఆహారం చాలా ఎక్కువ. అంత  తింటే ప్రమాదం కావచ్చు’’ అన్నాడు. 

‘‘ఏ ప్రమాదం లేదు. చూడండి, నాకు నాగుపాము వడ్డాణంగా ఉంది. నా గురించి దిగులుపడకండి, వడ్డించండి! నాకు తృప్తి కలిగేంతవరకు వడ్డిస్తానని మా తండ్రికి మాటిచ్చారు కదా!’’ అని బదులిచ్చాడు గణపతి.

కుబేరుడు మరిన్ని సరుకులు తెమ్మని మనుషుల్ని పురమాయించాడు. ఆ పరిసరాల్లో ఉన్న సరుకులేవీ సరిపోలేదు. 

కుబేరుడి సంపదంతా ఖర్చయిపోయింది. ప్రతీ వస్తువును అమ్మేసి, సరుకులు కొని, ఆహారాన్ని తయారు చేసి, గణపతికి వడ్డించారు. ఆయన ఇంకా తింటూనే ఉన్నాడు. పళ్ళెం ఖాళీ అయింది. 

భోజనానంతరం వడ్డించే తీపి పదార్థం కోసం ఎదురుచూస్తున్న గణేశుడు ‘‘పాయసమేదీ? లడ్డూ ఏదీ?’’ అని అడిగాడు. 

అప్పుడు కుబేరుడికి జ్ఞానోదయం అయింది. ‘‘తప్పయిపోయింది. గర్వంతో నేను నా సంపద గురించి గొప్పలు చెప్పాను. నా దగ్గర ఉన్నదంతా శివుడు ఇచ్చిందేనని నాకూ తెలుసు, శివుడికీ తెలుసు, అయినా బుద్ధిహీనుడినయ్యాను. మహా భక్తుడిలా నన్ను నేను భావించుకుంటూ శివుడికే నగలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని గణపతి కాళ్ళపై పడ్డాడు. క్షమాపణ అర్థించాడు.

గణపతి ఇక దేని కోసం అడగకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు.

ఆ రోజునే మనం గణేశ చతుర్థిగా జరుపుకొంటున్నాం. అద్భుతమైన విషయమేమిటంటే, ఎన్నో వేల ఏళ్ళుగా ఈ రోజు అలానే నిలిచి ఉంది. మన దైవాలందరిలో గణపతి అత్యంత ప్రజాదరణ కలిగిన దేవునిగా నిలిచాడు. 


Updated Date - 2020-08-21T05:30:00+05:30 IST