5వేల లోపే...!

ABN , First Publish Date - 2022-01-24T04:48:34+05:30 IST

కొవిడ్‌ పరీక్షలు పెంచాలన్న కలెక్టర్‌ ఆదేశాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నా 5వేల లోపే టెస్టులు చేస్తున్నారు.

5వేల లోపే...!

  1. కలెక్టర్‌ ఆదేశించినా పెరగని కొవిడ్‌ పరీక్షలు
  2. జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  3. ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న అనుమానితులు
  4. 26.36 శాతానికి పెరిగిన పాజిటివిటీ 
  5. నంద్యాల, ఆదోనిలో వైరాలజీ ల్యాబ్‌లు ఎప్పుడు?


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 23: కొవిడ్‌ పరీక్షలు పెంచాలన్న కలెక్టర్‌ ఆదేశాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నా 5వేల లోపే టెస్టులు చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో 7 నుంచి 8 వేల పరీక్షలు చేస్తుంటే.. జిల్లాలో మాత్రం 5 వేలకు మించడం లేదు. గత ఏడాది డిసెంబరు 31న జిల్లాలో కేసుల సంఖ్య 9.. ఉంటే పాజిటివిటీ రేటు 0.30 శాతం నమోదైంది. జనవరి 23న కేసుల సంఖ్య 1238.. కాగా పాజిటివిటీ రేటు 26.36 శాతానికి పెరిగింది. భారీ సంఖ్యలో బాధితులు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేయకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశించినా..

ఇటీవల జరిగిన కొవిడ్‌ నియంత్రణ సమీక్షలో కలెక్టర్‌ కోటేశ్వరరావు పరీక్షల సంఖ్యను రోజూ 5వేలకు పైగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 16 నుంచి కరోనా ఉధృతి పెరుగుతున్నా అధికారులు మాత్రం పరీక్షలను 5వేలలోపు చేయడం గమనార్హం. ఈ నెల 16న 2012, 17న 1352, 18వ తేదీన 2939 పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 22న 4079 పరీక్షలు చేశారు. కలెక్టర్‌ ఆదేశించినా నిర్ధారణ పరీక్షలు ఆశించినంతగా జరగడం లేదని తెలుస్తోంది. 

తీవ్రత ఉంటేనే టెస్టులు

కేంద్రం పరీక్షలు పెంచండని చెబుతుంటే జిల్లాలో మాత్రం సంఖ్యను తగ్గిస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలు, బాధితులకు సహాయ సహకారాలు, ఫీవర్‌ సర్వే వంటి ముందస్తు జాగ్రత్త చర్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి ఏఎనఎం, ఆశా, వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేసేవారు. కొవిడ్‌ నిర్ధారణ అయితే.. ఆ బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు గానీ, అతని కాంటాక్టు ఉన్న వారికి గానీ ఎలాంటి లక్షణాలు లేకుంటే టెస్టులు చేయాల్సిన అవసరం లేదని వెనక్కి పంపుతున్నారు. కాంటాక్టు అయిన వారిలో 60ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి మాత్రమే చేయాలని ఐసీఎంఆర్‌ నుంచి మార్గదర్శకాలు వచ్చాయంటూ అధికారులు చెబుతున్నారు. మరో పక్క బాధితులు తమకు లక్షణాలు ఉన్నాయని, పరీక్షలు చేయండని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నా వారిని వెనక్కు పంపుతున్నారు. 

వెయ్యి దాటేశాయి

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 23: మూడో వేవ్‌ ఉధృతితో జిల్లాలో వెయ్యి కేసులు దాటాయి. ఆదివారం రికార్డు స్థాయిలో 1,238 కేసులు నమోదయ్యాయి. 4,696 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించగా.. పాజిటివిటీ రేటు 23.17 నుంచి 26.36 శాతానికి పెరిగింది. ఈ నెలాఖరుకు కేసులు మరిన్ని పెరగవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొత్తవి కలుపుకుని జిల్లాలో కేసుల సంఖ్య 1,30,205కు చేరింది. యాక్టివ్‌ కేసులు 4,848 ఉన్నాయి.

కర్నూలులోనే అధికం

కర్నూలు నగరంలోనే అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో 7,513 శాంపిల్స్‌ సేకరించగా.. 2,523 మందికి వైరస్‌ సోకింది. పాజిటివిటీ శాతం 42.02గా నమోదైంది. ఆదివారం కర్నూలులో 800, బనగానపల్లెలో 67, నంద్యాల మున్సిపాలిటీలో 52, నందికొట్కూరు మున్సిపాలిటీలో 51, పత్తికొండలో 23, పగిడ్యాలలో 21, మిడ్తూరు 16, కర్నూలు రూరల్‌లో 18, ఓర్వకల్లులో 16, క్రిష్ణగిరిలో 16, వెల్దుర్తిలో 16, కోడుమూరులో 14, గడివేములలో 13, ఆత్మకూరు రూరల్‌ 12, ప్యాపిలిలో 11, సీ బెళగల్‌లో 11, శ్రీశైలంలో  9 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో 2248 శాంపిల్స్‌ సేకరించగా.. 914 కేసులు రాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2448 శాంపిల్స్‌లో 324 కేసులు వచ్చాయి. పట్టణాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది.

తేదీ టెస్టులు పాజిటివ్‌లు 

16 2012         168

17 1352         85

18 2939         259

19 3704     452

20 4391         884

21 4571         961

22 4076     969

23 4696         1238

Updated Date - 2022-01-24T04:48:34+05:30 IST