న్యూయార్క్ అప్పుడు కరోనాకు కేంద్రం.. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2020-06-28T05:45:20+05:30 IST

అమెరికా కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిపోయిన విషయం తెలిసిందే.

న్యూయార్క్ అప్పుడు కరోనాకు కేంద్రం.. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

న్యూయార్క్: అమెరికా కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచదేశాల్లోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 25,77,368 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 1,27,948 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విళయతాండవం చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఏప్రిల్, మే నెలల్లో న్యూయార్క్‌లో నెలకొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటేనే భయమేస్తుంది. ఆసుపత్రుల్లో బెడ్‌లు కూడా లేకపోవడంతో.. బయటే చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఆసుపత్రికి వచ్చిన నిమిషాల్లోనే అనేక మంది చనిపోయేవారు. మరణించిన వారిని పూడ్చడానికి శ్మశానాలు కూడా సరిపోలేదంటే న్యూయార్క్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా గతం.. ఇప్పుడు న్యూయార్క్ రాష్ట్రం కరోనాను నియంత్రించగలిగింది. కరోనాకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం నుంచి అతితక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా న్యూయార్క్ మారింది. 


ఇప్పుడు న్యూయార్క్‌లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో ఒక శాతం.. అంతకంటే తక్కువ మంది మాత్రమే కరోనా బారిన పడుతున్నారు. శుక్రవారం తమ ప్రభుత్వం 73 వేల పరీక్షలు నిర్వహిస్తే కేవలం 0.96 శాతం మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలినట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. అంతకుముందు రోజు కరోనా పాజిటివ్ రేట్ 1.4 శాతంగా ఉండగా.. శుక్రవారం ఇది మరింత తక్కువగా నమోదు కావడం విశేషం. కొత్తగా నమోదైన కేసులతో న్యూయార్క్‌లో ఇప్పటివరకు మొత్తంగా 3,91,923 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పాజిటివ్ రేట్ ప్రకారం న్యూయార్క్‌లో కేసులు తగ్గుముఖం పట్టాయని, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆండ్రూ క్యూమో అన్నారు. ఇది మంచి వార్త అయినప్పటికి.. ప్రజలు మాత్రం కరోనా నుంచి అప్రమత్తంగానే ఉండాలన్నారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాతో పోరాటం చేయాలన్నారు. ఫేస్ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి కరోనాను జయించాలని పేర్కొన్నారు. మరోపక్క న్యూయార్క్‌లో ఆంక్షలను కూడా విడతల వారీగా ఎత్తివేస్తున్నారు.

Updated Date - 2020-06-28T05:45:20+05:30 IST