చిరుత కలకలం

ABN , First Publish Date - 2022-01-18T04:45:23+05:30 IST

మండల పరిధిలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది.

చిరుత కలకలం
సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న ఏసీపీ, సీఐ

  • దాడిలో ఆవుదూడ మృతి.. మరో దూడకు తీవ్ర గాయం  
  • భయాందోళనలో పిల్లిపల్లి గ్రామస్తులు


యాచారం : మండల పరిధిలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది. ఈనెల 8న రాత్రి నానక్‌నగర్‌లో మేకను చంపి తిన్న విషయం మర వక ముందే పిల్లిపల్లి గ్రామంలో మరో జీవాన్ని చంపి తిన్నది. మండలకేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆదివారం సాయంత్రం తన పొలం వద్ద ఉన్న దొడ్డి ముందు ఆవుదూడను కట్టేసి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అర్ధరాత్రి సమయంలో చిరుతపులి వచ్చి ఓ ఆవుదూడను చంపి సగం తిని, మరో దూడను దవడ భాగంలో కొరికి గాయపరిచింది. సోమవారం ఉదయం రైతు దొడ్డి వద్దకు వచ్చి జరిగిన దారుణాన్ని చూసి గ్రామస్తులకు తెలియజేశాడు. సమాచారమందుకున్న అటవీశాఖ రేంజర్‌ నిఖిల్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జీవాలపై చిరుత దాడి చేసినట్లు గుర్తించామని, దాన్ని బంధించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారి చెప్పారు. సంఘటనా ప్రదేశాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, యాచారం సీఐ లింగయ్య సందర్శించారు. సాయంత్రం వేళ ఒంటరిగా ఎవరూ బయటకు  రావొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో చిరుత దాడి విషయం తెలుసుకున్న పిల్లిపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 



Updated Date - 2022-01-18T04:45:23+05:30 IST