లెక్కలేని తనం

ABN , First Publish Date - 2021-01-25T03:31:45+05:30 IST

అద్దె దుకాణాల విషయంలో అడ్డగోలు వ్యవహారం నడుస్తోంది.

లెక్కలేని తనం
గడియారం చౌరస్తాలోని మునిసిపల్‌ అద్దె దుకాణాలు

అద్దె దుకాణాల లెక్కలు తీయడంలో మీనమేషాలు

రెండు నెలలైనా కొలిక్కిరాని వ్యవహారం

మరో 20 రోజులు పడుతుందంటున్న సిబ్బంది

అడ్డగోలు కేటాయింపులు.. అద్దె వసూలు లేదు

రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

మహబూబ్‌నగర్‌, జనవరి 24: అద్దె దుకాణాల విషయంలో అడ్డగోలు వ్యవహారం నడుస్తోంది. ఇష్టారాజ్యంగా దుకాణాలు కేటాయించడం. దక్కించుకున్న దుకాణాలను బినామీలకు కట్టబెట్టి అదనంగా అద్దె వసూలు చేసు కుంటున్నా మునిసిపాలిటీకి రావలసిన అసలె అద్దె కూడా వసూలుకాని దుస్థితి నెలకొంది. దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో డిసెంబరు 6న కథనం రావడంతో అడిషినల్‌ కలెక్టర్‌ సీరియస్‌గా స్పందిస్తూ వెంటనే అద్దె దుకాణాల లెక్కలు తేల్చి వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌ చేయడంతోపాటు బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడం తప్పా లెక్కలు తేల్చడం లేదు. సంబంధిత సిబ్బంది మాత్రం మరో 15-20 రోజుల సమయం సడుతుందంటూ జారుకునే ప్రయత్నం చేస్తున్నా రు. పాలమూరు పురపాలికలో 287 అద్దె దుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి దాదాపు రూ.10 కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు రావలసి ఉంది. అసలు ఏ దుకాణానికి ఎంత అద్దె ఉన్నదో వంటి వివరాలు కూడా బల్దియా లెక్కల పుస్తకంలో వివరాలు లేకపోవడం గమనార్హం. నెలకు పురపాలికకు రూ. 20 నుంచి రూ.25 లక్షల ఆదాయం సమకూర్చే అద్దె దుకాణాల విషయంలో స్పష్టత లేకపోవడం విచారకరం. 

ఆన్‌లైన్‌ చేయకుండానే..

మునిసిపల్‌ దుకాణాలు అంటే ఎప్పుడు? ఎంత అద్దెకు లీజుకు ఇచ్చారో వంటి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. రికార్డులలోనైనా ఈ వివరాలు ఉండాలి. అధికారులు మారితే వారితోపాటు వివరాలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్తితి ఉంది. ఏ దకాణం అద్దె ఎప్పటివరకు అద్దె చెల్లించారు.. ఎంత అద్దె పెండింగ్‌ ఉంది వంటి వివరాలు లేకపోవడంతో అధికారులు లెక్కలు తీసేందుకు తలలు పట్టుకుంటున్నారు. రికార్డులో ఒక లెక్క ఉంటే క్షేత్రస్థాయిలో దుకాణుదారుల వద్ద మరో లెక్క ఉంది. ఈ వివరాలన్నీ సేకరించేందుకు అధి కారులు అవసోపాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పలు దుకాణాలు బినామీల చేతుల్లో ఉన్నాయి. అద్దెకు తీసుకుని ఇతరులకు ఎక్కువ ధరకు సబ్‌ లీజు ఇచ్చుకున్న దుకాణాలు కూడా ఉన్నాయి. బినామీ దుకాణాల వివరాలు తీయాలన్నా సిబ్బందికి కష్ట సాధ్యంగానే ఉంది. అందుకే దుకాణాల లెక్కలు తేల్చే ప్రక్రియ నత్తనడకన సాగుతుందన్న విమర్శలున్నాయి. ఇది వరకు పనిచేసిన అధికారులు, సిబ్బంది ఎవరికి వారు తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా వ్యవహరించడంతో అద్దె దుకాణాల అసలు వివరాలు అంతుచిక్కడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తే తప్పా వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదు. లెక్కలు పక్కాగా తేల్చి ఆన్‌లైన్‌ చేయాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-01-25T03:31:45+05:30 IST