ఓ బాలూ.. లాలీ!

ABN , First Publish Date - 2020-09-27T08:55:24+05:30 IST

పాటకు ప్రాణమై, పాటే ప్రాణమై ఐదు దశాబ్దాలకుపైగా సంగీత ప్రయాణం చేసిన మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శాశ్వతంగా దివికేగారు. అభిమానుల అశ్రునయనాల నడుమ అధికారిక లాంఛనాలతో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి...

ఓ బాలూ.. లాలీ!

  • గంధర్వ సీమకు గాన గంధర్వుడు.. 
  • అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
  • శైవ సంప్రదాయ పద్ధతిలో ఖననం
  • ఉత్తర క్రియలు నిర్వహించిన చరణ్‌
  • అధికారిక లాంఛనాలతో వీడ్కోలు
  • సాయుధ పోలీసుల గన్‌ సెల్యూట్‌
  • ఏపీ తరఫున మంత్రి అనిల్‌ హాజరు
  • వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
  • కిటకిటలాడిన బాలు వ్యవసాయ క్షేత్రం 
  • మనో, దేవీశ్రీ, అర్జున్‌ తదితరులు హాజరు


చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పాటకు ప్రాణమై, పాటే ప్రాణమై ఐదు దశాబ్దాలకుపైగా సంగీత ప్రయాణం చేసిన మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శాశ్వతంగా దివికేగారు. అభిమానుల అశ్రునయనాల నడుమ అధికారిక లాంఛనాలతో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. చెన్నై  రెడ్‌హిల్స్‌కు 16 కిలోమీటర్ల దూరంలో తామరైపాక్కం వద్ద ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రంలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్ప త్రిలో కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని తొలుత చెన్నై నుంగంబాక్కం కామదార్‌ నగర్‌లోని ఆయన నివాస గృహానికి తరలించారు. రాత్రి 7.30 గంటల వరకూ అభిమానులు, ప్రజలు ఆయనను కడసారి దర్శించుకున్నారు. ఆ తర్వాత బాలు భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఫామ్‌హౌ్‌సకు తరలించారు.




ఎస్పీబీ అంత్యక్రియలలో పాల్గొనేందుకు శనివారం వేకువజాము నుంచే అభిమానులు, నగర ప్రముఖులు వ్యవసాయ క్షేత్రం వద్దకు తరలి రావడం మొదలైంది. బాలుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. జాతీయ రహదారి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు రాత్రికి రాత్రి ప్రత్యేకంగా రహదారిని నిర్మించారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8.45 నుంచి అభిమానులు, నగర ప్రముఖులు, స్థానిక ప్రజలను లోపలికి అనుమతించారు. 10.15 గంటల తర్వాత ఫామ్‌హౌ్‌సకు చేరువగా ఏర్పాటు చేసిన స్థలంలో బాలు అంత్యక్రియల ప్రక్రియ మొదలైంది. పురోహితుల మంత్రోచ్చాటనల నడుమ ఎస్పీ బాలు తనయుడు తండ్రి భౌతిక దేహాన్ని పవిత్ర జలాలతో పునీతం చేశారు. విభూతి ధారణ గావించి... పూలమాలలతో అలంకరించారు. తర్వాత మంత్రపుష్పంతో పుష్పార్చన జరిగింది. ఆపై తామర, చామంతిపుష్పాల మాల, బిల్వదళాల మాలతో భౌతిక కాయాన్ని చరణ్‌ అలంకరించారు. బాలు సతీమణి సావిత్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా భౌతిక కాయంపై పవిత్ర జలాలను చల్లారు. ఆ తర్వాత పాడెపై ఉంచిన భౌతిక కాయాన్ని మోసుకుంటూ ఖనన స్థలానికి బయల్దేరారు.




శైవ పద్ధతిలో..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలను శైవ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో చరణ్‌ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. బాలు భౌతికకాయంపై పవ్రిత జలాలను చల్లి పునీతం కావించారు. బాలు తండ్రి సాంబమూర్తి గురుపరంపరకు చెందినవారు. ఆయన వద్ద బాలసుబ్రహ్మణ్యం గురుదీక్షను పొందారు. అందువల్లే... అంత్యక్రియలను శైవ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిసింది.  సమాధి స్థలానికి తరలించడానికి ముందుగా భౌతిక కాయంపై శివలింగాన్ని ఉంచి రుద్రాభిషేకం కూడా జరిపారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని ఖననం చేసిన చోట ఆ శివలింగాన్ని ఉంచారు. బాలు శివైక్యం అయ్యారనడానికి సూచనగా... భవిష్యత్తులో ఆ శివలింగానికి కుటుంబీకులు సంప్రదాయబద్ధంగా రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు.




తరలి వచ్చిన సినీ ప్రముఖులు

బాలు అంత్యక్రియల్లో తమిళ సినీ నటులు విజయ్‌, అర్జున్‌, రహ్మాన్‌, సుధాకర్‌, మైల్‌సామి, దర్శకులు భారతీరాజా, అమీర్‌, సముద్రఖని, గాయకుడు మనో, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, నిర్మాత పిరమిడ్‌ నటరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. 




పోలీసు సాయుధ దళం నివాళి...

బాలు భౌతిక కాయానికి కుటుంబీకుల అంతిమ సంస్కారాలు పూర్తికాగానే... తమిళనాడు రాష్ట్ర పోలీసు సాయుధ దళం ఏఎస్పీ తిరువేంగడం నాయకత్వంలో ప్రత్యేక దుస్తులు ధరించిన 24 మంది సాయుధ పోలీసులు... పోలీస్‌ బ్యాండ్‌ నడుమ రెండు వరుసలుగా నడుచుకుంటూ ఖనన స్థలానికి వెళ్లారు. అక్కడ బాలు భౌతికకాయానికి కుమారుడు చరణ్‌ చివరి దశ పూజలను  నిర్వహించారు. చివరగా బాలు భౌతిక కాయాన్ని ఖననపు గోతిలో దించారు. ఆ సమయంలో... మూడు వరుసలుగా నిలిచిన 24 మంది పోలీసులు గాలిలో మూడు రౌండ్లపాటు కాల్పులు జరిపి బాలుకు ‘గన్‌ సెల్యూట్‌’ చేశారు.




ఏపీ తరఫున మంత్రి అనిల్‌ హాజరు

ఎస్పీ బాలు అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. బాలు భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్‌, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ మహేశ్వరి, ఎస్పీ అరవిందన్‌, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణసామి పాల్గొన్నారు. 



బాలును చూడాలని... దారి పొడవునా జన సందోహం

తమ అభిమాన గాయకుడు బాలు ఇక లేరని తెలిసి తల్లడిల్లిన ప్రజలు... ఆయన కడసారి చూపు కోసం పరితపించారు. కామదార్‌ నగర్‌లోని బాలు స్వగృహం నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. అద్దాల మండపంలాంటి ఏర్పాటు ఉన్న ప్రత్యేక వాహనంలో బాలు భౌతిక కాయాన్ని ఉంచారు. ఇంటి నుంచి ఫామ్‌హౌస్‌ వరకు దాదాపు 18 కిలోమీటర్లు ఉండగా... చెన్నై శివార్లు దాటేదాకా, ఆ తర్వాత పలు చోట్ల జనం రహదారులపై నిలుచుని తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించుకున్నారు. కరోనా భయాన్ని కూడా పట్టించుకోకుండా వందలాది మంది బైకులు, కార్లలో ఊరేగింపుగా ముందుకు సాగారు. కొన్నిచోట్ల అభిమానులు రోడ్డుకు అడ్డుగా నిలబడి, వాహనాన్ని ఆపి మరీ బాలుకు నివాళులర్పించారు. నిద్రిస్తున్నట్లుగా ఉన్న బాలు భౌతిక కాయాన్ని చూసి బోరున ఏడ్చారు. భౌతికకాయాన్ని దగ్గరగా చూడటానికి పిల్లలు పెద్దలు తేడా లేకుండా శకటంవైపునకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనం ముందుకు కదిలేలా పోలీసులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంతిమయాత్ర రాత్రి తొమ్మిది గంటలకు ఫామ్‌హౌస్‌ చేరింది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరి కింద బాలు భౌతిక కాయాన్ని ఉంచారు. ఇక... శనివారం బాలు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 150 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కానీ... చూస్తుండగానే వందలు, వేల మంది తరలి వచ్చారు. 



Updated Date - 2020-09-27T08:55:24+05:30 IST