రాజకీయ దురంధరుడు

ABN , First Publish Date - 2020-09-02T06:45:28+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2011లో అస్వస్థతకు గురై చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వెళుతూ, వెళుతూ తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను...

రాజకీయ దురంధరుడు

2008లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మన్మోహన్ వెంటనే ప్రణబ్ సారథ్యంలో మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సభ్యులు కార్పొరేట్ రంగానికి చేయూతనివ్వాలని, ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు కల్పించాలని రకరకాల సూచనలు చేశారు. అవన్నీ విన్న ప్రణబ్ చివరిగా స్పందిస్తూ ‘ఈ సమయంలో మనం ఆర్థిక నిర్ణయాలు కాదు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి..’ అని వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయాలే 2009లో యుపిఏ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యాయి.


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2011లో అస్వస్థతకు గురై చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వెళుతూ, వెళుతూ తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు నలుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్, రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తోపాటు ఆమె చిదంబరం, కపిల్‌ సిబల్పై ఎక్కువ ఆధారపడ్డారు. ప్రణబ్ ముఖర్జీకి మాత్రం అంత ప్రాధాన్యత నీయలేదు. లోక్‌పాల్ కోసం నిరాహార దీక్షకు పూనుకున్న అన్నా హజారే ఉదంతం ఒక సంక్షోభంగా ముదిరిన తర్వాతే కాంగ్రెస్‌కు ప్రణబ్ అవసరం తెలిసి వచ్చింది. హజారే దీక్ష ఉపసంహరణకు ముందు కాంగ్రెస్‌లో పలు అంతర్యుద్ధాలే జరిగాయి. ఏ సమస్యనైనా రాజకీయంగానే పరిష్కరించాలని భావించే ప్రణబ్ ముఖర్జీ, ఆయన బృందం తమకేమీ పట్టనట్లు ఊరుకోవడమే మంచిదని భావించింది. 2011 ఆగస్టు 16 నుంచి తాను దీక్ష ప్రారంభిస్తానని అన్నా ప్రకటించినా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. పైగా కపిల్ సిబల్, మనీష్ తివారీ, రషీద్ ఆల్వీ తదితరులు అన్నాపై విమర్శల వర్షం కురిపించారు. రోజురోజుకూ అన్నాకు పెరుగుతున్న ప్రజల మద్దతును సోనియా ఏర్పాటు చేసిన తాత్కాలిక సారథ్య బృందం ‍సభ్యులు గమనించ లేకపోయారు. అన్నా ఢిల్లీ చేరుకోకముందే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. దీక్ష ప్రారంభించకముందే అన్నా హజారేని అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచీ ప్రజల ఆగ్రహం, ప్రతిపక్షాల నిరసన తీవ్రమై పార్లమెంట్ కూడా సాగని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు రాహుల్ జోక్యంతో ప్రభుత్వం దిగి వచ్చి రాంలీలా మైదానంలో అన్నాహజారే దీక్షను నిర్వహించేందుకు అంగీకరించింది. కాని రోజురోజుకూ ప్రజాదరణ పొందుతున్న ఆ దీక్షను ఎలా ఉపసంహరింపచేయాలో ప్రభుత్వానికి పాలుపోలేదు. సంక్షోభ సమయంలో ద్వేషపూరిత ప్రకటనలు చేయడం తప్ప తామేమీ చేయలేమని చిదంబరం, జనార్దన్ ద్వివేదీ, ఏకె ఆంటోనీ నిరూపించుకున్నారు. అన్నా అవినీతిపరుడని మనీష్ తివారీ వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో కాంగ్రెస్‌లో కూడా అంతర్మధనం మొదలైంది. మొదట్లో అన్నాతో చర్చలకు అంగీకరించేది లేదని చెప్పిన మన్మోహన్ టీం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. మన్మోహన్ సింగ్ లేఖను కూడా అన్నా హజారే బుట్టదాఖలు చేశారు.


దీనితో సోనియా విదేశాల నుంచి ప్రణబ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రణబ్ సేవలను ఉపయోగించుకోవల్సిందిగా మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఆ తర్వాత ప్రణబ్ రంగంలోకి దిగారు. అన్నాను కలుసుకునేందుకు ఆయన సన్నిహితుడైన కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్‌ను పంపారు. రాలేగావ్ సిద్దీ లోని అన్నా మిత్రులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడించారు. పార్టీ నేతలతో అన్నాకు అనుకూలంగా సానుకూలంగా ప్రకటనలు ఇప్పించారు. అన్నా దీక్షను ఉపసంహరింపచేసుకోవాలని ప్రధాని, స్పీకర్ మీరాకుమార్‌తో కూడా అభ్యర్థన చేయించారు. రాహుల్ కూడా లోక్‌సభలో ప్రకటన చేశారు. లోక్‌పాల్‌పై పార్లమెంట్ స్థాయీ సంఘానికి నివేదిస్తామని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. దీనితో అన్నా దీక్ష ఉపసంహరించుకుని వెళ్లిపోయారు.


రాజకీయాల్లో పట్టు విడుపులు అవసరమని, ఎటువంటి తీవ్రమైన సమస్యనైనా సహనంతో పరిష్కరించేందుకు రాజనీతిజ్ఞత అవసరమని ప్రణబ్ ముఖర్జీ అనేక సార్లు నిరూపించుకున్నారు. అతి పిన్న వయస్సులో ప్రణబ్‌లో ఆ మేధోశక్తి గమనించిన ఇందిరాగాంధీ ఆయనను చేరదీసి ఆర్థిక మంత్రిత్వ శాఖతో సహా కీలక బాధ్యతలు అప్పగించారు. కాని ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో ఆయనకు అంత ప్రాధాన్యత లభించలేదు. స్వంత పార్టీ పెట్టి తెరమరుగైన సమయంలో మేనిఫెస్టో రూపకల్పనకు ప్రణబ్ సేవలు అవసరం అంటూ పీవీ నరసింహారావు రాజీవ్‌కు నచ్చచెప్పి మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చారు. తాను ప్రధాని అయిన తర్వాత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిన పీవీ పట్ల ప్రణబ్ కృతజ్ఞుడుగానే ఉన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో తన సీనియారిటీని గుర్తించి అప్పగించిన బాధ్యతలనన్నీ ప్రణబ్ సమర్థంగా నెరవేర్చారు. తనకు ప్రధాని పదవి రాలేదన్న బాధ మనసులో ఉన్నప్పటికీ యుపిఏ ఎదుర్కొన్న అనేక సమస్యల్ని ఆయన పరిష్కరించారు. 2004 నుంచి 2012 వరకు యుపిఏ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం వెనుకా ప్రణబ్ హస్తం ఉన్నది. పరిపాలనా సంస్కరణలు, సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆధార్ వంటి అనేక కీలక అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారు. దాదాపు 95 జీఎంలకు అయనే చైర్మన్‌గా వ్యవహరించారు. 2012లో ఆయన రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత మళ్లీ యుపిఏ కష్టాల్లో పడింది. మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక పరాజయం పాలైంది.


యుపిఏ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఇంటా బయటా ఏ రాజకీయ సంక్షోభం వచ్చినా ప్రణబ్‌కు తలదూర్చక తప్పేది కాదు. కాని రెండవ దఫా అధికారంలోకి వచ్చాక అంటీ ముట్టనట్లు వ్యవహరించడం ప్రారంభించారు. ప్రధాని పదవిపై కన్ను వేసిన హోంమంత్రి చిదంబరం ఆర్థిక శాఖలో బగ్గింగ్ పరికరాలు అమర్చారని తెలిసినప్పుడు ప్రణబ్ ఊరుకోలేదు. ఈ విషయంపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని ప్రణబ్ ప్రధానికి లేఖ రాయడంతో చిదంబరం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2జీ కుంభకోణం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖ లీక్ కావడంతో ఆ కుంభకోణంలో చిదంబరం పాత్ర రచ్చకెక్కింది. తర్వాత సోనియా అభ్యర్థనతో ప్రణబ్, చిదంబరం రాజీకి వచ్చినప్పటికీ ప్రణబ్‌తో పెట్టుకున్నందుకు చిదంబరం ఇప్పటికీ చిక్కుముళ్ల నుంచి బయటపడలేదని చెప్పవచ్చు. లోక్‌సభా నాయకుడిగా ప్రణబ్ ఒక వ్యూహకర్తగా వ్యవహరించారు. పార్టీ నేతల గౌరవాన్నే కాదు, ప్రతిపక్ష నేతల మర్యాద కూడా పొందారు. ప్రణబ్ కోపంతో తిట్టినా పడే పరిస్థితి కల్పించారు. ‘నన్ను బడ్జెట్ ప్రవేశపెట్టనివ్వండి. లేకపోతే రాజీనామా చేస్తాను..’ అని ఒక దశలో పెద్దాయన హెచ్చరించడంతో తెలంగాణ ఎంపీలు కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది.


నిజానికి ఇవాళ ప్రణబ్ ముఖర్జీ పట్ల అమితాదరణ చూపిస్తున్న భారతీయ జనతా పార్టీ 2012లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్ కలామ్‌ను సమర్థించాలని నిర్ణయించింది. ప్రణబ్‌కు పోటీగా కలామ్‌ను ప్రతిపాదించిన తృణమూల్ కాంగ్రెస్‌ను సమర్థించడానికి కూడా సిద్ధపడింది. కానీ, పోటీ చేసేందుకు తన అంతరాత్మ ఒప్పుకోవడం లేదు.. అని కలామ్ ప్రకటించిన తర్వాత బిజెపికి చేసేదేమీ లేకుండా పోయింది. నిజానికి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ మనస్ఫూర్తిగా రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించలేదన్న విషయం ఆనాటి రాజకీయాలు గమనించిన వారందరికీ తెలుసు. ప్రణబ్ ముఖర్జీ స్వయంగా తాను రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు తగిన వాతావరణాన్ని కల్పించుకున్నారు. 2002లో ఎన్డీఏ ప్రతిపాదించిన కలామ్‌ను సమర్థించిన ములాయం తన వైపు మొగ్గు చూపేలా చేసుకున్నారు. శరద్ పవార్, కరుణానిధితో పాటు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు ఆయనను సమర్థించారు. ప్రణబ్ ప్రధాని అయితే పీవీలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారని భావించిన సోనియా తప్పని పరిస్థితుల్లోనే ఆయనను రాష్ట్రపతిగా ప్రతిపాదించారు. తనకు కనీసం రాష్ట్రపతి అయినా ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సోనియా సన్నిహితులకు స్పష్టం చేశారని కూడా ఆరోజుల్లో వార్తలు వచ్చాయి. 2012లో మన్మోహన్‌సింగ్‌ను రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి, ప్రణబ్‌ను ప్రధానిగా నియమించి ఉంటే ఏం జరిగేది? రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, జగన్మోహన్ రెడ్డి వంటి అంశాలపై ఆయన ఏ విధంగా స్పందించి ఉండేవారు? అవినీతి కుంభకోణాల బారి నుంచి యుపిఏని రక్షించి 2014లో ఆయన నరేంద్రమోదీని అడ్డుకునేవారా? అన్నది వేరే సంగతి కానీ, ప్రణబ్‌కు కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించి ఉంటే కాంగ్రెస్ ఇంత దీనావస్థలో పడేది కాదని వాదించేవారున్నారు.


రాష్ట్రపతి అయిన తర్వాత ప్రణబ్ పూర్తిగా ఒక పాఠ్య పుస్తక రాజ్యాంగాధినేతగా వ్యవహరించారు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక చరిత్ర మానవ రూపందాల్చి మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లినా, మరే సదస్సుకు వెళ్లినా తన జ్ఞానాన్ని, లోతైన అధ్యయనాన్ని పంచుకోవడం తప్ప మరేమీ చేసేవారు కాదు. నిజానికి ప్రణబ్ రాజకీయ మేధస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయినా ఉపయోగించుకున్నారా అన్నది అనుమానమే. ఇవాళ దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నది. రాష్ట్రాలకు న్యాయపూర్వకంగా చెల్లించాల్సిన జీఎస్టీని కూడా చెల్లించలేక కేంద్రం చేతులెత్తేసి అప్పులు చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు చెబుతోంది. జాతీయ భద్రతా అవసరాలకు కూడా కటకట ఏర్పడుతుందని, ఆర్థిక సంక్షోభం దేవుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే ప్రకటించాల్సివస్తోంది. మరో వైపు చైనా తన దురాక్రమణను తీవ్రతరం చేసి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితుల గురించి మాట్లాడాల్సిన ప్రధానమంత్రి నెమళ్లకు ఆహారం తినిపిస్తున్న దృశ్యాలను పంచుకుంటున్నారు. ప్రజలకిచ్చే సందేశంలో పిల్లలాడుకునే బొమ్మల గురించి మాట్లాడుతున్నారు.


ప్రణబ్ వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల మరణించారు. ఇప్పుడు ఈ దేశంలో సంక్షోభాలను నివారించగల మేధావుల కొరత స్పష్టంగా కనపడుతోంది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లోనూ, ఇతర సంస్థల్లోనూ ప్రభుత్వం చేస్తున్న ఎంపికలు చూస్తుంటే మోదీ సర్కార్‌కు మేధావులు, రాజనీతిజ్ఞులు, నిపుణుల అవసరం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 2008లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మన్మోహన్ వెంటనే ప్రణబ్ సారథ్యంలో మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేశారు.. ఈ బృందంలో సభ్యులు కార్పొరేట్ రంగానికి చేయూతనివ్వాలని, ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు కల్పించాలని రకరకాల సూచనలు చేశారు. అవన్నీ విన్న ప్రణబ్ చివరిగా స్పందిస్తూ ‘ఈ సమయంలో మనం ఆర్థిక నిర్ణయాలు కాదు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి..’ అని వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయాలే 2009లో యుపిఏ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యాయి.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-09-02T06:45:28+05:30 IST