భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 25) ప్రకటించిన విషయం తెలిసిందే. 2021 ఏడాదికి పద్మవిభూషణ్-7, పద్మభూషణ్-10, పద్మశ్రీ-102.. మొత్తంగా 119 మంది వివిధ రంగాలకు చెందిన వారిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పద్మ అవార్డులలో ఇద్దరు ప్రముఖ సింగర్స్ ఉండటం విశేషం. అందులో ఒకరు దివంగత లెజెండ్ గాయకుడు ఎస్పీ బాలు (పద్మవిభూషణ్)కాగా, మరొకరు లెజెండ్ గాయని కె.ఎస్. చిత్ర (పద్మభూషణ్). తాజాగా తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు గాయని చిత్ర. ట్విట్టర్ ద్వారా స్పందిన ఆమె.. చాలా సంతోషంగా ఉందని.. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఆమె తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చిందనే వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా 42 సంవత్సరాల సంగీత ప్రయాణంలో ఎందరో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పుకునే క్షణమిది. నా తల్లిదండ్రులు, గురువులు, నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, సౌండ్ ఇంజనీర్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా కోసం ప్రార్థనలు చేసి.. నన్ను ఎంతగానో ప్రేమించే నా అభిమానుల వల్లే ఇది సాధ్యమైంది. వీరందరూ నా ఉన్నతికి కారణం. అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జైహింద్..'' అని తెలిపారు.