చట్టం–భాష్యం

ABN , First Publish Date - 2021-01-28T09:56:43+05:30 IST

మహారాష్ట్రలో పన్నెండేళ్ళ మైనర్‌ బాలికపై నలభైయేళ్ళ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు...

చట్టం–భాష్యం

మహారాష్ట్రలో పన్నెండేళ్ళ మైనర్‌ బాలికపై నలభైయేళ్ళ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగానైనా నిలిపివేసినందుకు సంతోషించాలి. ‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో)’ చట్టం ప్రకారం చర్మం చర్మం రాసుకుంటేనే లైంగికదాడి అవుతుందన్న వాదనతో, ఇక్కడ అటువంటిది జరగలేదు కనుక ఈ కేసు సదరు చట్టం పరిధిలోకి రాదని జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పు దేశాన్ని నిర్ఘాంతపరిచింది. బోంబే హైకోర్టు తీర్పు ఆందోళనకరంగా, పిల్లలను పరిరక్షించే చట్టాన్ని బలహీనపరచే విధంగా ఉన్నదని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సవాలు చేయడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పోక్సో చట్టం ప్రకారం మూడేళ్ళ జైలు అనుభవించాల్సిన వ్యక్తి హైకోర్టు తీర్పుతో ఏడాదిలోనే బయటకొచ్చేందుకు వీలు కలిగింది. పసిమొగ్గలను భద్రంగా కాపాడేందుకు ఉద్దేశించిన ఒక చట్టాన్ని కేవలం సాంకేతికాంశాల కోణంలో చూసి తీర్పులు ఇవ్వడం సముచితం కాదు. 


దిగువకోర్టు పోక్సో ప్రకారం మూడేళ్ళ జైలుశిక్ష వేస్తే, హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ న్యాయమూర్తి దీనిని కాదని, ఐపీసీ 354 సెక్షన్‌ ప్రకారం నిందితుడిమీద అభియోగాన్ని ఎత్తిపట్టి ఏడాది శిక్ష ఖరారు చేశారు. దుస్తులపై నుంచి చిన్నారి ఒంటిని తాకితే అది పోక్సో నేరం కాబోదనీ, స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు లేనందునా, ఆ చిన్నారి దుస్తుల లోపలకు నిందితుడు చేతులు దూర్చిన ఆధారాలు కూడా లేనందునా, చిన్నారుల ఒంటిని ‘తాకకూడని చోట తాకడం’ అన్నది కూడా ఇక్కడ జరగనందునా ఇది పోక్సో నేరం కిందకు రాదని న్యాయమూర్తి భాష్యం చెప్పారు. చర్మం చర్మం రాసుకోకపోతే ఏమీ జరగనట్టేనన్న ఈ వాదన సహజంగానే అందరినీ ఆందోళనలో ముంచెత్తింది. అత్యాచారానికి యత్నించడమో, ప్రైవేటుభాగాలను తాకడమో, శారీరకంగా వేధించడమో జరగనంతవరకూ అది పోక్సో కింద పరిగణించదగ్గ నేరం కాదనడం భవిష్యత్తులో అనేక కేసులను బలహీనపరచే అవకాశం ఉంది. ఐదేళ్ళక్రితం ఆ నిందితుడు వీధిలో ఆడుకుంటున్న ఆ పన్నెండేళ్ళ బాలికను తినడానికి ఏదో ఇస్తానని పిలిచి తన ఇంట్లోకి తీసుకుపోయాడు, తలుపులు వేశాడు, ఆమె ఛాతిని ఒత్తాడు. ఒంటిమీద బట్టలు కూడా తీయబోయాడు. ఇంతలోగా బాలిక భయంతో కేకలు వేస్తే నలుగురూ వచ్చారు, నాలుగుతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో బాలికపై లైంగికదాడికి పాల్పడే ఉద్దేశం నిందితుడి మనసులో ఉన్నదన్నది స్పష్టం. బాలిక కేకలు వేయకున్నా, ఎవరూ వినకపోయినా అక్కడ ఏమి జరిగేదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. దుస్తులమీదనుంచే అతడు ఆమె ఛాతిని వొత్తాడన్న ఏకైక అంశం ఆధారంగా, నిందితుడి అసలు ఉద్దేశాలు, పరిస్థితులకు విలువ ఇవ్వకుండా కేసును పోక్సో నుంచి తప్పించడం విచిత్రమే. దుస్తులు ఉన్నా లేకున్నా, ఆమె వక్షస్థలాన్ని తాకేముందు అతడు వాటిని ఉంచినా తీసినా అక్కడ జరిగింది లైంగిక దాడే. ఇకపై, దుస్తులమీదనుంచి తాకినా నేరమేనంటూ పోక్సో చట్టాన్ని సవరించాలేమేనని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, రాబోయే రోజుల్లో వేధింపులు ఎంత తెలివిగా జరుగుతాయో సామాజిక మాధ్యమాల్లో మరికొందరు ఊహిస్తున్నారు. 


తీర్పుపై వివిధ సంస్థలు, సంఘాలు తక్షణమే స్పదించినందుకు, సర్వోన్నత న్యాయస్థానం దానిని నిలిపివేసినందుకు సంతోషించాలి. బాలబాలికలు, మహిళలను లైంగికదాడులనుంచి రక్షించే చట్టాల్లో వాడే పదాలు, నిర్వచనాలు ఏమాత్రం గందరగోళానికి తావులేని రీతిలో విస్పష్టంగా ఉండాలని ఈ ఉదంతం తెలియచెబుతున్నది. తప్పించుకొనేందుకు నిందితులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో ఇవి రూపొందాలి. ‌నేడు మన చుట్టూ అలుముకున్న అశ్లీల కాలుష్య వాతావరణంలో, పిల్లలపై దాడులు అంతకంతకూ హెచ్చుతున్న నేపథ్యంలో, కుటుంబీకులు, సన్నిహితులే దుర్మార్గాలకు పాల్పడుతున్న స్థితిలో, చట్టాలు బలంగా, న్యాయస్థానాలు కఠినంగా ఉండాల్సిందే.

Updated Date - 2021-01-28T09:56:43+05:30 IST