యోగిని అవమానించేలా వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-03T08:34:27+05:30 IST

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, ‘ది వైర్‌’ సంపాదకుడు సిద్ధార్థ్‌ వరదరాజన్‌పై...

యోగిని అవమానించేలా వ్యాఖ్యలు

  • ది వైర్‌ సంపాదకుడిపై కేసు
  • లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ నవమి వేడుకల్లో పాల్గొన్నారని సిద్దార్థ్‌ విమర్శ
  • వెనక్కు తీసుకోవాలి: చిదంబరం

అయోధ్య, ఏప్రిల్‌ 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, ‘ది వైర్‌’ సంపాదకుడు సిద్ధార్థ్‌ వరదరాజన్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో తబ్లిగ్‌ జమాత్‌ కార్యక్రమం నిర్వహించిన రోజే అయోధ్యలో షెడ్యూల్‌ ప్రకారం మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2వరకు శ్రీరామ నవమి వేడుకలు జరుగుతాయని, కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రాముడే కాపాడతాడని సీఎం యోగి ప్రకటించారని ట్విటర్‌లో సిద్ధార్థ్‌ పేర్కొన్నారు. అలాగే రామజన్మభూమి స్థలంలో జరిగిన మతపరమైన వేడుకలో (శ్రీ రామ నవమి) యోగి పాల్గొన్నారని, లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు ఆయన ఇలా పాల్గొనడం ఏమిటని ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో వివరణ ఇస్తూ కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రాముడు కాపాడతాడని చెప్పింది యోగి కాదని, అయోధ్య ఆలయ ట్రస్టు చీఫ్‌ ఆచార్య పరంహన్స్‌ అని పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు.. సీఎం యోగిని అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ ఆయనపై ఫైజాబాద్‌ కోత్వాల్‌ పోలీసులు సెక్షన్‌ 188, 505(2) కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైనదిగా, పత్రికా స్వేచ్ఛపై ఘోరమైన దాడిగా సిద్ధార్థ్‌ అభివర్ణించారు. కాగా సిద్ధార్థ్‌పై యూపీ సర్కారు కేసు నమోదు చేయడం గర్హనీయమని, మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమేనని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.


Updated Date - 2020-04-03T08:34:27+05:30 IST