Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Feb 2020 05:41:06 IST

నా వాటా నాకు వస్తుందా?

twitter-iconwatsapp-iconfb-icon
నా వాటా నాకు వస్తుందా?

చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం మా నాన్నకు ఒక ఇంటిస్థలం మంజూరు చేసింది. నాన్న ఆ స్థలాన్ని అమ్మేశాడు. మా అక్కాచెళ్లెల్లలో నేను పెద్దదాన్ని. కొన్నాళ్ల క్రితం స్థలం కొన్న వ్యక్తి తిరిగి అమ్ముతుంటే, నేను నా సొంత డబ్బుతో కొనుక్కున్నా. నాన్నకుగానీ, నా చెల్లెలికిగానీ నేను కొన్న ప్లాటుతో ఏ సంబంధమూ లేదు. ఆ ప్లాట్‌లో నేను ఇల్లు కట్టుకున్నా. ఇంటిపన్ను రసీదు, ఇతర ఆధారాలు నా వద్ద ఉన్నాయి. అయితే కొంతకాలం క్రితం మా పాత ఇల్లు కూలిపోయింది. దాంతో నా తల్లిదండ్రులను మా ఇంటికి తీసుకువచ్చాను. వాళ్లు నా దగ్గర ఉంటూ, మా ఇంటి ఖాళీస్థలంలో మా నాన్న ప్రభుత్వ సహాయంతో రెండు గదులు నిర్మించాడు. అయితే, గ్రామపంచాయితీ రికార్డుల్లో ఇప్పటికీ ఆ ప్లాటు మా నాన్న పేరు మీదే ఉంది. ఈమధ్య నా చెల్లెలి కొడుకు ఈ రెండు ఇళ్లు తాతగారు నిర్మించినవే కాబట్టి వాటిలో తనకు భాగం వస్తుందని మాతో ఘర్షణకు దిగాడు. గ్రామపెద్దల సహాయంతో నన్ను, నా భర్తను కొట్టి మేము ఉంటున్న ఇంటిని అతని పేరు రాయించుకుని, వాటిపై మాతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. నా ఖాళీ స్థలం ఖరీదు, మా తండ్రిగారు నిర్మించిన ఇంట్లో నాకు సగభాగం వచ్చే మార్గం లేదా?.

- ఎల్‌.పద్మ, మహబూబ్‌నగర్‌

ప్రభుత్వం వారు ఇల్లు లేని నిరుపేదలకు కొంత నివాసయోగ్యమైన భూమిని పట్టాగా ఇస్తూ ఉంటారు. కాకపోతే పట్టా ఇవ్వడం అనేది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. పట్టా భూమిలో ఇల్లు నిర్మించుకుని అందులో నివసించవలసిందే కానీ, అమ్ముకోవడానికి వీలుండదు. అటువంటి పట్టా భూముల వివరాలు ప్రభుత్వం విధిగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తెలియచేస్తుంది. ఒకవేళ ఎవరైనా పట్టా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేసినప్పుడు అలాంటి రిజిస్ట్రేషన్‌కు సమర్పించిన దస్తావేజులను రిజిస్టర్‌ చేయరాదనే ఆదేశాలుంటాయి. ఎవరైనా పట్టా షరతులకు విరుద్ధంగా భూమి అమ్మినప్పుడు పట్టా ఇచ్చిన ప్రభుత్వ అధికారికి ఆ విషయాన్ని తెలియచేయాల్సి ఉంటుంది. అలా చేస్తే పట్టాను రద్దుపరుస్తూ, ఆ భూమి వేరే వ్యక్తుల స్వాధీనంలో ఉన్నట్లయితే, ఆ భూమిని తిరిగి స్వాధీన పరుచుకుంటారు. 

మీ విషయంలో మీ నాన్నగారు ప్రభుత్వం ద్వారా పొందిన ఇంటి స్థలాన్ని వేరే వ్యక్తికి అమ్మారని, ఆ వ్యక్తి నుంచి తిరిగి మీరు కొన్నట్లుగా రాశారు. వాస్తవానికి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిని అమ్ముకోవడమే చెల్లదు. అందువల్ల ఇప్పటికీ, మీ నాన్నగారికి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిగానే పరిగణించబడుతుంది. మీ నాన్నగారికి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిలో మీరు ఇల్లు నిర్మించినట్లుగా తెలిపారు. అయితే మీ చెల్లెలి కొడుకు మీ నుంచి బలవంతంగా ఆ ఇంటిని స్వాధీనపరుచుకుని, మీ నాన్నగారితో పాటు మీతో కూడా సంతకం చేయించుకున్నట్లుగా తెలిపారు. మిమ్మల్ని బలవంత పెట్టి, మీ నాన్నతో, మీతో దస్తావేజు రాయించుకున్నప్పటికీ, దానిద్వారా అతనికి చట్టపరమైన హక్కులు సంక్రమించవు. ప్రభుత్వం ద్వారా లభించిన భూమిని, మీ నాన్నగారు అమ్ముకొనగా, ఆ కొన్న వ్యక్తి నుంచి తిరిగి మీరే కొన్నారు. అందులో నిర్మాణం కూడా చేశారు. కాబట్టి ఈ ఆధారాలన్నీ చూపుతూ మిమ్మల్ని మాత్రమే ఆ ఇంటికి యజమానిగా గుర్తించమని కోర్టును సంప్రదిస్తే మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. పైగా మీ నాన్నగారి ఆస్తిలో న్యాయంగా సగభాగమే కోరుతున్నారు కాబట్టి మీ వాటా మీకు లభిస్తుంది. వాస్తవానికి మీ నాన్నగారి తదనంతరం మాత్రమే అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆస్తిని పంచుకోవడానికి వీలవుతుంది. మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆయన ఇష్టాయిష్టాల మేరకే ఆ ఆస్తిని మీరు విభజించుకోవలసి ఉంటుంది. చట్ట విరుద్ధంగా వాళ్లు ఏ విధమైన దస్తావేజులు రాయించుకున్నప్పటికీ వాటికి విలువ ఉండదు. అందువల్ల మీ నాన్నగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో మీ అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ సమానమైన వాటా ఉంటుంది.

ఫ ఒడ్నాల శ్రీహరి

న్యాయవాది, హైదరాబాద్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.