Abn logo
Jan 26 2021 @ 22:39PM

దాడిచేసిన రైతులపై చట్టపరమైన చర్యలు: ఢిల్లీ పోలీస్

న్యూఢిల్లీ: ఢిల్లీలో రైతులు మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులపై దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ‘‘ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులపై దాడిచేసిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..’’ అని ఢిల్లీ జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ పోలీసులు, రైతు నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన మీదట ఏ సమయంలో, ఏ మార్గాల్లో ట్రాక్టర్‌ ర్యాలీ జరగాలన్నది నిర్ణయించామని ఆయన వివరించారు.


‘‘ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతులు నిర్ణీత సమయాని కంటే ముందే ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆందోళన స్థలం వద్ద ఉదయం 11 గంటలకు జెండా వందనం ముగిశాక నిరసన చేపడతామనీ.. అనంతరం ముందుగా నిర్ణయించిన మార్గాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ముందుగా హామీ ఇచ్చారు. కానీ ఉదయం 9:30 గంటలకు ఓ గ్రూప్ ఒక్కసారిగా బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించింది. అక్కడే పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది..’’ అని జాయింట్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత మిగతా రైతులు కూడా రకరకాల మార్గాల్లో ప్రవేశించారని ఆయన వెల్లడించారు. ‘‘అక్షరధామ్‌ ఆలయానికి కిలోమీటర్ దూరంలో మేము రైతులకు ఇంకా రెండు గంటలు సమయం ఉందని చెప్పేందుకు ప్రయత్నించాం. టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జి చేసి వారిని నిలువరించేందుకు ప్రయత్నించాం. కానీ రైతులు ఉద్దేశ్యపూర్వకంగా పోలీస్ అధికారులపై దూసుకెళ్లారు. బారికేడ్లు విరగ్గొట్టి, పోలీసు వాహనాలు ధ్వంసం చేసి, ఘర్షణకు దిగారు. దీనివల్ల అనేక మంది పోలీసులు గాయపడ్డారు..’’ అని అలోక్ కుమార్ వెల్లడించారు. కాగా ఐటీవో వద్ద ఓ ట్రాక్టర్ బారికేడ్లను ఢీకొట్టి తిరగబడడంతో ఒక రైతు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement