కాలు, చేయి నరికి.. బారికేడ్‌కు వేలాడదీసి వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-17T08:08:12+05:30 IST

మణికట్టు వరకు ఎడమ చేతిని నరికి.. కుడి పాదాన్ని తెగ నరికిన దుండగులు ఓ దళితుడిని దారుణంగా హతమార్చారు.

కాలు, చేయి నరికి.. బారికేడ్‌కు వేలాడదీసి వ్యక్తి దారుణ హత్య

  • పంజాబ్‌లోని సింఘు సరిహద్దులో ఘటన
  • తమదే బాధ్యత అన్న సిక్కు నిహంగ్‌ దళం
  • గురు గ్రంథసాహిబ్‌ను అవమానపర్చాడని వెల్లడి
  • దాడికి సంబంధించిన వీడియోల విడుదల


న్యూఢిల్లీ, అక్టోబరు 16: మణికట్టు వరకు ఎడమ చేతిని నరికి.. కుడి పాదాన్ని తెగ నరికిన దుండగులు ఓ దళితుడిని దారుణంగా హతమార్చారు. ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు వద్ద.. రైతుల ఆందోళన వేదిక సమీపంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ హత్యకు తనదే బాధ్యత అంటూ నిహంగ్‌ దళానికి చెందిన ఓ యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ సాహిబ్‌’ను అవమానపరిచినందుకు ఈ చర్యకు పాల్పడ్డట్టు నిహంగ్‌ దళం ప్రకటించింది. ఈ హత్యాకాండకు సంబంధించిన మూడు వీడియోలను విడుదల చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌లోని తర్న్‌తరన్‌ జిల్లా చీమఖుర్ద్‌ గ్రామానికి చెందిన లఖ్‌బీర్‌ సిగ్గా సింఘ్‌(35) రోజుకూలీగా పనిచేసేవాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డ్రగ్స్‌కు బానిస అయిన లఖ్‌బీర్‌ను కుటుంబం దూరంగా పెట్టింది. ఐదు రోజుల క్రితం రూ.50తో ఊరినుంచి బయలుదేరిన లఖ్‌బీర్‌.. శుక్రవారం ఉదయం సింఘు వద్ద రైతుల ఆందోళన వేదిక సమీపంలో.. ఓ పోలీసు బ్యారీకేడ్‌కు వేళాడుతూ శవంగా కనిపించాడు. అతని కుడి పాదం, ఎడమ చేతిని దుండగులు నరికేశారు. 


ఒంటిపై 10 దాకా పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న కుండ్లీ ఠాణా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా.. శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని గుర్దా్‌సపూర్‌ జిల్లాకు చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌ అనే యువకుడు ఈ హత్యకు తానే బాధ్యుడినని ప్రకటిస్తూ.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈలోగా.. లఖ్‌బీర్‌ హత్యకు సంబంధించిన మూడు వీడియోలు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయ్యాయి. అందులో నీలి రంగు సంప్రదాయ దుస్తులు ధరించిన సిక్కుల నిహంగా దళానికి చెందిన కొందరు వ్యక్తులు అతడిపై మూకదాడికి పాల్పడుతున్న దృశ్యాలు కనిపించాయి.


సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అవమానపరిచినందుకే ఈ చర్యకు పాల్పడుతున్నామని నిహంగా దళం సభ్యులు ప్రకటించారు. వీడియోలో కనిపిస్తున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం సరబ్‌జీత్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. న్యాయమూర్తి ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. అతణ్ని ఠాణాకు తరలిస్తున్న సమయంలో.. మీడియా ప్రతినిధులు ‘ఎలాంటి పశ్చాత్తాపం లేదా’ అని ప్రశ్నించగా.. సరబ్‌జీత్‌ పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. నిందితులు ఎవరైనా.. కఠినంగా శిక్షించాలని అధికారులను హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదేశించారు. ఈ ఘటనను సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎ్‌సకేఎం) తీవ్రంగా ఖండించింది. హతుడు దళిత సిక్కు అని, హిందూ-సిక్కుల వివాదంగా దీన్ని చూడొద్దని సూచించింది.


ఘటనపై అన్నీ అనుమానాలే..!

లఖ్‌బీర్‌ హత్యపై అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయని అతని స్వగ్రామం చీమఖుర్ద్‌కు చెందిన ప్రజలు అంటున్నారు. లఖ్‌బీర్‌ దైవధూషణ చేశాడని, పవిత్ర గ్రంథాన్ని అవమానించాడనే ఆరోపణల్లో వాస్తవం ఉండకపోవచ్చన్నారు. డ్రగ్స్‌కు బానిసైన లఖ్‌బీర్‌ను ఎవరైనా డబ్బు ఆశ చూపించి రైతుల ఆందోళన వద్దకు తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక.. లఖ్‌బీర్‌ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు సిక్కు మతగురువులు, గ్రామస్తులు ఎవరూ హాజరు కాలేదు. కేవలం 12 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులను ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలైంది. లఖ్‌బీర్‌ ఘటన ప్రస్తావిస్తూ 2021 మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ తాజాగా పిటిషన్‌ దాఖలైంది.


జాష్‌పూర్‌ ఉదంతంపై..

యూపీలోని లఖీంపూర్‌ ఖీరీ తరహాలో ఛత్తీ్‌సగఢ్‌లోని జాష్‌పూర్‌లో జరిగిన ఘటనపై ఇద్దరు సీఎంలు, ఒక మాజీ సీఎం పరస్పరం ‘ట్వీటాస్త్రాలు’ సంధించుకున్నారు. దుర్గామాత ఊరేగింపుపై వాహనం దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోగా.. 17 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం ట్విటర్లో స్పందిస్తూ.. ఛత్తీ్‌సగఢ్‌ సీఎం క్షతగాత్రులకు వైద్య సేవలందించాలని కోరారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘లఖీంపూర్‌ ఘటనలో నిందితులకు బేడీలు వేయాలి’’ అంటూ ఆదిత్యనాథ్‌కు సవాల్‌ విసిరారు.

Updated Date - 2021-10-17T08:08:12+05:30 IST