బడ్జెట్‌ను నిరసిస్తూ ఏపీలో వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2022-02-02T19:23:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరిసిస్తూ ఏపీలో వామపక్షాలు నిరసనకు దిగాయి.

బడ్జెట్‌ను నిరసిస్తూ ఏపీలో వామపక్షాల నిరసన

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరిసిస్తూ ఏపీలో వామపక్షాలు నిరసనకు దిగాయి. సీపీఎం, సీపీఐ నేతలు కేంద్రం తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి నోట కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వినపడలేదంటే.. కేంద్రం రాష్ట్రం పట్ల ఎంత వివక్ష చూపుతోందో అర్థమవుతోందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరినా ఇస్తాం.. ఇస్తామంటూ చివరికి కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపించిందని మండిపడ్డారు. అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైందని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు.


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్ బాగుందంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోము వీర్రాజుగా ఆయన మంచిగా మాట్లాడితే బాగుంటుందని.. సారాయి వీర్రాజుగా మాట్లాడితే ఏం చెప్పగలమని అన్నారు. రైతుల కిచ్చే సబ్సిడీ.. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోత విధించారని మండిపడ్డారు. ధరలు పెరిగిపోయి ప్రజలు బాధపడుతుంటే ఆ విషయమే బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. దళితులు, గిరిజనులకు ఏం కేటాయించారో, ఏపీకి ఏమిచ్చారో సోము వీర్రాజు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-02T19:23:05+05:30 IST