ఎడ తెగని జాప్యం

ABN , First Publish Date - 2020-09-24T06:41:58+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వారధి నిర్మాణంలో ఎడ తెగని జాప్యం జరుగుతోంది. 2016లో పూర్తి కావాల్సిన వారధి పనులు 2020

ఎడ తెగని జాప్యం

భద్రాద్రి రెండో వారధి నిర్మాణం వచ్చే ఏడాదికైనా పూర్తయ్యేనా ?

వారం రోజుల్లో పనులు పునః ప్రారంభం


భద్రాచలం, సెప్టెంబరు 23: భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వారధి నిర్మాణంలో ఎడ తెగని జాప్యం జరుగుతోంది. 2016లో పూర్తి కావాల్సిన వారధి పనులు 2020 నాటికి సైతం పూర్తి కాని పరిస్థితి ఉందంటే పనులు ఏ విధంగా సాగుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. తొలి నుంచి వివిధ రకాల సమస్యలతో పనుల తీరు నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖఅధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి పనుల జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, నోటీసులు, జారీ చేయడంతో పాటు పెనాల్టీలు కూడా వేశారు. నిర్మాణ సంస్థపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించగా చివరకు తామే పనులను పూర్తి చేస్తామని మరో అవకాశం ఇవ్వాలని సంస్థ కోరినట్లు సమాచారం. దీంతో రెండో వారధి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో పునః ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  


2015 ఏప్రిల్‌ ఒకటిన పనులు ప్రారంభం

భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వారధి పనులు వాస్తవానికి జూలై 2014లో ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతికపరమైన అనుమతుల జాప్యంతో 2015 ఏప్రిల్‌ ఒకటిన రూ.65కోట్లతో ప్రారంభించారు. ముంబైకు చెందిన ఒక సంస్థ ఈ వారధి టెండర్‌ చేజిక్కించుకుంది. వారధి నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా నత్తనడక పనులతో నేటికీ పూర్తికాలేదు.  ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ అధికారులు పలుమార్లు సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేసినా ఎటువంటి పురోగతి లేదు. 2016 జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశించిన సమయం కంటే ఐదేళ్లు సమయం కావస్తున్నా పనులు పూర్తి చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రెండుసార్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు సదరు  సంస్థకు నిర్మాణ గడువు తేదీని పొడిగించారు. 


2021 జూన్‌ నాటికైనా పూర్తయ్యేనా ?

రెండుసార్లు గడువును పొడిగించినా ఇంకా పనులు 74శాతం మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో తమకు వేతనాలు చెల్లించడం లేదని సిబ్బంది పనులను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ కారణంగా సిబ్బంది తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో వారధి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనంతరం గోదావరి వరదలు రావడంతో పనులు చేపట్టేందుకు సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో తామే పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ జాతీయ రహదారుల శాఖ అధికారులకు తెలపడంతో మళ్లీ పనులను చేపట్టేందుకు వారు అనుమతించారు. ఈ పరిస్థితుల్లో 2021 జూన్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని సదరు సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 


వారం రోజుల్లో పనులు పునః ప్రారంభం..జాతీయ రహదారుల శాఖ ఈఈ యు.వెంకటేశ్వరరావు

భద్రాచలం రెండో వారధి పనులు ఇప్పటి వరకు 74 శాతం పూర్తయ్యాయి. 2016లో వారధి పనులు పూర్తి కావాల్సి ఉండగా రెండుసార్లు గడువు పొడిగించాం. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సకాలంలో పనులు పూర్తి చేయనందుకు నోటీసులు జారీ చేశాం. పెనాల్టీలు వేశాం.

Updated Date - 2020-09-24T06:41:58+05:30 IST