రైతు సంస్థల భారత్ బంద్‌కు వామపక్షాల మద్దతు

ABN , First Publish Date - 2020-12-05T20:32:30+05:30 IST

రైతు సంఘాలు ఈనెల 8న 'భారత్ బంద్‌'కు ఇచ్చిన పిలుపునకు వామపక్ష పార్టీలు ..

రైతు సంస్థల భారత్ బంద్‌కు వామపక్షాల మద్దతు

న్యూఢిల్లీ: రైతు సంఘాలు ఈనెల 8న 'భారత్ బంద్‌'కు ఇచ్చిన పిలుపునకు వామపక్ష పార్టీలు శనివారంనాడు మద్దతు ప్రకటించాయి. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్‌లో ఇతర విపక్ష పార్టీలు కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చాయి. రైతుల ఆందోళనకు సీపీఐ (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్‌ సంఘీభావం ప్రకటించాయి.


రైతులపై బీజేపీ దుష్ప్రచారం జరుపుతోందంటూ వామపక్షాలు విమర్శించాయి. భారత వ్యవసాయ రంగం, దేశ ఆహార భద్రతను పరిరక్షించేందుకు జరుగుతున్న పోరాటంగా రైతుల పోరాటాన్ని అభివర్ణించాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు, ప్రతిపాదిత విద్యుత్ (సవరణ)బిల్లు-2020ను రద్దు చేయాలన్న రైతు సంఘాల డిమాండ్‌కు తాము మద్దతిస్తున్నట్టు ప్రకటించాయి. రైతు సమస్యలపై ఇతర రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపి, డిసెంబర్ 8న జరిగే బంద్‌కు మద్దతు, సహకారం అందించాలని వాపపక్ష పార్టీలు కోరాయి.


వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం చేసిన ప్రతిపాదన తమకు సంతృప్తికరంగా లేవని రైతు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించుకుంటూ ఈనెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత పది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-12-05T20:32:30+05:30 IST