బతికుండగానే శ్మశానంలో వదిలేశారు..!

ABN , First Publish Date - 2022-05-24T07:10:40+05:30 IST

కుటుంబ బాధ్యతలు మోస్తూ కన్న బిడ్డలకు పెళ్లిల్లు చేసి, ఓ ఇంటి వారిని చేసిన ఓ వృద్ధుడు అందరూ ఉండి అనాథలా మిగిలాడు.

బతికుండగానే శ్మశానంలో వదిలేశారు..!
నాగేశ్వరరావు మృతదేహాన్ని బటయకు తెస్తున్న శ్రీహరి

అందరూ ఉండీ అనాఽథలా వృద్ధుడు

అక్కున చేర్చుకున్న శివం ఫౌండేషన్‌

అతని మృతితో అంత్యక్రియలు 

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 23 : కుటుంబ బాధ్యతలు మోస్తూ కన్న బిడ్డలకు పెళ్లిల్లు చేసి, ఓ ఇంటి వారిని చేసిన ఓ వృద్ధుడు అందరూ ఉండి అనాథలా మిగిలాడు. వయసులో ఉన్నపుడు కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను ఎంతో అపురూపంగా, అన్యోనంగా పెంచిన ఆయన బతికుండగానే శ్మశాన వాటికలో వదిలేశారు. విషయం తెలుసుకుని మానవత్వం చాటిన శివం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గొల్లపూడి శ్రీహరి ఆ వృద్ధుడికి ఆశ్రయం కల్పించారు. నెల రోజులపాటు మందులు అందిస్తూ, ఆలనాపాలనా చూసుకున్న ఫౌండేషన్‌ సేవా స్ఫూర్తి అభినందనీయం. ఇదిలా ఉండగా వృద్ధుడు ఆదివారం మరణించడంతో అంత్యక్రియలను సైతం నిర్వహించిన శివం ఫౌండేషన్‌ సేవకు సలాం అంటున్నారు పలువురు. వివరాల్లోకెళితే.. చీమకుర్తికి చెందిన దొంతు నాగేశ్వరరావు (75) కొద్ది రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. రోజువారీ కూలీ నాలీ చేసుకుంటూ కుమార్తెల పంచన బతుకుతూ కాలాన్ని నెట్టుకొస్తున్న వృద్ధుడైన నాగేశ్వరరావుకు గత నెలలో పక్షవాతం సోకింది. దీంతో మంచానికే పరిమితం కావడంతో కన్న కూతుర్లకు తండ్రి భారమైపోయాడు. దీంతో బతికుండగానే చీమకుర్తి శ్మశాన వాటికలో వదిలేశారు. కదలలేని పరిస్థితుల్లో, నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ నాగేశ్వరరావు రెండు, మూడు రోజులు శ్మశాన వాటికలోనే కాలం గడిపాడు విషయం ఆ ఆనోటా, ఈ నోటా బయటకు రావడంతో ఒంగోలులోని జడ్పీ కాలనీలో ఏర్పాటు చేసిన శివం ఫౌండేషన్‌ స్పందించింది. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గొల్లపూడి శ్రీహరి మానవత్వం చాటారు. కదలలేని స్థితిలో సమాధుల మధ్య నిర్జీవంగా పడి ఉన్న నాగేశ్వరరావును అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. ఆయన ఆరోగ్యం కోసం మందులు వాడుతూ, వేళకు భోజనం అందిస్తూ రక్తసంబంధం లేకపోయినా, కన్న కొడుకులా అన్నీ సపర్యలు చేశారు. దురదృష్టవశాత్తు నాగేశ్వరరావు ఆదివారం కన్ను మూశారు. దీంతో శ్రీహరి మృతుడి బంధువులకు సమాచారం అందించగా  ఒక కుమార్తె మాత్రం వచ్చి  ఐదు నిమిషాలు చూసి వెళ్లిపోయింది. మిగిలిన బంధువులెవరూ కనీసం కన్నెత్తి చూడలేదు. దీంతో శివం ఫౌండేషన్‌ తరుపున శ్రీహరి ఒంగోలులోని కమ్మపాలెంలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులే కాదని వదిలించుకున్న ఈ ఘటన ఏమీ కాని ఓ వ్యక్తి అన్నీ తానై చూపిన మానవత్వానికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. 


Updated Date - 2022-05-24T07:10:40+05:30 IST