రెవెన్యూలో పదోన్నతుల లీల!

ABN , First Publish Date - 2021-07-25T07:42:02+05:30 IST

భూ సేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేయకున్నా స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎ్‌సడీసీ)గా పదోన్నతి అవకాశం కల్పించాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది

రెవెన్యూలో పదోన్నతుల లీల!

భూసేకరణ విభాగంలో పనిచేయకున్నా స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్‌

జీఓ 187 జారీ చేసిన ప్రభుత్వం

2001 నాటి జీఓ 549 అమలుపై నిర్లక్ష్యం

కోరిన వారిని అందలం ఎక్కించే చాన్స్‌

పైరవీలకు, ప్రలోభాలకు అవకాశం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భూ సేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేయకున్నా స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎ్‌సడీసీ)గా పదోన్నతి అవకాశం కల్పించాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఉత్తర్వులు(జీఓ187) జారీ చేశారు. జిల్లాల పరిధిలో భూ సేకరణ విభాగం ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌.. వారి సర్వీసులో కనీసం ఒక్కసారైనా భూ సేకరణ విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేయాలని 2001లో నిబంధన తీసుకొచ్చారు. అలా పనిచేసిన వారికే స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించాలని జీఓ 549 జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ నిబంధనే అమలవుతోంది. అయితే.. భూ సేకరణ విభాగం అంటే అదో పనిష్మెట్‌ పోస్టు అన్న అభిప్రా యం అధికారుల్లో నెలకొంది. దీంతో తమ పలుకుబడి ఉపయోగించి ఎక్కువ మంది ఆర్‌డీవో, లేదా ఇతర కీలక పోస్టింగ్‌లు తెచ్చుకునేవారు. భూ సేకరణ విభాగంలో పనిచేయడానికి విముఖత వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలోనే 2001లో ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే, డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీలో ఇప్పుడు ఇదో సమస్యగా మారింది. భూ సేకరణ విభాగంలో పనిచేయని వారికి స్పెషల్‌గ్రేడ్‌  పదోన్నతులు ఇచ్చే అవకాశమే లేదు. అయితే, డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన సీనియారిటీ, ఇతర అంశాల్లో రెగ్యులర్‌ ప్యానల్స్‌ తయారీలో ఇబ్బందులొస్తున్నాయి. భూ సేకరణ విభాగంలో పనిచేయని వారికి ప్యానల్స్‌లో చోటుదక్కినా, పదోన్నతులు వచ్చే అవకాశం కోల్పోతున్నారు. దీంతో, భూసేకరణలో పనిచేయని వారికి కూడా స్పెషల్‌గ్రేడ్‌ పదోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. 2013-21 ప్యానల్స్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్లకు 2013-20 ప్యానల్‌ ఇయర్‌ వరకు పదోన్నతులు కల్పించనున్నారు. 


ఈ రూల్‌ ఎందుకు? 

భూ సేకరణ విభాగం అనేది అప్రాధాన్యమైన పోస్టు అన్న భ్రమలు తొలగించేందుకు, డిప్యూటీ కలెక్టర్‌లు సర్వీసులో భాగంగా ఏదో ఒక సమయంలో ఆ పోస్టులో పనిచేయాలన్న ఉద్దేశంతో 2001లో జీఓ 549ని తీసుకొచ్చారు. దీంతో ప్రతి డిప్యూటీ కలెక్టర్‌ను ఏదో ఒక సమయంలో ఆ విభాగంలో పోస్టింగ్‌ ఇచ్చేలా బాధ్యత తీసుకోవాల్సింది సర్కారే. అయితే, డిప్యూటీ కలెక్టర్‌కు భూ సేకరణలో పనిచేసినా, చేయకున్నా ఆర్‌డీవోగా, ఇంకా కీలకమైన పోస్టుల్లో పనిచేయాలన్న కుతూహలం ఉంటుంది. ప్రతిభ, పనితీరు ఆధారంగా కొందరిని ఏరికోరి ఆర్‌డీవోలుగా నియమిస్తారు. మరి కొందరు అవేవి లేకున్నా నేతల ప్రాపకంతో ఆ పోస్టులు పొందుతారు. ఒక వేళ భూసేకరణ విభాగంలో పోస్టింగ్‌ ఇచ్చినా చేరకుండా పైరవీలు చేయుంచుకొని మరో విభాగానికి మారిపోతారు.  ఏ అండాదండా లేనివారు, కనీసం ఎక్కడో ఒకచోట పోస్టింగ్‌ ఉంటే చాలనుకునే వారికి అక్కడ పోస్టింగ్‌ ఇచ్చిన వెంటనే చేరిపోతున్నారు. కొందరిని కాలం, సమయంతో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి అక్కడే కొనసాగిస్తారు. దీనివల్ల కొందరికే మేలు జరుగుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్న జీఓ 549 లక్ష్యమే దెబ్బతింటోంది. 


జీవో 549 అమలుపై నిర్లక్ష్యం

భూ సేకరణలో పనిచేయకున్నా స్పెషల్‌గ్రేడ్‌  పదోన్నతులు ఇవ్వాలంటూ తాజా నిబంధన తీసుకురావడంతో, 549 జీఓను సర్కారు సరిగా అమలు చేయలేదనే విషయం స్పష్టమవుతోంది. జీవో అమలు కాకపోవడానికి బాధ్యులెవరు? దీనిపై ఎప్పుడైనా సమీక్షించారా? అనేవి ప్రశ్నలుగా మిగిలాయి. వీటి సంగతేమిటో తేల్చకుండా, ప్రతి అధికారి ఆ విభాగంలో పనిచేయకపోవడం వారి తప్పుకాదు కాబట్టి పదోన్నతులు ఇచ్చి తీరాల్సిందే అని వెసులుబాటు ఇవ్వడం తీవ్రమైన అంశమని సీనియర్‌ అధికారులు ఆక్షేపిస్తున్నారు. ‘భూ సేకరణ విభాగంలో పనిచేసిన వారు అక్కడే పోస్టింగ్‌ రావాలని కోరుకున్నట్లా? ఇప్పటి వరకు ఆర్‌డీవోలుగా నియమితులు కాని వారు కూడా ఆ పోస్టు దక్కకూడదని కోరుకున్నట్లే అవుతుందా? ఇది అసమానతలను పెంచిపోషించే చర్యలా ఉంది. ఈ మాత్రం దానికి ఆ రూల్‌ ఎందుకు? జీఓ 549 ఎందుకు? రద్దుచేస్తే పోయేది కదా!’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-07-25T07:42:02+05:30 IST